కుట్టు చార్జీలూ చెల్లించరాయె!

ABN , First Publish Date - 2022-05-20T06:30:47+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాం కుట్టు చార్జీలను విద్యా సంవత్సరం ముగిసినా ఇంకా చెల్లించలేదు.

కుట్టు చార్జీలూ చెల్లించరాయె!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాం కోసం గత ఏడాది క్లాత్‌ పంపిణీ

ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల వరకూ జతకు రూ.40, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.80 చొప్పున కుట్టు చార్జీలుగా  తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్న అధికారులు

విద్యా సంవత్సరం ముగిసినా అతీగతీ లేదు

3,62,977 మంది విద్యార్థులకు సంబంధించి రూ.4.35 కోట్లు బకాయి 

జతకు రూ.200 ఇవ్వాలని పేరెంట్స్‌ డిమాండ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాం కుట్టు చార్జీలను విద్యా సంవత్సరం ముగిసినా ఇంకా చెల్లించలేదు. గత ఏడాది విద్యార్థులకు క్లాత్‌ ఇచ్చిన సమగ్ర శిక్ష అభియాన్‌ కుట్టు చార్జీలు సొమ్ములు ఇంతవరకు తల్లుల ఖాతాలకు జమ చేయలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో రూ.4.35 కోట్ల వరకు బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. 

ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రభుత్వం ఏడాదికి మూడు జతల యూనిఫాం అందజేసేది. గతంలో సమగ్రశిక్షా అభియాన్‌ అఽధికారులే యూనిఫాం కుట్టించి విద్యార్థులకు ఇచ్చేవారు. అయితే కొలతలు సరిపోవడం లేదని ఫిర్యాదులు రావడంతో రెండేళ్ల క్రితం ఆ విధానాన్ని రద్దు చేశారు. క్లాత్‌ అందజేసి కుట్టు చార్జీలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరం జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 3,62,977 మంది విద్యార్థులకు మూడేసి జతలకు సరిపడా క్లాత్‌ అందజేశారు. కుట్టు చార్జీ కింద ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు జతకు రూ.40, 9,10 తరగతులకు రూ.80 ఇస్తున్నారు. దీని ప్రకారం మూడు జతల యూనిఫాం కుట్టడానికి ఒకటో తరగతి నుంచి ఎనిమిది వరకు గల విద్యార్థులకు రూ.120, 9, 10 తరగతులకు రూ.240 ఇస్తామని అధికారులు చెప్పారు. ఈ లెక్కన 3,62,977 మందికి రూ.4,35,57,240 కుట్టు చార్జీలుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ మొత్తం విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇందుకు పాఠశాలల వారీగా తల్లుల ఖాతాల వివరాలు సేకరించి సమగ్ర శిక్షా అభియాన్‌ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేశారు. అయితే ఈ నెల ఐదో తేదీతో గత విద్యా సంవత్సరం ముగిసింది. విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. అయినా ఇంతవరకు కుట్టు చార్జీల సొమ్ము తల్లుల ఖాతాల్లో పడలేదు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫాం క్లాత్‌ మరో వారం రోజుల్లో జిల్లాలకు రానున్నట్టు అధికారులు చెబుతున్నారు. క్లాత్‌ వచ్చిన వెంటనే స్కూల్‌ కాంప్లెక్స్‌లకు పంపిణీ చేసి విద్యార్థులకు అందజేస్తారు.  


జతకు రూ.40లా?

ప్రస్తుతం మార్కెట్‌లో ఒక జత బట్టలు కుట్టడానికి వయస్సును బట్టి రూ.200 నుంచి 400 వరకు తీసుకుంటున్నారు. అదే బాలికలు అయితే ఇంకా ఎక్కువగా వసూలుచేస్తారు. అటువంటిది ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు రూ.40, 9,10 పిల్లలకు రూ.80 ఇస్తే ఎలా సరిపోతాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత రేట్ల ప్రకారం సగటున జత యూనిఫాం కుట్టడానికి రూ. 200 మంజూరుచేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా యూనిఫామ్‌ క్లాత్‌ ఇచ్చినప్పుడే కుట్టు చార్జీలు కూడా ఇవ్వాలంటున్నారు.  

Updated Date - 2022-05-20T06:30:47+05:30 IST