ఉద్యమనేత.. ప్రజా గొంతుక

ABN , First Publish Date - 2020-12-02T05:59:50+05:30 IST

బడుగు, బలహీనవర్గాల గొంతుక మూగబోయింది. సమస్యలపై నిరంతరం బలమైన ప్రజావాణిని వినిపించిన నేత మౌనంగా వెళ్లిపోయారు. కమ్యూనిస్టు భావజాలంతో ఎన్నో ఉద్యమాలు చేపట్టి ప్రజల మనిషిగా నిలిచిన టీఆర్‌ఎస్‌ నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాసవిడిచారు.

ఉద్యమనేత.. ప్రజా గొంతుక
రోదిస్తున్న భార్య లక్ష్మి

ఎమ్మెల్యే నర్సింహయ్య కన్నుమూత

శోకసంద్రంలో కార్యకర్తలు

పలువురి నివాళి

రేపు పాలెంలో అంత్యక్రియలు

హాజరుకానున్న సీఎం కేసీఆర్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)/హాలియా, నకిరేకల్‌, నాగార్జునసాగర్‌, కేతేపల్లి, నిడమనూరు, మాడ్గులపల్లి: బడుగు, బలహీనవర్గాల గొంతుక మూగబోయింది. సమస్యలపై నిరంతరం బలమైన ప్రజావాణిని వినిపించిన నేత మౌనంగా వెళ్లిపోయారు. కమ్యూనిస్టు భావజాలంతో ఎన్నో ఉద్యమాలు చేపట్టి ప్రజల మనిషిగా నిలిచిన టీఆర్‌ఎస్‌ నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాసవిడిచారు.

కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం 5గంటల సమయంలో అచేతనంగా ఉన్న నర్సింహయ్యను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించగా మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తలమునకలైన మంత్రులు, ఎమ్మెల్యేలు, పలుపార్టీ నేతలు నోముల మృతితో దిగ్ర్భాంతి చెందారు. అభిమానుల సందర్శనార్ధం నోముల పార్థీవదేహాన్ని హైదరాబాద్‌ కొత్తపేటలోని ఆయన నివాసంలో ఉంచగా, పార్టీలకతీతంగా పలువురు నివాళులర్పించారు. 


కార్యకర్తలు వచ్చారు... లేవయ్యా

కార్యకర్తల సందర్శనార్ధం మృతదేహాన్ని మధ్యాహ్నం 2గంటలకు హాలియాకు తీసుకురాగా, తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు అప్పటికే భారీగా కార్యకర్తలు తరలివచ్చి నివాళి అర్పించారు. ‘కార్యకర్తలు వచ్చారు.. లేవయ్యా’ అంటూ భార్య లక్ష్మి, కుమార్తె ఝాన్సీ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. గురువారం అంత్యక్రియలు నిర్వహించనుండటంతో నోముల భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని మెడికల్‌ కళాశా లలోని మార్చురీలో ఉంచారు.


నోముల ప్రస్థానం

నకిరేకల్‌ మండలంలోని పాలెం గ్రామంలో నోముల రాములు, మంగమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో సంతానంగా 1956, జనవరి 9వ తేదీన నోముల నర్సింహయ్య జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎంఏ చదువుతున్న తరుణంలోనే విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సీపీఎంలో చేరారు. నాటి ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి ప్రోత్సాహంతో సీపీఎంలో కీలక నేతగా ఎదిగారు. 1987 నుంచి 1999 వర కు 12 ఏళ్లు నకిరేకల్‌ ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రం లో 1999, 2004 ఎన్నికల్లో నకిరేకల్‌ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు సీపీఎం తరఫున గెలుపొంది శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2009లో నకిరేకల్‌ ఎస్సీలకు రిజర్వ్‌కాగా, భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ పొత్తుతో సీపీఎం అభ్యర్థిగా బరిలోదిగి ఓటమి చెందారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొన్నారు. జానాచేతిలో ఓటమిపాలైన నో ముల,2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మళ్లీ జానాపై పోటీ చేసి గెలుపొందారు. నర్సింహయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఝాన్సీరాణి, అరుణజ్యోతి, కుమారుడు భగత్‌కుమార్‌ ఉన్నారు. 


