నోబెల్ రచయిత మరణంపై ఫేక్ ట్వీట్

ABN , First Publish Date - 2022-03-22T23:46:56+05:30 IST

ప్రముఖ నోబెల్ రచయిత కజువో ఇషిగురో (బ్రిటన్) మరణించాడంటూ ఒక వార్త ఈరోజు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నోబెల్ అందుకున్న రచయిత కావడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యం లభించింది.

నోబెల్ రచయిత మరణంపై ఫేక్ ట్వీట్

ప్రముఖ నోబెల్ రచయిత కజువో ఇషిగురో (బ్రిటన్) మరణించాడంటూ ఒక వార్త ఈరోజు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నోబెల్ అందుకున్న రచయిత కావడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యం లభించింది. వేగంగా ప్రముఖ మీడియా సంస్థల్లోనూ వార్త పబ్లిష్ అయింది. అయితే కొందరు మాత్రం ఇది నిజమా? కాదా? అని ఆరాతీశారు. ఈ వార్త ఎక్కడ మొదలైందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ న్యూస్ వచ్చినట్లు గుర్తించారు. అది ప్రముఖ అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్. పేరు గొప్పదే. కానీ, అక్కడే వచ్చింది ఒక డౌటు. వెంటనే అది ఫేక్ అకౌంట్ అని తెలిసిపోయింది. ఎందుకంటే దానికి బ్లూ బ్యాడ్జ్ లేదు. పైగా ఫాలోవర్లు కూడా లేరు. అంటే అది ఫేక్ అకౌంట్. కాబట్టి, అది ఫేక్ న్యూస్ అయ్యుండే ఛాన్సే ఎక్కువగా ఉంది. అనుకున్నట్లే అది ఫేక్ న్యూస్ అని తెలిసిపోయింది. కారణం.. ఆ ట్వీట్ వేసిన రెండు గంటల్లోనే ట్వీటు డిలీటైంది. తర్వాత ఆ ట్విట్టర్ అకౌంట్ ఎవరిదో కూడా తెలిసింది. ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడంలో దిట్ట అయిన టొమాసో డెబెనెడెట్టి అనే ఇటలీ టీచర్‌ది.

ఎదుటివాళ్లను ప్రాంక్స్‌తో ఫూల్స్‌ను చేయడం కొందరికి అలవాటు. ఎప్పుడూ, ఎవరో ఒకరిని ఇలా మోసం చేస్తూ ఆనంద పడుతుంటారు. ఇలాంటివాళ్లలో టొమాసో డెబెనెడెట్టి ముందు వరుసలో ఉంటాడు. ఇటలీకి చెందిన టొమాసో దాదాపు పన్నెండేళ్లుగా ప్రపంచాన్ని ఏదో ఒక రకంగా బురిడీకొట్టిస్తూనే ఉన్నాడు. ప్రపంచంలోనే మోస్ట్ క్రియేటివ్ అండ్ సక్సెస్‌ఫుల్ ఫేక్ ట్వీటర్‌గా ఉన్నాడంటే అతడు చేసే ట్వీట్లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. టీచర్‌గా పనిచేస్తున్న టొమాసో రెగ్యులర్‌గా ఫేక్ ట్వీట్లు వేస్తుంటాడు. తాజాగా చేసిన ట్వీటే కజువో ఇషిగురో మరణం. కజువో ఇషిగురో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత. బుకర్ (1989) ప్రైజ్‌తోపాటు రచయితగా సాహిత్యంలో నోబెల్ (2017) బహుమతి కూడా అందుకున్నాడు. కాగా, టొమాసో తన సొంత అకౌంట్ నుంచి ఈ ట్వీట్ చేయలేదు. దీనికోసం ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే, ఈ ట్వీట్‌కు కూడా తను కోరుకున్నట్లుగానే అంతర్జాతీయ ప్రచారం రావడంతోపాటు, అది చేసింది తనే అని నెటిజన్లు గుర్తించడంతో వెంటనే ఆ ట్వీటు డిలీట్ చేశాడు. తను క్రియేట్ చేసుకున్న అకౌంట్ పేరు ‘ఫేబర్ బుక్స్ యూకే’. నిజానికి ఇదో పబ్లిషింగ్ సంస్థ. అయితే, దీనికి ఒరిజినల్‌గా వేరే అకౌంట్ ఉంది. అది ‘ఫేబర్ బుక్స్’ పేరుతో ఉంటుంది. టొమాసో క్రియేట్ చేసిన అకౌంట్ పేరులో చిన్న తేడాతోపాటు, బ్లూ బ్యాడ్జ్ లేకపోవడంతో అది ఫేక్ అని నెటిజన్లు ఈజీగానే గుర్తించారు. దీంతో ఇది ఫేక్ న్యూస్ అని తెలిసిపోయింది. ముందుగా కజువో వార్తను పబ్లిష్ చేసిన మీడియా సంస్థలు, ఆ తర్వాత తమ తప్పును సరిదిద్దుకున్నాయి.


మొదటిసారి కాదు..

టొమాసో ఇలా మీడియా సంస్థలను మోసం చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో పలుసార్లు ప్రముఖ రచయితలను ఇంటర్వ్యూ చేశానంటూ ఇటలీ మీడియా సంస్థలను మోసం చేశాడు. ప్రముఖ రచయితలైన జాన్ గ్రిషమ్, ఆర్థర్ మిల్లర్, గోరె వైడల్, టోనీ మారిసన్ వంటి రచయితలను ఇంటర్వ్యూ చేసినట్లుగా మోసం చేసి, పత్రికల్లో పబ్లిష్ అయ్యేలా చూసుకున్నాడు. 2012లో అప్పటి పదహారవ పోప్ బెనెడిక్ట్ మరణించినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో పబ్లిసిటీ పొందేందుకు ప్రయత్నించాడు.

బ్లూ బ్యాడ్జ్ ప్రాధాన్యం

డిజిటల్ యుగంలో ఫేక్ న్యూస్ వ్యాపించడానికి నిమిషాలు చాలు. అయితే, ఆ న్యూస్ ఫేకో.. కాదో తెలుసుకునేందుకు ఒరిజినల్ సోషల్ మీడియా అకౌంట్లు ఉపయోగపడుతాయి. ముఖ్యంగా ట్విట్టర్‌లో ఒక పేరుతో ఉన్న అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ ఒరిజినలో.. కాదో తెలుసుకోవాలంటే పేరు పక్కన బ్లూ బ్యాడ్జ్ ఉందో లేదో చూడాలి. ఫేక్ అకౌంట్లు, న్యూస్ నిరోధించేందుకే ఈ బ్లూ బ్యాడ్జ్ తీసుకొచ్చింది ట్విట్టర్. వెరిఫైడ్ అకౌంట్లకు మాత్రమే బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంటుంది.


Updated Date - 2022-03-22T23:46:56+05:30 IST