దిగుబడి లేదు.. గిట్టుబాటు రాదు

ABN , First Publish Date - 2021-06-22T05:18:17+05:30 IST

కరోనా వైరస్‌.. కొబ్బరి రైతుల పాలిట శాపంగా మారింది. కరోనా వ్యాప్తికి ముందు వెయ్యి కాయల ధర రూ.17వేల వరకు పలికింది. దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేయడంతో కొబ్బరి రైతులకు రాబడి అమాంతం పడిపోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో క్రమంగా ఎగుమతులు పుంజుకున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొబ్బరి ధరలు పెరిగాయి. ఆ సమయంలో రైతు వద్ద కాయ ఒక్కటి రూ.11 వరకు పలికింది. పరిమాణాన్ని బట్టి వ్యాపారులు వెయ్యి కాయలను రూ. 11 వేల నుంచి రూ. 13 వేలకు చొప్పున కొనుగోలు చేసి.. ఎగుమతి చేశారు. ప్రస్తుతం కర్ఫ్యూ ప్రభావంతో ఈ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

దిగుబడి లేదు.. గిట్టుబాటు రాదు

 కొబ్బరి రైతుకు కష్టం

 నిలకడ లేని ధరలతో మరింత నష్టం

 కరోనా ప్రభావంతో మందగించిన ఎగుమతులు

(సోంపేట) 

కరోనా వైరస్‌.. కొబ్బరి రైతుల పాలిట శాపంగా మారింది. కరోనా వ్యాప్తికి ముందు వెయ్యి కాయల ధర రూ.17వేల వరకు పలికింది. దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేయడంతో కొబ్బరి రైతులకు రాబడి అమాంతం పడిపోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో క్రమంగా ఎగుమతులు పుంజుకున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొబ్బరి ధరలు పెరిగాయి. ఆ సమయంలో రైతు వద్ద కాయ ఒక్కటి రూ.11 వరకు పలికింది. పరిమాణాన్ని బట్టి వ్యాపారులు వెయ్యి కాయలను రూ. 11 వేల నుంచి రూ. 13 వేలకు చొప్పున కొనుగోలు చేసి.. ఎగుమతి చేశారు. ప్రస్తుతం కర్ఫ్యూ ప్రభావంతో ఈ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రైతుల వద్ద కాయరూ.9కే పరిమితమైంది. దీనికి తోడు తెగుళ్ల బెడదతో దిగుబడులు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

కొబ్బరి పంటకు ఉద్దానం పెట్టింది పేరు. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల్లో సుమారు 16 వేల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. ఇవి కాకుండా ఇళ్ల వద్ద, పొలాల గట్ల వెంబడి, కాలువ గట్లపైన వేలాది చెట్ల ద్వారా కొబ్బరి సాగవుతోంది. జిల్లా నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు కొబ్బరిని ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. కొన్నేళ్లుగా కొబ్బరి సాగులో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రైతులు నిలకడలేని ధరలతో నిరాశ చెందుతున్నారు. గత రెండేళ్లుగా కొబ్బరి దిగుబడి తగ్గడంతో తోటలు చాలా వరకు కూల్చి ప్లాట్లు వేసుకుంటున్నారు. వేలాది ఎకరాల్లో కొబ్బరి తోటలను తొలగించారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఇలా ఉత్పత్తి తగ్గినా ధర మాత్రం పెరగడం లేదు. మరోపక్క ఐదేళ్లుగా కొబ్బరి చెట్లకు ఎర్రనల్లి, తెల్లదోమ, ఆకుతేలు, ఎండాకు తెగులు సోకుతున్నాయి. దీంతో ఆకులు ఎండిపోయి చెట్లు జీవం కోల్పోవడంతో పాటు పూతకు వచ్చిన గెలల్లో కాయలు తొలిదశలోనే రాలిపోతున్నాయి. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు.


కొవిడ్‌ ప్రభావంతో...

గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు కరోనా ప్రభావం కొబ్బరి రైతులపై పడుతూనే ఉంది. కరోనా మొదటి దశలోనే ఎగుమతులు మందగించాయి. స్థానికంగా ఉన్న కొబ్బరి వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తుంటారు. అలాంటిది కరోనా నేపథ్యంలో రవాణా మందగించింది. దీంతో రైతుల వద్ద కొబ్బరి కొనుగోలుకు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో ధరలు పడిపోయాయి. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యలో కొద్దిరోజులు ధరలు పెరిగినప్పటికీ కరోనా రెండో దశ వ్యాప్తితో అమాంతం పడిపోయాయి. వీటికి తోడు స్థానిక  వ్యాపారులు, దళారులు కూడా బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే కొంటున్నారు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. 


అప్పులతో బతుకుతున్నాం

పదేళ్లుగా వరుస ప్రకృతి వైపరీత్యాలతో కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఎర్రనల్లి, తెల్లదోమ వంటి తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో ఆదాయం లేక, గిట్టుబాటు ధర రాక రైతులమంతా నష్టాలు, అప్పులతో ఇబ్బందులు పడుతున్నాం. 

- బి.హేమారావు, కొబ్బరి రైతు, జల్లుపుట్టుగ  

Updated Date - 2021-06-22T05:18:17+05:30 IST