లక్షణాలు లేని వాళ్లకు టెస్టులొద్దు: ఐసీఎంఆర్‌

ABN , First Publish Date - 2022-01-12T08:26:20+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో కొవిడ్‌ పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మంగళవారం తాజా సూచనలను విడుదల చేసింది. కొవిడ్‌ రోగుల కాంటాక్టులకు సైతం తీవ్ర ప్రమాదం ఉందని భావిస్తే తప్ప పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొవిడ్‌ లక్షణాలు లేనివారు, హోం..

లక్షణాలు లేని వాళ్లకు టెస్టులొద్దు: ఐసీఎంఆర్‌


న్యూఢిల్లీ, జనవరి 11: కరోనా ఉధృతి నేపథ్యంలో కొవిడ్‌ పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మంగళవారం తాజా సూచనలను విడుదల చేసింది. కొవిడ్‌ రోగుల కాంటాక్టులకు సైతం తీవ్ర ప్రమాదం ఉందని భావిస్తే తప్ప పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొవిడ్‌ లక్షణాలు లేనివారు, హోం ఐసొలేషన్‌ నుంచి డిశ్చార్జి అయినవారు, కొవిడ్‌ చికిత్స కేంద్రాల నుంచి డిశ్చార్జి అయినవారు, దేశంలో అంతర్గతంగా విమానాల్లో ప్రయాణించే వారికి పరీక్షలు అక్కర్లేదని తేల్చి చెప్పింది. దగ్గు, జ్వరం, గొంతుమంట, వాసన, రుచిని గుర్తించలేకపోవడం, శ్వాస సమస్యలు ఉన్నవారికి మాత్రం తప్పనిసరిగా టెస్టులు చేయాలని నిర్దేశించింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు పరీక్షలు చేయాలని సూచించింది. శస్త్రచికిత్సలు, ప్రసవాలు వంటి అత్యవసర వైద్య సేవలను ఆస్పత్రులు వాయిదా వేయరాదని తెలిపింది. గర్భిణులు, ఇతరత్రా వ్యాధులతో బాధపడే రోగులకు కొవిడ్‌ లక్షణాలు లేకుంటే పరీక్ష చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. నిఘా, పర్యవేక్షణ (సర్వైలెన్స్‌) అవసరాల కోసం మాత్రమే కొవిడ్‌ శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలని వివరించింది.

Updated Date - 2022-01-12T08:26:20+05:30 IST