15 ఏళ్లుగా బదిలీలు లేవు

ABN , First Publish Date - 2022-06-28T06:42:35+05:30 IST

అనకాపల్లి విద్యుత్‌ గ్రామీణ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)....విచిత్రమైన వ్యవస్థ. అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఏ నిబంధనలు వర్తించవు.

15 ఏళ్లుగా బదిలీలు లేవు

ఎక్కడి వారక్కడే కొనసాగింపు

అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌లో అంతా ఇష్టారాజ్యం

మూడేళ్లకొకసారి బదిలీలు చేయాలని నిబంధన

పట్టించుకోని వైనం

ఏసీబీ కేసులున్నా అదే తీరు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


అనకాపల్లి విద్యుత్‌ గ్రామీణ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌)....విచిత్రమైన వ్యవస్థ. అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఏ నిబంధనలు వర్తించవు. ఏదైనా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇష్టమే. ఆయన అనుకుంటే చేయడం...వద్దనకుంటే వదిలేయడం. ఇదే గత పదిహేనేళ్లుగా నడుస్తోంది. 

ఉద్యోగులు అన్నాక...బదిలీలు తప్పనిసరి. ఆర్‌ఈసీఎస్‌లో కూడా ప్రతి మూడేళ్లకు ఉద్యోగులను బదిలీ చేయాలనే నిబంధన ఉంది. దావూద్‌ అలీ, రాఘవరావు వంటి ఎండీలు పనిచేసిన కాలంలో మూడేళ్లకొకసారి బదిలీలు చేసేవారు. ఆ తరువాత అంతా కుమ్మక్కు అయిపోయి 2007 నుంచి బదిలీలు లేకుండా ఎక్కడి వారక్కడే ఉంటున్నారు. అవినీతి ఆరోపణలు అధికమవుతున్నా, ఏసీబీ కేసులు నమోదవుతున్నా...సంస్థ పరువు బజారున పడుతున్నా...పెద్దలు బదిలీల జోలికి వెళ్లడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోను బదిలీలు చేపడుతోంది. ఇక్కడ కూడా చేయాలనే వాదన తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు సంస్థపై ఈపీడీసీఎల్‌ కాకుండా సొసైటీ ఆధిపత్యమే నడుస్తుండడం వల్ల ఈసారి కూడా బదిలీల ఊసు ఎత్తడం లేదు.


లైన్‌మెన్లు కీలకం

ఆర్‌ఈసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 499. అందులో కాంట్రాక్టు పేమెంట్‌ వర్కర్లు (సీపీడబ్ల్యు) 372 మంది. రెగ్యులర్‌ ఉద్యోగులు 127 మంది. అందులో 32 మంది లైన్‌మెన్లు. డిప్యూటీ ప్రాజెక్టు ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఇంజనీర్లు, అకౌంట్‌ ఆఫీసర్లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు ఆ తరువాత వరుసలో ఉంటారు. సంస్థకు కశింకోటలో ప్రధాన కార్యాలయం ఉండగా, మునగపాక, అగనంపూడి, లంకెలపాలెం, సబ్బవరం, పరవాడ, తుమ్మపాల, తాళ్లపాలెంలలో సెక్షన్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఎనిమిది కార్యాలయాల మధ్య బదిలీలు చేయొచ్చు.

క్షేత్రస్థాయిలో వినియోగదారుల నుంచి ప్రతి పనికీ లంచాలు వసూలు చేయడంలో కీలక పాత్ర వహించేది లైన్‌మెన్లే. అక్కడ రేటు మాట్లాడుకున్నాక...సెక్షన్‌ కార్యాలయానికి వచ్చి ఏపీఈతో లావాదేవీలు చూసుకుంటారు. ఇటీవలె లంకెలపాలెంలో ఒక అపార్టుమెంట్‌కు విద్యుత్‌ మీటర్లు ఇవ్వడానికి రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఒక లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, మరొక ఏఈ....ఏసీబీకి దొరికిపోయారు. పరవాడలో ఒక స్కూల్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి రూ.9 లక్షలు లంచం డిమాండ్‌ చేసి మరో ఇద్దరు ఇంజనీర్లు నాలుగేళ్ల కిందట ఏసీబీకి దొరికారు. ఇవి నమోదైన కేసులు మాత్రమే. 

ఈపీడీసీఎల్‌లో విలీనం నుంచి మినహాయింపు వచ్చిందని చెబుతూ గత 25 రోజులుగా సిబ్బంది మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇలా బరితెగించే ఉద్యోగులకు ముకుతాడు వేయాలంటే...బదిలీలు తప్పనిసరి చేయాలని సంస్థలో పలువురు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా రాజకీయ నేతలే అడ్డం పడుతున్నారు. గతంలో సంస్థ చైర్మన్‌గా పనిచేసిన ఓ నేత ఇప్పుడు అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి అత్యంత సన్నిహితంగా వుంటూ ఆర్‌ఈసీఎస్‌ వ్యవహారాలన్నీ చూస్తున్నారు. ఆయన చెప్పిందే అక్కడ జరుగుతోంది. ఈ వ్యవస్థను సక్రమంగా నడిచేలా విద్యుత్‌ నియంత్రణ మండలే తగిన చొరవ చూపాల్సి ఉంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈపీడీసీఎల్‌ ఉన్నతాధికారులు ఈ సంస్థను పట్టించుకోవడం లేదు.

Updated Date - 2022-06-28T06:42:35+05:30 IST