ఏవీ నాటి కళలు

ABN , First Publish Date - 2022-01-13T05:30:00+05:30 IST

ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనేది. ఘనంగా వేడుకలు నిర్వహించుకునేవారు. కోడిపందేలు, ఎడ్ల పందేలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులతో సంక్రాంతి పండుగ కళకళలాడేది. ఇప్పుడు సంక్రాంతి పండుగ కళ తప్పింది. తెల్లవారుజామునే బాలసంతలు, పకీరుల వేషాలు వంటి దృశ్యాలు ఏనాడో కనుమరుగయ్యాయి. ఇంటి ముందుకు వచ్చి ఆడే గంగిరెద్దు నృత్యాల జాడలేకుండా పోయాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో నెలరోజుల నుంచే సందడి వాతావరణం నెలకొనేది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో నామమాత్రంగానే పండుగ చేస్తున్నారు.

ఏవీ నాటి కళలు

జాడలేని గంగిరెద్దుల నృత్యాలు 

విన్పించని హరిదాసుల రాగాలు 

బద్వేలు, జనవరి 13: ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనేది. ఘనంగా వేడుకలు నిర్వహించుకునేవారు. కోడిపందేలు, ఎడ్ల పందేలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులతో సంక్రాంతి పండుగ కళకళలాడేది. ఇప్పుడు సంక్రాంతి పండుగ కళ తప్పింది. తెల్లవారుజామునే బాలసంతలు, పకీరుల వేషాలు వంటి దృశ్యాలు ఏనాడో కనుమరుగయ్యాయి. ఇంటి ముందుకు వచ్చి ఆడే గంగిరెద్దు నృత్యాల జాడలేకుండా పోయాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో నెలరోజుల నుంచే సందడి వాతావరణం నెలకొనేది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో నామమాత్రంగానే పండుగ చేస్తున్నారు.

వంటలూ రెడీమేడ్‌

ఒకప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందంటే 20రోజుల ముందు నుంచే ఇళ్లల్లో వివిధ రకాల వంటకాలు చేసేవారు. అయితే రెడీమేడ్‌లో ఇప్పుడు అవన్నీ దొరుకుతుండటంతో చాలామంది ఇంట్లో వంటలు చేయడానికి స్వస్తిపలికారు. దీంతో అలనాటి వంటకాలు, వాటి రుచులకు దూరమవుతున్నారు.

జాడలేని గంగిరెద్దుల నృత్యాలు

సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దులను ఎంతో అందంగా అలంకరించేవారు. ఇళ్లఎదుట మేళం వాంచుతుంటే వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నృత్యంచేసేవి. అయ్యగారికి దండంపెట్టు అని చెప్పిన వెంటనే గంగిరెద్దు కిందకు వంగి దండంపెట్టడం వంటివి సంక్రాంతికే కనిపించే దృశ్యాలు. ఆ  గంగిరెద్దుల నృత్యాలు ఇప్పుడు జాడలేకుండా పోతున్నాయి.

విన్పించని హరిదాసుల రాగం

సంక్రాంతి పండుగ రోజు గ్రామాల్లో హరిదాసుల హడావిడి ఉండేది. తలకు పాగా కట్టుకొని తంబురా చేతపట్టుకొని ఇంటి వద్దకు వచ్చి హరిలో రంగ హరి అంటూ ఎంతో ముచ్చటగా రాగాలు తీసేవారు. నేడు హరిదాసుల రాగాలే విన్పించడంలేదు.

కనిపించని ధాన్యపు రాశులు..

‘‘తాతయ్యా ధాన్యపు రాశులు చూపించవా... నానమ్మా  లేగదూడలు ఎక్కడా.. అమ్మమ్మా హరిదాసులేరి, గంగిరెద్దులేవీ’’. సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న పిల్లలు వేస్తున్న ప్రశ్నలు ఇవి. అయితే తాతయ్య, నానమ్మల గొంతు పెగలడం లేదు. బిక్కుమొఖంతో పిల్లలవైపు చూడటమే సమాధానమవుతోంది. వ్యవసాయంతో ముడిపడి సాగే సంక్రాంతిని ఈ సారి కరువు కమ్మేసింది. పల్లెల్లో పచ్చని పొలాలు బీళ్లుగా మారడంతో రైతన్నల ముంగిట ధాన్యపు రాశులు పెద్దగా కానరావడం లేదు. గత ఏడాదికన్నా, ఈ సారి వ్యాపారాలు బాగా తగ్గాయని, వ్యాపార వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.


ఆ కాలమే వేరు

‘‘హరిదాసులు.. గంగిరెద్దుల వాళ్లు.. వీధి నాటకాలు, పగటి వేషధారుల కోసం అప్పట్లో  మమ్మల్ని పిలుచుకపోయి సంక్రాంతి సంబరాలు చేసుకునేవారు.. ఇప్పుడేమో ఆ ఊసే లేదు. వాటిని నమ్ముకొని జీవించేవాళ్లం. గ్రామ పెద్దలే కాదు.. ఇప్పటి ప్రభుత్వం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించకుండా మానేసింది. వాటినే నమ్ముకున్న మేము ఎలా గడపాల్లో అర్థం కావడం లేదు’’ అని పార్వతీనగర్‌ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.  మైదుకూరు పట్టణ శివారులోని పార్వతీనగర్‌లో అన్ని రకాల కళాకారులు ఉన్నారు. విచిత్ర వేషధారణలు, హరికథలు, బుర్రకథలు, పగటి వేషధారులు, బహురూపులు, హరిదాసులు.. ఇలా సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబించే వేషాలు వేసి కడుపునింపుకునేవారు. అయితే ఇది కాల క్రమేణా కనుమరుగైపోతోంది. గతంలో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు సంక్రాంతి, ఉగాది సంబరాల పేరుతో కార్యక్రమాలు వీరితో నిర్వహించేవి. మూడేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు చేయడమే మానుకున్నారని, ఇలానే కొనసాగితే సంప్రదాయలను భావితరాలు మరిచిపోవాల్సిందేనని పార్వతీపురం కళాకారులు ఆవేదన చెందుతున్నారు.                

 - మైదుకూరు


వారికి బెంగళూరులోనే పండగ

ప్రతి ఏడాది అందరూ స్వగ్రామాలలో అందరి మధ్య సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకుంటారు. కాని ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాల వారు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ప్రదర్శనలు ఇచ్చి వారు ఇచ్చే కానుకలతో జీవనం సాగిస్తారు. ఉగాదికి మాత్రం స్వగ్రామాలకు చేరుకుంటారు. పోరుమామిళ్ల మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు పదేళ్లుగా బెంగళూరు సమీపంలోని ఖాళీ జాగాలలో గుడారాలు వేసుకొని అక్కడే జీవనం సాగిస్తూ సంక్రాంతి పర్వదినాన గంగిరెద్దులతో ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆ గ్రామానికి చెందిన కాశీ, సుబ్బయ్య మాట్లాడుతూ తర తరాలుగా వచ్చిన ఈ విద్యను తాము బెంగళూరు, మైసూరు లాంటి ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తున్నామన్నారు. సంక్రాంతి సమయాల్లో గంగిరెద్దుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. మిగిలిన రోజుల్లో బ్యాండు మేళాలకు వెళుతూ జీవనం సాగిస్తున్నామన్నారు. సొంత ఊరిలో ఆదరణ లేకపోవడంతో కర్ణాటకలో ఎక్కువగా తమ ప్రదర్శనలు ఇస్తున్నారని సమాచారం.

- పోరుమామిళ్ల

Updated Date - 2022-01-13T05:30:00+05:30 IST