అభివృద్ధిలో నోముల పాత్ర

కేతేపల్లి అభివృద్ధిలో నర్సింహయ్య కృషి ఎనలేనిది. నకిరేకల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుంచే జాతీయ రహదారి వెంట విస్తరించి ఉన్న కేతేపల్లి మండల అభివృద్ధికి కృషి చేశారు. మూసీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ వెంట డొంకదారి ఉండగా, ఇది ఐబీ పరిధిలో ఉండటంతో అభివృద్ధి సాధ్యపడలేదు. దీంతో పట్టువీడని విక్రమార్కుడిలా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మంత్రితో మాట్లాడి రహదారిని ఐబీ పరిధి నుంచి ఆర్‌అండ్‌బీకి మార్పించారు. ఆ తర్వాత రూ.4కోట్ల నిధులు రాబట్టి 6కి.మీ. మేర బీటీ వేయించారు. మూసీ కుడి ఎర్త్‌ డ్యాం దిగువన ఉన్న వందల ఎకరాల భూమిని వినియోగంలోకి తెచ్చేందుకు ఇక్కడ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల ఏర్పాటుకు నాటి సీఎం వైఎ్‌సను ఒప్పించి సాధించారు. 2007లో రేకుల షెడ్డులో ఈ గురుకుల పాఠశాల ప్రారంభంకాగా, ప్రస్తుతం పక్కా భవనంలో వందల మంది బీసీ విద్యార్థులు విద్యాభ్యాసం పొందుతున్నారు. నిడమనూరులో మినీ ట్యాంక్‌బండ్‌ ఏర్పాటుకు కృషిచేశారు. మునిసిఫ్‌ కోర్టును సాధించారు. కోర్టుకు సొంత భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను నందికొండ మునిసిపాలిటీగా ఏర్పాటు చేయడంలో నోముల కీలక పాత్ర వహించారు. సాగర్‌లోని ప్రభుత్వ నివాస గృహలను అందులో నివసిస్తున్న వారికే ఇచ్చేలా రెండు నెలల క్రితమే ప్రభుత్వ ఉత్తర్వులు సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం పర్యాటకశాఖ ఐదు లాంచీలు ఏపీకి వెళ్లడంతో, 2014లో రూ.3.50కోట్ల వ్యయంతో నూతన లాంచీలు, రూ.5కోట్లతో లాంచీస్టేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి నిధులు సాధించారు. శిథిలావస్థలో ఉన్న సాగర్‌ ఏరియా ఆస్పత్రిని నాబార్డు నిధులు రూ.18కోట్లు సాధించారు. అన్ని హంగులతో కూడిన కార్పొరేట్‌ స్థాయిలో 100పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణంలో నోములది కీలకభూమిక. మాడ్గులపల్లి మండలంలోని తోపుచర్ల పీర్కా అభివృద్ధికి నోముల ఎంతో కృషిచేశారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తోపుచర్ల పీర్కాలో నోములకు అత్యధిక మెజార్టీ వచ్చింది. మండలాల పునర్విభజనలో మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి నుంచి 13 గ్రామపంచాయతీలు, సాగర్‌ నియోజకవర్గం నుంచి 10, నల్లగొండ నియోజకవర్గం నుంచి 5 పంచాయతీలతో మాడ్గులపల్లి మండల ఏర్పాటుకు నోముల కృషిచేశారు.


పలువురి నివాళి

నోముల మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. నివాళి అర్పించిన వారిలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీ్‌షరావు, జగదీ్‌షరెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, రైతుసమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షు డు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, జానారెడ్డి కుమారులు రఘువీర్‌రెడ్డి, జయ్‌వీర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కం కణాల శ్రీధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కంకణాల నివేదితారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ తదితరులు ఉన్నారు.


రేపు పాలెంలో అంత్యక్రియలు

నోముల నర్సింహయ్య చిన్న కుమార్తె ఆస్ట్రేలియా నుంచి రావాల్సి ఉండటంతో గురువారం ఆయన స్వగ్రామం పాలెంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పాలెంలోని నోముల వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌ మంగళవారం పరిశీలించారు.


ప్రజల కోసం పరితపించిన నేత నోముల : గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌

ప్రజలు, వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం పరితపించే వ్యక్తి నోముల నర్సింహయ్య. ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారానికి కృషి చేసేవారు. ఆయన మృతి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరనిలోటు. నర్సింహయ్య కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.


నర్సింహయ్య మృతి జిల్లాకు తీరని లోటు : జగదీ్‌షరెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి

నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మృతి ఉమ్మడి జిల్లాకు తీరనిలోటు. ఆయన మరణ వార్త దిగ్ర్భాంతికి గురిచేసింది. నోముల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.


జన నేత, మంచి మిత్రుడు దూరమయ్యారు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ప్రజా సమస్యలపై మార్క్సిస్టు దృక్పథంతో ఉద్యమించిన నేత నర్సింహయ్య అకాల మరణం ప్రజానీకానికి తీరని లోటు. నోముల నాకు సన్నిహితుడు, మంచి మిత్రుడు. సహచర శాసనసభ్యుడిగా అనేక సందర్భాల్లో కలిసి పోరాటాలు చేశాం. 30 ఏళ్ల ప్రజా జీవితంలో ఆయనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. చక్కని వాగ్ధాటితో బహుజనబాగు కోసం పాటుపడ్డారు. న్యాయవాదిగా కూడా పేదలపక్షాన గొంతుక బలంగా వినిపించారు.


మిత్రుడి మృతి బాధాకరం : జానారెడ్డి, సీఎల్పీ మాజీ నేత

నోముల మృతి చాలా బాధాకరం. 1987 నుంచి నాకు మిత్రుడిగా, అభిమానిగా ఉన్నారు. వామపక్షాలు, తెలుగుదేశం పొత్తుతో 1987లో ఎంపీపీగా అవకాశం ఇచ్చాం. నాడు మా పార్టీ వారు ఆ స్థానాన్ని వదులుకోవద్దని పట్టుబట్టినా, నేను అందరినీ ఒప్పించడంతో నర్సింహయ్య ఎంపీపీగా ఎన్నికయ్యారు. నాటి నుంచి మిత్రుడిగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు నా వద్దకు వచ్చారు. పరిస్థితుల దృష్ట్యా నాపై పోటీ చేసినా ఎన్నడూ వ్యక్తిగత దూషణలు లేవు. నన్ను గౌరవిస్తూ వచ్చిన విషయాన్ని మరవలేను. ఆయన హామీలను టీఆర్‌ఎస్‌ పూర్తిచేసి నిజమైన నివాళి ఇవ్వాలి.

Updated Date - 2020-12-02T05:59:50+05:30 IST