HYD :సెట్‌బ్యాక్‌లు లేని సెల్లార్లు.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు

ABN , First Publish Date - 2022-02-05T14:53:31+05:30 IST

ఈ చిత్రం మాదాపూర్‌లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం తవ్విన సెల్లార్‌..

HYD :సెట్‌బ్యాక్‌లు లేని సెల్లార్లు.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు

  • పక్క భవనాలపై ప్రభావం
  • నిర్మాణ స్థిరత్వం దెబ్బతినే అవకాశం
  • పట్టించుకోని పట్టణ ప్రణాళికా విభాగం

హైదరాబాద్‌ సిటీ : ఈ చిత్రం మాదాపూర్‌లో ఓ బహుళ అంతస్తుల భవనం కోసం తవ్విన సెల్లార్‌. నిర్ణీత స్థాయిలో సెట్‌ బ్యాక్‌లు వదలకుండా తవ్వకాలు చేపట్టడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ ప్రహారీ వరకు భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది భవన నిర్మాణ స్థిరత్వంపై ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదొక్కటే కాదు.. నగరంలోని చాలా ప్రాంతాల్లో సెల్లార్‌ తవ్వకాలు ఇలానే జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, నిర్మాణదారులు ఇష్టానికి పనులు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం సెల్లార్ల సంఖ్యను బట్టి నిర్ణీత స్థాయిలో సెట్‌ బ్యాక్‌లు వదలాలి. కానీ, గ్రేటర్‌లో మెజార్టీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో నిబంధనలు అమలు కావడం లేదు. కనీస స్థాయిలో సెట్‌ బ్యాక్‌లు వదలకుండా సెల్లార్లు తవ్వుతున్నారు. దీంతో పక్కనుండే భవనాలపై ప్రభావం పడుతోంది. 2016లో నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కూలి 11 మంది దుర్మరణం చెందారు. సెట్‌బ్యాక్‌లు వదలకుండా పక్క స్థలంలో తవ్విన సెల్లార్‌ వల్లే ప్రమాదం జరిగినట్టు అప్పట్లో తేల్చారు.


సెల్లార్ల సంఖ్యను బట్టి సెట్‌బ్యాక్‌లు

నిబంధనల ప్రకారం 750 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న స్థలంలో మాత్రమే సెల్లార్‌ తవ్వకాలకు అనుమతి ఉంటుంది. మొదటి సెల్లార్‌కు 1.5 మీటర్లు, ఆ తర్వాత ప్రతీ సెల్లార్‌కూ అర మీటర్‌ (సగం) చొప్పున సెట్‌ బ్యాక్‌లు వదలాలి. అనుకోని ప్రమాదాలు జరిగితే అవాంతరాలు లేకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు సెట్‌బ్యాక్‌లు వదలాలని నిబంధనలు చెబుతున్నాయి. దీన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు. కూకట్‌పల్లి జోన్‌లోని ఓ ఏరియాలో నిర్మాణదారుడు స్థలం మొత్తంలో సెల్లార్‌ తవ్వడంతో పక్క భవనం ప్రహరీ కూలింది. సికింద్రాబాద్‌ జోన్‌లో ఓ భవనం గోడకు పగుళ్లు ఏర్పడ్డ ఘటన గతంలో జరిగింది. ఫిర్యాదులపై పట్టింపులేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.


ఉన్నత స్థాయికి వెళ్లకుండా..

అక్రమ నిర్మాణాల గుర్తింపునకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ) ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఇంజనీర్లను నియమించారు. వారి పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ప్రణాళికా విభాగంలోని కొందరు అధికారులు వారిపై పెత్తనం చేస్తూ నియంత్రిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిర్మాణదారులతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకునే అధికారులు ఇంజనీర్లు గుర్తించిన అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నత స్థాయికి వెళ్లకుండా మేనేజ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-02-05T14:53:31+05:30 IST