మాటలే.. మెసేజ్‌లు లేవు!

ABN , First Publish Date - 2022-01-25T07:05:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. రిపోర్టులు

మాటలే..  మెసేజ్‌లు లేవు!

  • కొవిడ్‌ పాజిటివ్‌ వస్తే నేరుగా చెప్పడమే.. 90 శాతం యాంటీజెన్‌ పరీక్షలే
  • సెల్‌ఫోన్లకు సందేశాలు రావు
  • అధికారికంగా రిపోర్టూ కరువు
  • గగ్గోలు పెడుతున్న బాధితులు 
  • వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, 
  • గ్లౌజుల కొరత
  • టెస్టులు చేసే సిబ్బందికీ వైరస్‌
  • అందుకే ఎక్కువ పరీక్షలు చేయలేకపోతున్న వైనం


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. రిపోర్టులు విస్మరిస్తున్నారు. పాజిటివా? నెగెటివా? అన్న విషయాన్ని మౌఖికంగా మాత్రమే చెబుతున్నారు. మెసేజ్‌ రూపంలో కానీ, రిపోర్టు కానీ ఇవ్వడం లేదు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలన్నీ ఇలాగే జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజూ లక్షకుపైగా టెస్టులు చేస్తున్నారు. వాటిలో 90 శాతం వరకు యాంటీజెన్‌ పరీక్షలే. లక్షణాలున్న వారికి టెస్టు చేసిన పది నిమిషాల్లో ఫలితం మౌఖికంగా చెప్పేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి సెల్‌ఫోన్లకు ఎలాంటి మెసేజ్‌లూ రావడం లేదు. గతంలో పాజిటివ్‌ వచ్చినా, నెగెటివ్‌ వచ్చినా సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చేది. ఇప్పుడది రావడం లేదని బాఽధితులు చెబుతున్నారు.


తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది పెద్ద సమస్య అవుతోంది. వారు ఆస్పత్రుల్లో చేరాలంటే పాజిటివ్‌ వచ్చిన రిపోర్టు అడుగుతున్నారు. వైద్యశాఖ మాత్రం మెసేజ్‌లు కానీ, రిపోర్టులు కానీ ఇవ్వడం లేదు. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు మాత్రం అందరికీ మెసేజ్‌లు పంపుతున్నామని చెప్పడం గమనార్హం. ఇక నెగెటివ్‌ మెసేజ్‌లు కూడా కొందరికి అవసరం అవుతున్నాయి. పనిచేసే సంస్థల్లో తమకు నెగెటివ్‌ వచ్చినట్లు చూపించుకోవడానికి ఆధారం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రిపోర్టుల కోసం పక్కదారులు

ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుంటే నాలుగైదు రోజుల తర్వాతే రిపోర్టు వస్తోంది. ఇక యాంటీజెన్‌ టెస్టులైతే ఎలాంటి రిపోర్టూ రావడం లేదు. దీంతో రిపోర్టు తప్పనిసరి అయినవారు వాటి కోసం పక్కదారులు తొక్కుతున్నారు. ఇదే అదనుగా దళారులు రంగంలోకి దిగారు. పలు ప్రైవేటు ల్యాబ్‌లతో కుమ్మక్కవుతున్నారు. తప్పుడు రిపోర్టులు ఇప్పిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఇలా నకిలీ రిపోర్టులు ఇచ్చే రెండు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్కారీ పరీక్షల ఫలితాలు సకాలంలో రాకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా విదేశాలకు వెళ్లేవారికి నెగెటివ్‌ రిపోర్టులు అవసరం. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకూ రిపోర్టులు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్‌ వస్తే ఏడు రోజుల పాటు క్వారంటైన్‌ సెలవులు ఇస్తారు. పాజిటివ్‌ రిపోర్టు లేకపోతే సిక్‌ లీవ్‌ కింద పరిగణిస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. కొన్నిసార్లు పాజిటివ్‌ అని తెలిసినా సంబంధిత ధ్రువపత్రాలు లేదా మెసేజ్‌లను ఆఫీసుల్లో చూపించకపోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొవిడ్‌తో దురదృష్టవశాత్తు చనిపోతే సంబంధిత ధ్రువప్రతం లేకపోతే నష్టపరిహారం కూడా అందని పరిస్థితులు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వెంటనే కనీసం మెసేజ్‌లైనా పంపాలని డిమాండ్‌ చేస్తున్నారు. 



టెస్టులు చేసే సిబ్బందికి సౌకర్యాలు కరువు

పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కొన్ని యూపీహెచ్‌సీల్లో పరిమిత స్థాయిలో యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే రోజుకు వంద పరీక్షలే చేస్తున్నారు. మరుసటి రోజు రమ్మంటున్నారని బాధితులు చెబుతున్నారు. టెస్టులు తక్కువగా చేస్తుండడంతో రద్దీ ఎక్కువైపోతోంది. పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో కొవిడ్‌ పరీక్షలు చేసే వైద్య సిబ్బంది సౌకర్యాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీపీఈ కిట్లు, గ్లౌజులు సరిపడినన్ని అందుబాటులో ఉండడం లేదని వాపోతున్నారు. టెస్టు లు చేసే వైద్య సిబ్బంది ఇప్పటికే పెద్దసంఖ్యలో కొవిడ్‌ బారిన పడ్డారని చెబుతున్నారు. దీనివల్ల కూడా ఎక్కువగా టెస్టులు చేయలేకపోతున్నామని అంటున్నారు. 


నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే తిరుమలకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ ఉన్నా ఓకే: టీటీడీ

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు 48గంటల ముందు చేయించకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిపోర్టును తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. లేదంటే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ అయినా తీసుకురావాలని సూచించింది. కాగా, ఏపీలో గత 24గంటల్లో 44,650మందికి పరీక్షలు నిర్వహించగా 14,502 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. 


Updated Date - 2022-01-25T07:05:07+05:30 IST