డిగ్గీ X థరూర్‌?

ABN , First Publish Date - 2022-09-29T08:46:14+05:30 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగుస్తున్నప్పటికీ ఇంతవరకూ ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

డిగ్గీ X థరూర్‌?

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల చిత్రం.. నేడు ఢిల్లీకి రానున్న దిగ్విజయ్‌

రేపు నామినేషన్‌ వేసే అవకాశం.. ఇప్పటికే బరిలో ఉన్న శశి థరూర్‌

పోటీకి సుముఖంగా ఉన్న ఖర్గే!.. సోనియాతో సమావేశమైన ఆంటోనీ

నేడు సోనియాతో గహ్లోత్‌ భేటీ



న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగుస్తున్నప్పటికీ ఇంతవరకూ ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. అయితే శుక్రవారం మఽధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌,  కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ గాంధీతో పాటు భారత్‌ జోడో యాత్రలో ఉన్న దిగ్విజయ్‌ గురువారం ఢిల్లీకి రానున్నారు. దిగ్విజయ్‌కు అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవిని సచిన్‌ పైలట్‌కు అప్పగించేందుకు విముఖంగా ఉన్న అశోక్‌ గహ్లోత్‌ గురువారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారని తెలుస్తోంది. అయితే గతంలో చెప్పినట్లు ఆయన పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. ఆయన సోనియాను కలిసిన తర్వాతే స్పష్టత వస్తుందంటున్నారు.


తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, రాజస్థాన్‌ బాధ్యతలను వదులుకోవడం లేదని గహ్లోత్‌ తన సన్నిహితులకు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాత గురువారం ఢిల్లీ వెళతానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ గహ్లోత్‌ నాయకత్వం కిందే పనిచేస్తుందని, అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోరని, భవిష్యత్తులో కూడా తప్పుకోరని రాష్ట్ర మంత్రి ప్రతాప్‌ సింగ్‌ కచరియావాస్‌ మీడియాకు తెలిపారు, గహ్లోత్‌ రాజస్థాన్‌లో తన అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని మరో మంత్రి విశ్వేంద్ర సింగ్‌ చెప్పారు. అధిష్ఠానంపై తిరుగుబాటు చేసే ఉద్దేశం తనకు లేదని... అయితే, తన చేతుల్లో ఏమీ లేదని, ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని గహ్లోత్‌ తనతో మాట్లాడిన పార్టీ నేతలు అంబికా సోనీ, ఆనంద్‌ శర్మకు చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక విషయంలో ఎలాంటి సస్పెన్స్‌ లేదని, అంతా రెండు రోజుల్లో తేలిపోతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, బుధవారం సోనియా గాంధీతో పార్టీ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ భేటీ అయ్యారు. గంటకు పైగా జరిగిన వారి సమావేశంలో పార్టీ అధ్యక్ష అభ్యర్థులపై చర్చించినట్టు సమాచారం. సోనియా ఆదేశిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మరో సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్‌ ఖర్గే సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ చెప్పారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌పైనే దృష్టి పెడతానన్నారు.

Updated Date - 2022-09-29T08:46:14+05:30 IST