వణికిస్తున్న చెరువులు

ABN , First Publish Date - 2021-11-16T06:48:17+05:30 IST

తూర్పు మండలాల్లోని రోజుకో చోట చెరువులు దెబ్బతింటూ అన్నదాతలకు వణుకు పుట్టిస్తున్నాయి.

వణికిస్తున్న చెరువులు
మూడురోజుల కిందట తెగిన మూర్తిపాళెం చెరువు

‘తూర్పు’న ఆందోళనలో అన్నదాతలు 


శ్రీకాళహస్తి, నవంబరు 15: కేవీబీపురం మండలం కళత్తూరు చెరువుకు సోమవారం బొగడ పడింది. ఎస్‌ఎల్‌ పురం చెరువు వరవ కాలువ దెబ్బతినడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. 

మూడు రోజుల కిందట శ్రీకాళహస్తి మండలం బీవీపురం పంచాయతీలోని మూర్తిపాళెం చెరువు కట్ట తెగింది. 400 ఎకరాల్లో వరిపంట కొట్టుకుపోయి పొలాలు ఇసుక మేటల్లా మారాయి. 

ఇలా తూర్పు మండలాల్లోని రోజుకో చోట చెరువులు దెబ్బతింటూ అన్నదాతలకు వణుకు పుట్టిస్తున్నాయి. వీటికి శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎప్పుడే చెరువు తెగుతుందోనన్న ఆందోళన నెలకొంది. శ్రీకాళహస్తి ఇరిగేషన్‌ డివిజన్‌లోని 11 మండలాల పరిధిలో మైనర్‌ 610, మీడియం 310 వంతున 911 చెరువులున్నాయి. వీటికి 2017-18 ఆర్థిక సంవత్సరంలో నీరు-చెట్టు పథకం కింద మరమ్మతులు చేశారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో బురివి, నివార్‌ తుఫాన్లతో చెరువులన్నీ నిండాయి. ఆ క్రమంలో సుమారు 200 చెరువులు ప్రమాదకరంగా మారాయి. అప్పట్లో రూ.1.02 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆ చెరువులకు శాశ్వత మరమ్మతులు తప్పనిసరంటూ ఈ ఏడాది నీటిపారుదల శాఖ అధికారులు రూ.70 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఆరు నెలల కిందట ప్రతిపాదనలు పంపారు. రూపాయి కూడా విడుదల కాలేదు. పనులు జరగలేదు. మళ్లీ ఈ ఏడాది నవంబరు రెండో వారంలో తుఫాను ప్రభావంతో దాదాపు 85 శాతం చెరువులు నిండిపోయాయి. ఈ క్రమంలో మరో 32 చెరువులకు తాత్కాలిక మరమ్మతుల కోసం మూడు రోజుల కిందట అత్యవసరంగా రూ.45 లక్షలు అవసరమని అంచనా వేశారు. అధికారులు ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు కానీ అభివృద్ధి పనులకు మాత్రం గ్రహణం వీడటం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే తూర్పు మండలాల్లో నిండిన చెరువులు రోజుకో చోట దెబ్బతింటూ అన్నదాతకు అందోళన కలిగిస్తున్నాయి. ఇక, డిసెంబరు ముగిసేనాటికి ఎలాంటి వర్ష తీవ్రత ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అధికారుల అంచనా ప్రకారం సుమారు 232 చెరువులు ప్రమాదంలో ఉన్నాయి. తూర్పు మండలాల్లో మొత్తం 1,05,877.22 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుల నీటిపై ఆధారపడి ఇక్కడ పంటలు సాగు చేస్తుంటారు. చెరువులు దెబ్బతింటే అక్కడి ఆయకట్టు సాగుకూ నష్టం వాటిల్లుతుందనే ఆవేదన రైతులను వెన్నాడుతోంది. 

Updated Date - 2021-11-16T06:48:17+05:30 IST