నో స్టాక్‌

ABN , First Publish Date - 2021-04-10T05:50:03+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడుతోంది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

నో స్టాక్‌

రాజకీయ సందడితో పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తి


చిత్తూరు - ఆంధ్రజ్యోతి : కరోనా సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడుతోంది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా నాయకులకు ఇదేం పట్టడం లేదు. పంచాయతీ, మునిసిపల్‌, పరిషత్‌ ఎన్నికల పేరుతో కొవిడ్‌ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కేశారు. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పేరుతో వేలాదిమందిని పోగేసి కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు. తిరుమల సహా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భౌతికదూరం, మాస్క్‌, శానిటైజేషన్‌ వంటివి నవ్వులాటగా మారిపోయాయి. సరిగ్గా ఇటువంటి వేళే.. జిల్లాలో వ్యాక్సిన్‌ నిల్వలు బొత్తిగా లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. 

చిత్తూరు నగరానికి చెందిన ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయులు మార్చి 6న తొలి డోసు వ్యాక్సిన్‌ వేసుకున్నారు. 28 రోజుల తర్వాత, అంటే ఏప్రిల్‌ 3న రెండో డోసు వేసుకునేందుకు ఆస్పత్రికి వెళితే వ్యాక్సిన్‌ స్టాకు లేదన్నారు. దీంతో మళ్లీ ఏప్రిల్‌ 6న వెళ్లి వేసుకున్నారు. రెండు రోజులు స్టాకు ఉంటే.. మరో నాలుగు రోజులు ఉండడం లేదు. అలాగే రెండు రోజులుగా జిల్లాలో తగినన్ని వాక్సిన్‌ నిల్వలు లేకపోవడంతో పేర్లను నమోదు చేసుకున్న చాలా మంది వేచివున్నారు.


వ్యాక్సినేషన్‌ కేంద్రాలన్నీ ఖాళీ..

జిల్లాలో కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను వేస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలోని 125 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లోనూ రెండూ తగినన్ని అందుబాటులో లేవు. శనివారం జిల్లాకు వ్యాక్సిన్లు వస్తాయంటున్న అధికారులు ఎన్ని డోసులు వస్తాయనే సమాచారాన్నీ చెప్పలేకపోతున్నారు. మొత్తం 125 వ్యాక్సినేషన్‌ కేంద్రాలకుగానూ పుంగనూరులో 300, యాదమరి మండలం మాదిరెడ్డిపల్లె పీహెచ్‌సీలో 100 డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే అందుబాటులో ఉంది.


3 లక్షల మందికే వ్యాక్సిన్‌

మెడికల్‌, పోలీసు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ సిబ్బందితో పాటు 45 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక రోగాలున్నవారు జిల్లాలో 10 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 3 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ వేసుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం వ్యాక్సినేషన్‌కు ముందుకు రావడం లేదు. ఇలా జిల్లాలో 20 శాతం మంది వెనుకడుగు వేస్తున్నారు.


ఎక్కడా పూర్తికాని లక్ష్యం

జిల్లాలో 125 వ్యాక్సినేషన్‌ కేంద్రాలున్నా.. వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రత్యేక బృందాలున్నా.. ఈ విషయంగా కలెక్టరేట్‌లో నిత్యం సమీక్షలు జరుగుతున్నా.. వ్యాక్సినేషన్‌ లక్ష్యం మాత్రం ఏ మండలంలోనూ నెరవేరడం లేదు. తంబళ్లపల్లె మండలంలో 45 ఏళ్లు పైబడినవారు 6200 మంది లక్ష్యంకాగా.. 499 మందికి, అలాగే 65 ఏళ్లు పైబడినవారు 4 వేలు లక్ష్యంకాగా.. 1294 మందికి వ్యాక్సిన్‌ వేశారు. వి.కోట మండలంలోనూ 45 వయసు పైబడినవారు 14 వేల మంది ఉండగా.. 599 మందికి వేశారు. మదనపల్లె పట్టణంలో 45-60 ఏళ్ల మధ్యనున్నవారు 16,404 మంది లక్ష్యంకాగా.. 5 వేల మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 13742 మందికిగానూ 4574 మందికి, గుడిపాల మండలం బొమ్మసముద్రం పీహెచ్‌సీలో 7089మందికిగానూ 1402 మందికి, చౌడేపల్లెలో 7635 లక్ష్యంకాగా.. 1663 మందికి,   పీలేరు మండలంలో 30 వేల మంది ఉండగా.. 9 వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఇదే పరిస్థితి జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లోనూ ఉంది.

 ప్రజాప్రతినిధుల్లో ఎవరెవరు వేసుకున్నారు?

వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులూ విఫలమయ్యారు. ముందుగా తాము వ్యాక్సిన్‌ వేసుకుని ఆదర్శంగా నిలవాల్సిన వీరిలో చాలా మంది ఇప్పటికీ వాక్సిన్‌ వేసుకోలేదు.  మాజీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఇంకా వ్యాక్సిన్‌ వేసుకోలేదని సమాచారం. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు చంద్రగిరి, మదనపల్లె, పలమనేరు,పూతలపట్టు, సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే లు చెవిరెడ్డి, నవాజ్‌ బాషా, వెంకటేగౌడ, ఎమ్మె్‌స బాబు, ఆదిమూలం, ఆర్‌కే రోజా, బియ్యపు మధుసూధన్‌రెడ్డి ఇంతవరకూ వ్యాక్సిన్‌ వేసుకోలేదు. మిథున్‌రెడ్డి, వెంకటేగౌడ, ఎంఎ్‌సబాబు వయసు 45 ఏళ్ల లోపు ఉండడంతో ఇప్పుడే వేసుకోలేదని చెబుతున్నారు. ఆరోగ్య కారణాలతో ఆదిమూలం వేసుకోలేదంటున్నారు. ఇక చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, మంత్రి పెద్దిరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పుంగనూరులో వ్యాక్సిన్‌ వేసుకున్నారు. డిప్యూటి సీఎం నారాయణస్వామి తన సతీమణితో కలిసి తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రిలో, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో, ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి స్విమ్స్‌లో, ఎమ్మెల్సీ గౌనివారి దంపతులు శాంతిపురం ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్‌ వేసుకున్నారు.

Updated Date - 2021-04-10T05:50:03+05:30 IST