నామమాత్రంగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2021-03-06T05:44:14+05:30 IST

నారాయణరావుపేట మండల కేంద్రంలో రెడ్డి సంఘం భవనంలో శుక్రవారం ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది.

నామమాత్రంగా సర్వసభ్య సమావేశం
సమావేశంలో ఎంపీడీవోను నిలదీస్తున్న ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌

సమయపాలన పాటించని అధికారులు

పల్లె ప్రకృతివనం  నిధుల డ్రాపై ఎంపీడీవోను నిలదీసిన ఎంపీపీ ఉపాధ్యక్షుడు 

నారాయణరావుపేట సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై చర్చ


నారాయణరావుపేట, మార్చి 5 : నారాయణరావుపేట మండల కేంద్రంలో రెడ్డి సంఘం భవనంలో శుక్రవారం ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది. ఉదయం 11 గంటలకు హజరు కావాల్సిన అయా శాఖల అధికారులు మధ్యాహ్నం 12.30 గంటలకు ఒక్కొక్కరుగా హాజరయ్యారు. ముడు రోజుల ముందే సర్వ సభ్య సమావేశం గురించి సమాచారం ఉన్న అధికారులు హజరు కాకపోవడంపై ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతోష్‌కుమార్‌, ఎంపీటీసీ హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉందని సమావేశాన్ని రద్దు చేయాలన్నారు. మండలం ఏర్పాటై రెండు ఏళ్లు గడుస్తున్నా కొన్ని శాఖల అధికారులు ఒక్క సమావేశానికి హాజరు కావడం లేదని ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే సమావేశానికి పుర్తి స్థాయిలో అధికారులు హాజరయ్యేలా చూస్తామని ఎంపీపీ తెలిపారు. నారాయణరావుపేటలో ఏర్పాటు చేసిన అర ఎకరం పల్లె ప్రకృతి వనంలో లక్షల్లో నిధులు డ్రా చేస్తున్నారని, ఒక్కో మొక్కకు రూ.ఐదు వేల బిల్లులు వేసి నిధులు స్వాహా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ ఎంపీడీవో మురళీధర్‌శర్మను నిలదీశారు. అడ్డగోలుగా నిధులు డ్రా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో వార్డు సభ్యులతో పాటు సర్పంచ్‌ తీర్మానం కాఫీలో సంతకాలు చేసి సమావేశం ముగిసిన తర్వాత సంతకం కొట్టివేసిన అధికారులు స్పందించక పోవడం దారుణమన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులకు విద్యుత్‌ సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్‌ రేణుక, ఎంఈవో యాదవరెడ్డి, ఏవో విద్యాకర్‌ రెడ్డి, ఉద్యానవన అధికారి భాస్కర్‌రెడ్డి, ఏఈలు చారి, సాయికృష్ణ, శ్రీనివాస్‌, ఏపీఓ స్రవంతి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:44:14+05:30 IST