నామినేటెడ్‌ సంబరం!

ABN , First Publish Date - 2021-07-18T06:13:23+05:30 IST

వైసీపీ శ్రేణులు ఎంతోకాలంగా..

నామినేటెడ్‌ సంబరం!
తాతినేని పద్మావతి - ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు చైర్‌పర్సన్‌

జిల్లా నుంచి 11 మందికి పదవులు

పశ్చిమ, పెనమలూరు నియోజకవర్గాలకు పెద్దపీట

ఆ రెండు నియోజకవర్గాల నుంచే ఆరుగురికి పదవులు 

డీసీసీబీ పీఠంపై తన్నీరు నాగేశ్వరరావు

డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌గా పడమట స్నిగ్ధ

బొప్పనను ఊరించి ఉసూరుమనిపించారు

యార్లగడ్డకు పదవి మూణ్ణాళ్ల ముచ్చటే

మంత్రి అనుచరుడు షేక్‌ కాజాకు దక్కని చాన్స్‌


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): వైసీపీ శ్రేణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పోస్టుల సంబరం ఎట్టకేలకు ముగిసింది. జిల్లా కోటాలో 10 మందికి నామినేటెడ్‌ పోస్టులు దక్కగా, పశ్చిమ గోదావరి జిల్లా కోటాలో హనుమాన్‌జంక్షన్‌వాసి కనుమూరి సుబ్బరాజును నామినేటెడ్‌ పదవి వరించింది. దీంతో మొత్తం 11 నామినేటెడ్‌ పదవులు జిల్లాకు దక్కినట్టయింది. ఈ పదవుల్లో విజయవాడ పశ్చిమ, పెనమలూరు నియోజకవర్గాలకు అగ్రతాంబూలం దక్కింది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి ముగ్గురు చొప్పున ఆరుగురికి పదవులు లభించాయి. సామాజిక సమీకరణాల పరంగా ఓసీలకు ఐదు పదవులు దక్కగా, బీసీలకు మూడు, ఎస్సీలకు రెండు, మైనారిటీలకు ఒకటి దక్కింది. 


పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెలంపల్లి వైరివర్గానికి పెద్దపీట వేశారు. వెలంపల్లి వైసీపీ తీర్థం పుచ్చుకోక ముందు ఆ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న షేక్‌ ఆసిఫ్‌కు ఎట్టకేలకు పార్టీ అధిష్ఠానం న్యాయం చేసింది. అలాగే మంత్రి కారణంగా నగర మేయర్‌ పదవి దక్కించుకోలేకపోయిన బండి పుణ్యశీలకు సైతం నామినేటెడ్‌ పదవి ఇచ్చి అందలం ఎక్కించారు. మంత్రి అనుచరుడు షేక్‌ కాజాకు మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కానీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవి కానీ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. 


పశ్చిమకు పదవుల పందేరం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ముగ్గురికి నామినేటెడ్‌ పదవులు దక్కాయి. అయితే వీరెవ్వరూ మంత్రి అనుచరవర్గంలో లేకపోవడం గమనార్హం. 2019 ఎన్నికలకు ముందు పశ్చిమ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్‌ ఆసిఫ్‌ పేరు ప్రచారంలో ఉంది. అయితే వెలంపల్లి వైసీపీలో చేరడంతో సీన్‌ రివర్స్‌ అయింది. దీంతో వెలంపల్లికి ఆసిఫ్‌ వర్గం దూరంగా ఉంటూ వచ్చింది. బండి పుణ్యశీల సైతం తొలి నుంచీ వెలంపల్లితో కలిసేవారు కాదు. ఈ ఏడాది మార్చిలో జరిగిన వీఎంసీ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసిన తర్వాత ఎస్సీ కోటాలో పుణ్యశీల మేయర్‌ రేసులో నిలిచారు. అయితే వెలంపల్లి కారణంగా ఆమె మేయర్‌ సీటును దక్కించుకోలేకపోయారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా నియమితులైన జమల పూర్ణమ్మ మాజీ కార్పొరేటర్‌. ఈమె కూడా మంత్రి వెలంపల్లి వర్గంతో అంటీముట్టనట్టు ఉంటారు. సీఎం టూర్‌ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్‌కు పూర్ణమ్మ కుమారుడు అశోక్‌ యాదవ్‌ అనుచరుడిగా ఉన్నారు. ఆయన ద్వారా ఆమెకు పదవి దక్కింది. అయితే నిరక్షరాస్యురాలైన పూర్ణమ్మను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా నియమించడంపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద పశ్చిమలో పదవులు దక్కించుకున్న ముగ్గురూ మంత్రి అనుచరులు కాకపోవడం గమనార్హం.  


