ప్రభుత్వ పుస్తకాలకు నో..!

ABN , First Publish Date - 2022-08-07T09:28:42+05:30 IST

ప్రైవేట్‌ పాఠశాలలు పాఠ్యపుస్తకాల దందాకు పాల్పడుతున్నాయి.

ప్రభుత్వ పుస్తకాలకు నో..!

సొంతగా ముద్రించుకుంటున్న ప్రైవేటు స్కూళ్లు.. పుస్తకాల పేరిట 10వేల వరకు వసూలు

విద్యార్థులపై ఆర్థిక భారం

నష్టపోతున్న పబ్లిషర్లు, ప్రింటర్లు

రాయల్టీ సొమ్మును తిరిగివ్వాలని డిమాండ్‌


హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ పాఠశాలలు పాఠ్యపుస్తకాల దందాకు పాల్పడుతున్నాయి. ఫీజుల రూపంలోనే కాకుండా పుస్తకాల పేరిట కూడా విద్యార్థుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జీవో ఎంఎస్‌-1 నిబంధనల ప్రకారం... రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వం గుర్తించిన పబ్లిషర్లు ముద్రించిన పుస్తకాలనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన సిలబ్‌సను అనుసరించి ఈ పుస్తకాలను ముద్రిస్తారు. అయితే రాష్ట్రంలోని 70శాతం ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ పుస్తకాలను కాకుండా, తాము సొంతగా ముద్రించుకుంటున్న పుస్తకాలను ఉపయోగిస్తున్నాయి. దీంతో విద్యార్థులపై ఆర్థికంగా భారం పడటంతోపాటు... ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించిన పబ్లిషర్లు నష్టపోతున్నారు. ఉదాహరణకు... 10వ తరగతికి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సెట్‌ ధర రూ.1,060గా ఉంది. కానీ ప్రైవేట్‌ స్కూళ్లు ఈ పుస్తకాలను కాకుండా తాము ముద్రించే పుస్తకాలను, ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. కొన్ని పాఠశాలల్లో పుస్తకాల కోసం రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి స్కూళ్ల గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేట్‌ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా సొంత పుస్తకాలను విక్రయిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ప్రైవేట్‌ పబ్లిషర్లు ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేనలను కలిసి వినతి పత్రాలను కూడా సమర్పించారు. అయినా ఎలాంటి కదలిక లేదు.


గోదాముల్లోనే లక్షల పుస్తకాలు

రాష్ట్ర ప్రభుత్వం ఏటా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను అనుసరించి పాఠ్యపుస్తకాల ముద్రణపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1.22కోట్ల పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించారు. దీనికోసం టెండర్‌ ద్వారా ఎంపికచేసిన 13 ప్రైవేట్‌ ప్రింటర్లు, పబ్లిషర్లకు తరగతుల వారీగా పుస్తకాల ముద్రణకు అనుమతులు ఇచ్చారు. వారి నుంచి రూ.6.70కోట్ల రాయల్టీని కూడా వసూలుచేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రింటర్లు పుస్తకాలను ముద్రించారు. ప్రైవేట్‌ పాఠశాలలు కొనుగోలు చేయడానికి వీలుగా... ఎంపికచేసిన దుకాణాల్లో ఈ పుస్తకాలను సిద్ధంగా ఉంచారు. అయితే కార్పొరేట్‌ విద్యాసంస్థలు పట్టించుకోకపోవడంతో ఈ పుస్తకాలు అమ్ముడు పోవడం లేదు. ప్రైవేట్‌ పబ్లిషర్లు ముద్రించిన 1.22కోట్ల పాఠ్యపుస్తకాల్లో ఇప్పటివరకు కనీసం 30శాతం కూడా అమ్ముడుపోలేదని తెలుస్తోంది. అంటే... ముద్రించిన పుస్తకాల్లో సుమారు 36.60 లక్షలు అమ్ముడుపోగా, ఇంకా సుమారు 85.40 లక్షల పుస్తకాలు షాపుల్లో, గోదాముల్లో నిల్వ ఉన్నాయి. తరగతుల వారీగా చూస్తే... పదో తరగతి విద్యార్థుల కోసం మొత్తం 2.50లక్షల పుస్తకాలను ముద్రించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అందులో ఇప్పటివరకు 54,200 సెట్లు (సుమారు 22శాతం) మాత్రమే అమ్ముడుపోయాయి. అలాగే తొమ్మిదో తరగతికి సంబంధించి 2.55 లక్షల పుస్తకాలను ముద్రించారు. ఇందులో 61 వేల సెట్లు (24 శాతం) మాత్రమే అమ్ముడుపోయాయి. ఇలా అన్ని తరగతుల పుస్తకాలు మిగిలాయి. మరోవైపు... ప్రభుత్వానికి ముందుగానే రాయల్టీ చెల్లించిన పబ్లిషర్లు, ప్రింటర్లు... పుస్తకాలు అమ్ముడుపోక ఆందోళన చెందుతున్నారు. పేపర్‌ను కొనుగోలు చేసి, ప్రింటింగ్‌ కోసం కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ముద్రించిన పాఠ్యపుస్తకాలు గోదాముల్లోనే ఉన్నాయని వాపోతున్నారు. ఇలాంటి సమయాల్లో ప్రైవేట్‌ స్కూళ్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను కొనేలా డీఈవోలు చర్యలు తీసుకోవాలి. స్కూళ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. ప్రభుత్వ పుస్తకాలను కొనుగోలు చేయని యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి. కానీ ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.


రాయల్టీ చెల్లించి నష్టపోయాం...

- బాల్‌రెడ్డి, పబ్లిషర్‌

పాఠ్యపుస్తకాల ముద్రణ కోసం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పుస్తకాలను ముద్రిస్తే పాఠశాలలు వాటిని కొనడం లేదు. ఈ విషయంలో అధికారులు కూడా మౌనం పాటిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల పబ్లిషర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే... రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ముద్రించడానికి ఎవరూ ముందుకురారు. ఫలితంగా పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రైవేట్‌ స్కూళ్లు పుస్తకాలు కొనేలా చర్యలు తీసుకోవాలి. లేదా ప్రభుత్వానికి మేం చెల్లించిన రాయల్టీని తిరిగి ఇప్పించాలి.

Updated Date - 2022-08-07T09:28:42+05:30 IST