లేవు.. తెప్పిస్తాం..!

ABN , First Publish Date - 2021-10-28T05:16:46+05:30 IST

రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 877 ఆర్బీకేలు ఉన్నాయి.

లేవు.. తెప్పిస్తాం..!

  1. రైతు భరోసా కేంద్రాలో ఇదీ తీరు
  2. డీఏపీ, పొటాష్‌ దొరక్క రైతులకు ఇబ్బందులు
  3. ఇండెంట్‌ పెడితే ఎప్పుడొస్తుందో తెలియన వైనం
  4. విత్తనం నుంచి విక్రయం వరకు అంటూ అర్భాటం
  5. పర్యవేక్షణ లేక క్షేత్రస్థాయిలో బిన్నమైన పరిస్థితులు


కర్నూలు (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 877 ఆర్బీకేలు ఉన్నాయి. ఈ లెక్క జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాలలో ప్రభుత్వం రైతులకు సేవలు అందాలి. కానీ అరొకర సేవలు కూడా కరువయ్యాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతు భరోసా కేంద్రాల నుంచి ఇస్తామని ప్రకటించారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు కూడా ఆర్‌బీకేల ద్వారానే జరుగుతాయని తెలిపారు. కానీ ఏవీ సరిగా అమలు కావడం లేదు. రైతులు చాలా వాటి కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా నాసిరకం విత్తనాలు, నకిలీ మందులతో నష్టపోతున్నారు. నిర్దేశించిన సేవలను అందించలేనప్పుడు ఇంత ఖర్చుతో వాటిని ఏర్పాటు చేయడం, నిర్వహించడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. 


ప్రచార ఆర్భాటమే..

విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ రైతు ముంగిటకు తీసుకువరావడానికే రైతు భరోసా కేంద్రాలు అని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. జిల్లా యంత్రాంగం ఇంకో అడుగు ముందుకు వేసి జిల్లాలో ఖరీఫ్‌ సీజన సందర్భంగా రైతులకు దాదాపు 90 శాతం పైనే సేవలు అందించామని, అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశామని ప్రకటించింది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా చాలా ఆర్‌బీకేల్లో రైతులకు అవసరమైన ఏ ఒక్కటీ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఎరువు ఉంటే పొటాష్‌ ఉండదు, ఎరువులు ఉంటే విత్తనాలు ఉండవు. ఇదేమిటని రైతులు అడిగితే ‘ఇండెంట్‌ పెట్టండి, తెప్పిస్తాం’ అని ఉద్యోగులు అంటున్నారు. ఇండెంట్‌ పెట్టినా ఎప్పుడు వస్తుందో తెలియదని, అప్పటి వరకు ఆగలేక వ్యాపారుల వద్ద కొంటున్నామని రైతులు అంటున్నారు. అధికారులు మాత్రం ఇండెంట్‌ పెట్టిన రెండు మూడు రోజుల్లోపు అందిస్తున్నామని అంటున్నారు. అదే నిజమైతే తాము బయట కొనాల్సిన అవసరమేముందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు కష్టాలు తీర్చాల్సిన అఽధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదు. కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే నిజమని మిన్నకుండిపోతున్నారు. ఈ తీరుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన ఎలాగూ పోయింది, కనీసం రబీలో అయినా ఆర్‌బీకేల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. 


సబ్సిడీ విత్తనాలు ఏవీ..?

జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజనలలో కలిపి పది లక్షల హెక్టార్లకు పైగా వివిధ పంటలు సాగు అవుతాయి. జిల్లాలో దాదాపు 20 రకరకాల పంటలు పండిస్తుంటారు. ఇంత విస్తారమైన సేద్యం ఉన్నా, రైతులకు నాణ్యమైన విత్తనాలు దొరకడం కష్టంగా మారుతోంది. ఏటా వ్యాపారుల వద్ద నాసిరకం విత్తనాలు కొని తీవ్రంగా నష్టపోతున్నారు. రబీ సీజనకు అవసరమైన పప్పు శనగ విత్తనాలు రైతు భరోసా కేంద్రాలలో దొరకడం లేదు. దీంతో రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. నందవరం మండలం సోమలగూడూరుకు చెందిన ఓ రైతు ఇటీవలే శనగల కోసం రైతు భరోసా కేంద్రంలో సంప్రదించాడు. నిల్వలు లేవని, ముందుగా డబ్బులు చెల్లిస్తే వారం తర్వాత ఇస్తామని అక్కడి సిబ్బంది సమాధానం చెప్పారు. అంత వరకూ ఆగితే పదును ఆరిపోతుందని భావించిన రైతు, శనగ విత్తనాలను బయట కొనుగోలు చేశాడు. జిల్లాలో చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉంది. 


ప్రైవేటులో కొనుగోళ్లు

పంట వేసింది మొదలు కోత కోసే వరకు కాంప్లెక్స్‌ ఎరువులు, పొటాష్‌, డీఏపీ, పురుగు మందులు ఇలా ఎన్నెన్నో రైతులు వాడుతుంటారు. వాటి కోసం ఏటా యుద్ధమే చేస్తుంటారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో ఇక ఆ సమస్య ఉండదని భావించారు. కానీ రైతులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఆర్భాటంగా మొదలు పెట్టిన ఆర్‌బీకేల్లో ఏ ఒక్కటీ సక్రమంగా దొరకడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు నాసిరకం విత్తనాలు, పురుగు మందులు అంటగడుతున్నారు. రైతుల వద్ద డబ్బులు దండుకుంటున్నారు. పంటకు నష్టం జరుగుతుందన్న ఆందోళనలో అత్యవసర మందులను బ్లాక్‌లో కొంటున్నారు. ఆర్‌బీకేల్లో డబ్బులు చెల్లించి ఇండెంట్‌ పెడితే రెండు మూడు రోజుల తరువాత వస్తోందని, అవి కూడా అవసరమైనవి రావడం లేదని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. కొన్ని ఆర్‌బీకేల్లో ఎరువులకు ఇండెంట్‌ పెట్టిన రైతులకు కాకుండా, అధికార పార్టీ వర్గం రైతులకు అందించడం, ఎక్కువ ధరకు బ్లాక్‌లో విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

సేవలన్నీ బోర్డుల్లోనే..

సబ్సిడీ విత్తనాలు, పంట నమోదు ప్రక్రియ, ఎరువులు వంటి సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా చోట్ల అరకొరగా ఎరువులు, పంట నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఇంతకు మించి సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్‌బీకేలకు ఉద్యోగులు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో తెలియని పరిస్థితి. చాలా చోట్ల ఏదైనా అవసరమై ఆర్‌బీకేలకు వెళ్లే రైతులు, అక్కడ ఉద్యోగులు లేకపోవడంతో ఉసూరుమని వెనుదిరుగుతున్నారు. కొన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాలు ఎప్పుడూ మూతపడే ఉంటున్నాయి. ఇదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళితే అలాంటిదేమీ లేదని కొట్టిపడేస్తున్నారు.


కొరత లేదు..

రైతులకు ఏం కావాలన్నా అందిస్తాం. దాని కోసం ఆర్‌బీకేల్లో అన్ని ఏర్పాట్లు చేసి సేవలు అందిస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. విత్తనాల కోసం రైతులు ఆర్‌బీకేలను సంప్రందిస్తే వెంటనే అందిస్తున్నాం. ఎరువుల కొరత కూడా లేదు. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలి వెళ్తున్నాయన్న విమర్శల్లో నిజం లేదు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం.

- వరలక్ష్మి, జేడీఏ, కర్నూలు

Updated Date - 2021-10-28T05:16:46+05:30 IST