జేఎన్టీయూ ప్రిన్సిపాల్‌పై బదిలీ వేటు

ABN , First Publish Date - 2022-07-01T06:04:53+05:30 IST

చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎన్‌.శ్రీనివా్‌సపై బదిలీ వేటు పడింది.

జేఎన్టీయూ ప్రిన్సిపాల్‌పై బదిలీ వేటు

ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నర్సింహ

పుల్‌కల్‌, జూన్‌ 30: చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎన్‌.శ్రీనివా్‌సపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు జేఎన్టీయూహెచ్‌ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.నర్సింహను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌ జీఎన్‌ శ్రీనివా్‌సకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థులకు మధ్య సుహృద్భావ వాతావరణం లేకపోవడమే బదిలీకి కారణమని తెలిసింది. అయితే, ప్రిన్సిపాల్‌పై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో జేఎన్టీయూహెచ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ కట్టా నర్సింహారెడ్డి విచారణ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్‌  శ్రీనివా్‌సపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ బృందం నివేదికను జేఎన్టీయూహెచ్‌ ఉన్నతాధికారులకు అందజేశారు.  నాలుగైదు నెలల పాటుగా విచారణ నివేదికను పెండింగ్‌లో పెట్టిన అధికారులు అకస్మాత్తుగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది. కళాశాలలో గడిచిన ఐదేళ్లుగా కాంట్రాక్టు ఫిజికల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గాడిపెల్లి సునీల్‌కుమార్‌గౌడ్‌ను పలు రకాల వేధింపులకు గురి చేసి ఆకారణంగా విధుల నుంచి తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి.  అంతేకాకుండా అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని సైతం విధుల నుండి తప్పించడంతో వారంతా విచారణ కమిటీ ముందు తమగోడును వెళ్లబోసుకున్నారు.  అంతేకాకుండా కళాశాలలో ప్రిన్సిపాల్‌ పనితీరు పట్ల సంతృప్తి చెందని జేఎన్టీయూహెచ్‌ ఉన్నతాధికారులు చివరకు బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. 


Updated Date - 2022-07-01T06:04:53+05:30 IST