West Bengal : నెం.2 జైలుకెళ్ళిన తరుణంలో మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-08-03T19:41:35+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ

West Bengal : నెం.2 జైలుకెళ్ళిన తరుణంలో మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న మమత బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) తన మంత్రివర్గాన్ని బుధవారం విస్తరించబోతున్నారు. ఆమె తర్వాతి స్థానంలో ఉన్న సీనియర్ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) అవినీతి కేసులో అరెస్టయిన నేపథ్యంలో యువతకు పెద్ద పీట వేస్తూ, తన మంత్రివర్గానికి నూతన జవసత్వాలను తీసుకురావాలని ఆమె నిర్ణయించుకున్నారు. 


పార్థ ఛటర్జీ టీఎంసీలోనూ, ప్రభుత్వంలోనూ మమత బెనర్జీ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆయనను ఓ కుంభకోణం కేసులో జూలై 23న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అరెస్ట్ చేసింది. ఆయనకు సన్నిహితంగా మెలిగే మోడల్, నటి అర్పిత ముఖర్జీకి చెందిన వివిధ అపార్ట్‌మెంట్లలో ఈడీ తనిఖీలు చేసి, సుమారు రూ.48 కోట్లు నగదు, ఆభరణాలను; దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల దస్తావేజులను స్వాధీనం చేసుకుంది. వీటితోపాటు పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. 


పార్థ ఛటర్జీ టీఎంసీలో మమత బెనర్జీ తర్వాత తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన మమతకు కుడి భుజం వంటివారు. ఆయన హవా ఆకాశాన్ని తాకింది. అయితే పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ అక్రమాల కుంభకోణంతో ఆ హవా పాతాళానికి పతనమైంది. ఆయన అక్రమాలను ఈడీ బయటపెట్టడంతో పార్టీతోపాటు ప్రభుత్వం కూడా ఆయనను వదిలించుకుంది. ఆయనకు ఇచ్చిన ప్రభుత్వ కారును కూడా ఉపసంహరించారు. 


పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో సెక్రటరీ జనరల్‌ పదవిని నిర్వహించిన పార్థ ఛటర్జీని ఆ పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు. మమత ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా ఆయనపైనే ఆధారపడేవారు. అయినప్పటికీ, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. 


పార్థ దాదాపు 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. మమత బెనర్జీ 1998లో టీఎంసీని ఏర్పాటు చేసినపుడు ఆ పార్టీలో చేరారు. మమతతో కలిసి సీపీఎం ప్రభుత్వంపై హోరాహోరీగా పోరాడారు. క్షేత్ర స్థాయిలో టీఎంసీ ఆధిపత్యానికి ప్రధాన కారకుడు ఆయనే.  2011లో టీఎంసీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయనకు మంత్రి పదవి దక్కింది. 2014లో ఆయన విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఈ కుంభకోణం జరిగింది. మరోవైపు ఆయన మమతకు వారసుడు అనే స్థాయిలో ఎదిగారు. మొదటి నుంచి ఆయన మమతకు వీర విధేయుడిగానే వ్యవహరించారు. శారద, నారద కుంభకోణాల్లో తన పేరు లేకపోవడాన్ని ఆయన గర్వకారణంగా భావించేవారు. 


మమత కన్నా పార్థ రెండేళ్ళు పెద్దవారు. అందువల్ల ఆయనను ఆమె ఆత్మీయంగా ‘పార్థ దా’ అని పిలిచేవారు. ఆయనకు సెల్‌ఫోన్లంటే చాలా ఇష్టం. అంతకన్నా దుర్గా పూజలంటే మరింత ఇష్టం. 


మోడల్, నెయిల్ ఆర్టిస్ట్, సినీ నటి అర్పిత ముఖర్జీ దాదాపు పదేళ్ళ క్రితం పార్థ ఛటర్జీని కలిసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆయన విద్యా శాఖ మంత్రిగా ఉండేవారు. వీరిద్దరూ కలిసి ఓ పాఠశాలను సందర్శించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాల గురించి స్పష్టత లేదు, కానీ ఇరువురు చాలా సన్నిహితులని మాత్రం తెలుస్తోంది. 


నూతన జవసత్వాలతో మంత్రివర్గ కూర్పు

ఈ నేపథ్యంలో మమత బెనర్జీ తన మంత్రివర్గానికి బుధవారం నూతన రూపం ఇవ్వబోతున్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు నలుగురైదుగురు మంత్రులను పార్టీ నిర్వహణకు పంపించబోతున్నారు. ఐదుగురు లేదా ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. టీఎంసీ పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత ఏడాది మే నెలలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుండటం ఇదే మొదటిసారి. 


కేబినెట్ మంత్రులు సుబ్రత ముఖర్జీ, సాధన్ పాండే మరణించారు. పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. మరో మంత్రి పరేష్ అధికారిని కూడా ఈ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. అధికారిని కూడా మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం కనిపిస్తోంది. 


బాబుల్ సుప్రియోకు అవకాశం?

నూతన మంత్రివర్గంలోకి యువతను చేర్చుకోవాలని మమత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 సెప్టెంబరులో టీఎంసీలో చేరి, ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. 


Updated Date - 2022-08-03T19:41:35+05:30 IST