ఊరించి ఉసూరుమనిపించారు

వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న బొప్పన భవకుమార్‌ను చివరి వరకు ఊరించి ఉసూరుమనిపించారు. ఆయనను ఏపీ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమిస్తున్నారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భవకుమార్‌ విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతూ వచ్చారు. అయితే టీడీపీ నుంచి దేవినేని అవినాశ్‌ రాకతో భవకుమార్‌ను పార్టీ అధిష్ఠానం పక్కన పెట్టింది. ఆ తర్వాత భవకుమార్‌కు విజయవాడ నగర వైసీపీ బాధ్యతలు అప్పగించినా అది నామమాత్రమే అయింది. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి ఊపిరిపోసిన యార్లగడ్డ వెంకట్రావును జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ పదవి నుంచి తొలగించారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ నియోజకవర్గ  వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న వెంకట్రావుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఆయనకు 2019 డిసెంబరులో కేడీసీసీ చైర్మన్‌గిరీ అప్పగించారు. కానీ ఆ పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. 


విధేయతకు పెద్దపీట

పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న తాతినేని పద్మావతి, పడమట సురేశ్‌ వంటి వారికి పార్టీ అధిష్ఠానం న్యాయం చేసింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మావతిని జెడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేయించి జెడ్పీ చైర్మన్‌ పీఠంపై కూర్చోపెడతారని ప్రచారం జరిగింది. అయితే సామాజిక సమీకరణాల్లో ఆమె పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. నామినేటెడ్‌ పదవి ఇవ్వడం ద్వారా అధిష్ఠానం ఆమెకు న్యాయం చేసింది. పడమట సురేశ్‌ సైతం పార్టీ ఆవిర్భావం నుంచి పెనమలూరు నియోజకవర్గ కేంద్రంగా పనిచేస్తూ వచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినా దక్కలేదు. తాజాగా ఆయన కుమార్తె స్నిగ్ధను నామినేటెడ్‌ పదవి వరించింది. కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌ సైతం పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు సన్నిహితుడైన నాగేశ్వరరావుకు, మంత్రి పేర్ని నానికి సన్నిహితుడైన బొర్రా విఠల్‌ సతీమణి దుర్గానాగలక్ష్మి భవానికి పదవులు దక్కాయి. విజయవాడ తూర్పు నుంచి కార్పొరేటర్‌ అడపా శేషుకు, జగ్గయ్యపేట నుంచి మొండితోక అరుణ్‌కుమార్‌కు, గన్నవరం నియోజకవర్గం నుంచి కనుమూరి సుబ్బరాజుకు పదవులు దక్కాయి. 


జిల్లాకు దక్కిన నామినేటెడ్‌ పోస్టుల వివరాలు..

1. తన్నీరు నాగేశ్వరరావు - కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌

2. పడమట స్నిగ్ధ  - కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌

3. తాతినేని పద్మావతి    - ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్‌ బోర్డు చైర్‌పర్సన్‌

4. మొండితోక అరుణ్‌కుమార్‌ - ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

5. తుమ్మల చంద్రశేఖర్‌రావు - ఏపీ కమ్మ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

6. బొర్రా దుర్గానాగలక్ష్మీ భవాని - మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్‌పర్సన్‌

7. బండి పుణ్యశీల - ఏపీ ఇండస్ర్టియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌

8. షేక్‌ ఆసిఫ్‌ - ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

9. అడపా శేషగిరి - ఏపీ కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

10. తిప్పరమల్లి జమల పూర్ణమ్మ - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌

11. కనుమూరి సుబ్బరాజు - ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

Updated Date - 2021-07-18T06:13:23+05:30 IST