రాయితీ లేని ఉద్యానం

ABN , First Publish Date - 2022-06-22T05:55:04+05:30 IST

ఉద్యాన పంటలకు వ్యవసాయంలో ఓ ప్రత్యేకత ఉంది.

రాయితీ లేని ఉద్యానం
సాగు చేసిన బొప్పాయి పంట

 నాలుగేళ్లుగా అందని సబ్సిడీ 

 ఆందోళనలో 9,979 మంది రైతులు 

 రావాల్సిన రాయితీ రూ.3.16 కోట్లు  


రుద్రవరం, జూన్‌ 21: ఉద్యాన పంటలకు వ్యవసాయంలో ఓ ప్రత్యేకత ఉంది. వాటి సాగుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. పూలు, పండ్ల సాగు చేస్తే సబ్సిడీ ఇచ్చే విధానం గతంలో ఉండేది. నాలుగేళ్లుగా పాలకులు సబ్సిడీ ఇవ్వడం లేదని రైతులు అంటున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలు (పండ్లు, పూల తోటలు)సాగు చేసిన రైతులకు నాలుగేళ్లుగా సబ్సిడీ అందించడం లేదు. పండ్ల తోటలు సాగు చేస్తే ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుందనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అప్పుడో ఇప్పుడో సబ్సిడీ వస్తుందని ఇంత కాలం అఽధికారులు అంటూ వచ్చారు. ఎదురు చూపులు తప్ప రైతుల ఖాతాలో సబ్సిడీ జమ కాలేదు. బ్యాంకుకు వెళ్లి ఖాతాను పరిశీలించుకోవడం, అధికారులను అడగడం నిరాశకు గురి కావడం మామూలైంది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తానని గొప్పగా ప్రభుత్వం చెప్పుకోవడమేగాని ఆచరణలో ఎలాంటి ఫలితం కనిపించడం లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేసి సబ్సిడీ అందాల్సిన రైతులు 9,979 మంది ఉన్నారు. వీరికి  రూ.3.16 కోట్ల సబ్సిడీ అందాల్సి ఉంది. 


సబ్సిడీ వర్తించే పంటలు 


 చామంతి, బంతి, మల్లెపూల, అరటి, బొప్పాయి, దానిమ్మ, చీని, నిమ్మ, మామిడి తోటలకు, ప్రభుత్వం సబ్సిడీ వర్తింపజేయాలి. ఈ పంటల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని తీసుకొచ్చింది.  




బొప్పాయి సాగు చేశా


నాలుగేళ్లుగ బొప్పాయి పంట 15 ఎకరాల్లో సాగు చేస్తున్నా. ప్రభుత్వం నుంచి ఇంత వరకు సబ్సిడీ అందలేదు. సబ్సిడీ వస్తే పెట్టుబడికి ఆసరాగా ఉంటుందని ఆశించా. కానీ ఇంత వరకు ఇవ్వలేదు. 


 -బాచేపల్లె నారాయణ, రైతు, ఆలమూరు 


నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా


బొప్పాయి పంట ఐదెకరాల్లో సాగు చేశా. గతంలో సబ్సిడీ ఇస్తే దాన్ని ఉపయోగించుకొని మరింత విస్తీర్ణంలో పండ్ల తోటలు సాగు చేసేవాళ్లం. కానీ ఈ ప్రభుత్వంలో నాలుగేళ్లుగా ఎదురు చేస్తున్నా.  


 -గరుడయ్య, రైతు, ఆలమూరు


సబ్సిడీ అందలేదు


సబ్సిడీ నాలుగేళ్లుగా అందలేదు. బొప్పాయి పంట మూడున్నర ఎకరాల్లో సాగు చేశా. సబ్సిడీ వస్తుందని అధికారులు చెబుతున్నారే తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో పండ్ల తోటలు సాగు చేయాలంటే నిరాశగా ఉంది. 


-చంద్రశేఖర్‌, రైతు, ఆలమూరు 


నివేదికలు పంపించాం


పండ్ల తోటల సాగు వివరాలను, రైతులకు అందాల్సిన సబ్సిడీ నివేదికను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ చేస్తుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. 


-శ్రీధర్‌, ఉద్యానశాఖ అధికారి

Updated Date - 2022-06-22T05:55:04+05:30 IST