టెస్టులు చెయ్యరు... వ్యాక్సిన వెయ్యరు

ABN , First Publish Date - 2021-05-11T06:01:46+05:30 IST

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రజలకు కొవిడ్‌ టెస్టులు చేయడం లేదు. వ్యాక్సినేషన సెంటర్‌ కూడా ఎత్తివేశారు.

టెస్టులు చెయ్యరు... వ్యాక్సిన వెయ్యరు

  • బాగా సీరియన అయితేనే పరీక్షలు చేస్తామంటున్న వైద్యుల
  • ఇదీ రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి తీరు

రాజమహేంద్రవరం అర్బన, మే 10: రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రజలకు కొవిడ్‌ టెస్టులు చేయడం లేదు. వ్యాక్సినేషన సెంటర్‌ కూడా ఎత్తివేశారు. దీంతో కేవలం బాధితులకు చికిత్స చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. దీంతో కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వారు ఎక్కడ టెస్టులు చేయించుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టెస్టులు చేస్తారనే ఆశతో ప్రతీరోజూ ఉదయాన్నే పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. వారికి ఓపీ చూసి మందులు రాసి పంపిస్తేస్తున్నారు. ‘జ్వరం, దగ్గు, ఆయాసం ఉన్నంత మాత్రాన టెస్టులు చేయాలంటే కుదరదు. ముదిరిపోయి, ఆసుపత్రుల్లో అడ్మిట్‌ అవడానికి వచ్చేవారికి మాత్రమే టెస్టులు చేస్తాము’ అని ఇక్కడి వైద్యులు చెప్తున్నారు. ప్రతిరోజూ ఇక్కడి శిబిరంలో స్వల్ప సంఖ్యలో ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు జరుగుతున్నాయి. అయితే వీటిని ఎమర్జన్సీ పర్పస్‌లో మాత్రమే వినియోగిస్తామని చెప్తూ అనుమానిత లక్షణాలున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇక్కడ టెస్టులు నిలిపివేసి దాదాపు మూడు వారాలు అవుతోంది. కాకినాడ ల్యాబ్‌లో 9 వేలకు పైగా స్వాబ్‌ శాంపిల్స్‌ పెండింగులో ఉన్నాయని, అందుకే టెస్టులు చేయట్లేని సిబ్బంది చెప్తున్నారు. మరోపక్క జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ టెస్టులు జరుగుతున్నా ఇక్కడ మాత్రం లేవు. ఇటీవలే వైద్య విధాన పరిషత పరిధిలోని సీహెచసీలు, మండల కేంద్రాల్లో కొవిడ్‌ టెస్టులు ప్రారంభించినట్టు వైద్యవిధాన పరిషత అధికారులు ప్రకటించారు. మండలస్థాయిలోనూ కొవిడ్‌ టెస్టులు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి జిల్లా ఆసుపత్రి రాజమహేంద్రవరంలో టెస్టులు ఎందుకు చేయడంలేదనేది అంతుపట్టడంలేదు. 

టీకా కేంద్రం ఎత్తివేత

ఇదిలా ఉంటే జిల్లా ఆసుపత్రి ఎంసీహెచ బ్లాకులో ఉన్న పీపీ యూనిట్‌ సెంటర్లోని టీకా కేంద్రాన్ని ఇటీవలే ఎత్తేశారు. దీనిని వైద్య శాఖ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.. టెస్టులు  నిలిపివేసినా, టీకా కేంద్రాన్ని తొలగించినా అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు నోరుమెదపకపోవడం గమనార్హం. అటు ప్రభుత్వాసుపత్రి వర్గాల్లోనూ, ఇటు స్థానికుల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించినా వైద్యాధికారుల నుంచి స్పందన లేదు. 


Updated Date - 2021-05-11T06:01:46+05:30 IST