డ్రామాలొద్దు..!

ABN , First Publish Date - 2021-07-14T06:34:37+05:30 IST

అధికారంలో ఉన్నప్పుడు..

డ్రామాలొద్దు..!

వెలిగొండకు ఢోకా లేదు 

జిల్లాకు కేటాయింపు మేర నీరొస్తుంది..

టీడీపీ ఎమ్మెల్యేల లేఖపై మంత్రి సురేష్‌ స్పందన 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టుని పట్టించుకోని, ఏనాడూ జిల్లాకు కేటాయించిన సాగర్‌ జలాలను పూర్తిస్థాయిలో తేలేకపోయిన టీడీపీ నాయకులు ఇప్పుడేదో అన్యాయం జరగబోతున్నదంటూ లేఖలు రాయడం ఓ డ్రామా అని రాష్ట్ర విద్యాశాఖామంత్రి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ వ్యాఖ్యానించారు. వెలిగొండకు ఢోకా లేదని ఆయన పేర్కొన్నారు. రెండురోజుల క్రితం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు సీఎంకు రాసిన లేఖపై మంత్రి సురేష్‌ మంగళవారం స్పందించారు. రాష్ర్టానికి అన్యాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే దమ్మూ, ధైర్యం టీడీపీ నేతలకు లేదన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించటం ద్వారా శ్రీశైలం డ్యామ్‌ నుంచి జిల్లాకు ప్రత్యేకించి వెలిగొండ ప్రాజెక్టుకి కేటాయించిన నీరు రాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


ఇటు వెలిగొండ ప్రాజెక్టుకు, అటు సాగర్‌ కాలువలకు కానీ జిల్లాకు రావాల్సిన నీటిలో చుక్క కూడా తగ్గకుండా వచ్చేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ నిర్మాణం పూర్తయిందని, రెండోటన్నెల్‌ పనులు కూడా పూర్తిచేసి త్వరలో పూర్తిచేసి నీరివ్వబోతున్నామని చెప్పారు. గత టీడీపీ పాలనలో చంద్రబాబు పదేపదే వెలిగొండను సందర్శించడం తప్ప ఆచరణలో ఆశించిన పురోగతి కనిపించలేదన్నారు. అప్పట్లో నిత్యం సాగర్‌ కాలువలపై తిరుగుతూ హడావుడి చేసిన నాయకులు కూడా వెలిగొండ పనులను ముందుకు కదిలించలేకపోయారని ఎద్దేవా చేశారు. చివరికి గుంటూరు జిల్లా వారు మనకు రావాల్సిన సాగర్‌ జలాలకు అడ్డుకట్టలు వేసినా టీడీపీ నాయకులు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. కానీ గత రెండేళ్లలో సాగర్‌ జలాలను సంవృద్ధిగా జిల్లాకు రప్పించటంలో మా ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. టీడీపీ నేతలను, ఆపార్టీ ఎమ్మెల్యేల లేఖల డ్రామాలను ప్రజలు నమ్మరని మంత్రి సురేష్‌ చెప్పారు.


Updated Date - 2021-07-14T06:34:37+05:30 IST