కేసీఆర్‌ పాలనలో దగాపడ్డ దళితులు

ABN , First Publish Date - 2022-05-28T05:29:49+05:30 IST

కేసీఆర్‌ ఏడున్నరేళ్ల పాలనలో దళిత, బహుజనులు దగా పడ్డారని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవాలే) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు.

కేసీఆర్‌ పాలనలో దగాపడ్డ దళితులు
కేడీసీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న రాందాస్‌ అథవాలే

ఏడున్నరేళ్ల్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..
ప్రధాని నేతృత్వంలో అన్ని వర్గాలకు న్యాయం
రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే
కేడీసీ మైదానంలో దళిత, బహుజన రాజ్యాధికార చైతన్య బహిరంగ సభ


వడ్డెపల్లి, మే 27:
కేసీఆర్‌ ఏడున్నరేళ్ల పాలనలో దళిత, బహుజనులు దగా పడ్డారని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవాలే) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల(కేడీసీ) మైదానంలో శుక్రవారం ఆర్‌పీఐ (ఎ) ఆధ్వర్యంలో దళిత, బహుజన రాజ్యాధికార చైతన్య బహిరంగ సభ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పసుల రవికుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, విద్య, వైద్యం అందించకుండా బహుజనులకు అన్యాయం చేశారని అన్నారు. విద్య, వైద్యం కార్పొరేట్‌ శక్తుల్లో బందీ అయిందని విమర్శించారు. బీఆర్‌ అంబేద్కర్‌ స్థాపించిన ఆర్‌పీఐ దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీల అభ్యున్నతి కోసం పని చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెడితే అక్కడి అగ్రవర్ణ కులాలు ఆందోళనలు చేసి ప్రజాప్రతినిధుల ఆస్తులను ధ్వంసం చేయడం దుర్మార్గమని అన్నారు. అంబేద్కర్‌ ఇప్పుడు జీవించి ఉంటే దేశానికి ప్రధానమంత్రి అయ్యేవారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతుంటే సీఎం కేసీఆర్‌ విరోధం పెంచుకున్నారని మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. మహారాష్ట్రలో మసీదులపై మైకులు పెట్టొద్దని అక్కడి ప్రభుత్వం అంటోందని చెప్పారు. హనుమాన్‌ చాలీసా పారాయణం రోజు మాత్రం మైకులు పెడుతున్నారని, వాటిని కూడా తొలగించాలని రాందాస్‌ అథవాలే డిమాండ్‌ చేశారు. ఆర్‌పీఐలో అన్ని కులాలు, మతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. అన్నివర్గాలకు సామాజిక న్యాయాన్ని అందజేయడమే ఆర్‌పీఐ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు.

ఆర్‌పీఐ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పసుల రవికుమార్‌ మాట్లాడుతూ.. మన ఓట్లను మనమే వేసుకొని సీట్లను సాధించి రాజ్యాధికారాన్ని పొందాలని అన్నారు. దళితబంధు పేరుతో దళితులను సీఎం కేసీఆర్‌ దగా చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చాలనడం దుర్మార్గమన్నారు. ఈ బహిరంగ సభలో ఆర్‌పీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైగాల నాగేశ్వర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరిగొమ్ముల స్నేహలత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుంగ జ్యోతిరమణ, నేషనల్‌ కౌన్సిల్‌ మెంబర్లురెడ్డిమల్ల శ్రీనివాస్‌, ప్రభుదాస్‌, శ్రీరామోజు రమాదేవి, రాష్ట్ర, జిల్లా నాయకులు మంద శివ, డాక్టర్‌ అమీద్‌ హుస్సేన్‌, రజియా సుల్తానా, యాకూబ్‌, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. సింధు యక్షగాన, జానపద, కోలాటం కళాకారులు ఆట పాటలతో అలరింపజేశారు.


కేంద్ర పథకాలతో రాష్ట్రానికి నిధులు
కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే

కాజీపేట, మే 27: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కిందనే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎ) జాతీయ అధ్యక్షుడు రాందాస్‌ అథవాలే అన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే కాజీపేట నిట్‌లో కేంద్ర పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నందున కేంద్రం నిధులు రాష్ట్రానికి అందినట్టేనని అన్నారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, ఓబీసీ కమిషన్‌, ఫైనాన్స్‌ కమిషన్‌ పని చేస్తున్నాయన్నారు. దేశంలో 85 శాతం మంది ప్రజలు తన శాఖ పరిధిలో లబ్ధిపొందారన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద దేశంలో 25.15 కోట్ల ఖాతాలు తెరిస్తే తెలంగాణలో 1.04 కోట్ల ఖాతాలు తెరిచారన్నారు. ముద్ర పథకం కింద లబ్ధిదారులకు రూ.50వేల నుంచి రూ.10లక్షల మేర రుణాలు ఇస్తున్నామని తెలిపారు. పీఎం ఉజ్వల యోజన పఽథ కం కింద దేశంలో 9.10కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్‌లు ఇవ్వగా తెలంగాణలో 10.73లక్షల మందికి ఇచ్చామన్నా రు. తెలంగాణలో 2.18లక్షల మందికి పక్కా గృహాలు నిర్మించామని, పీఎం ఆయుష్మాన్‌ భారత్‌ కింద 3.82 లక్షల మంది ఆరోగ్య సేవల్లో లబ్ధిపొందారన్నారు. ఎన్‌ఎ్‌సఎ్‌ఫడీసీ పథకం కింద తెలంగాణలో 51.42లక్షల మందికి రుణాలు అందించామని పేర్కొన్నారు.తెలంగాణ ఏర్పాటుకు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) మద్ధతిచ్చిందని మంత్రి గుర్తుచేశారు.

సమీక్ష
వరంగల్‌ నిట్‌ కళాశాలలోని సమావేశం హాల్‌లో  వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో  కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని, వాటి ఫలాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నది అడిగి తెలుసుకున్నారు. అదనపు జిల్లా కలెక్టర్లు, పోలీసు, ఇతర సంబంధిత శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. అంతకు ముందు హరిత కాకతీయ ప్లాజాలో పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి, జిల్లా కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపి కేంద్ర మంత్రి అఽథవాలేను ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-05-28T05:29:49+05:30 IST