ఎవరూ తక్కువ కాదు!

ABN , First Publish Date - 2022-07-06T09:37:00+05:30 IST

అనుమతి ఉన్నదానికి మించి భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు విధించినందుకు గాను టీఆర్‌ఎస్‌ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఇప్పటిదాకా విధించిన రకరకాల జరిమానాల బకాయి దాదాపు 45 లక్షల రూపాయలు! బీజేపీ బకాయిలు రూ.40 లక్షల దాకా ఉండగా.

ఎవరూ తక్కువ కాదు!

  • టీఆర్‌ఎస్‌ 45 లక్షలు.. బీజేపీ 40 లక్షలు
  • భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లపై విధించిన పెనాల్టీ బకాయిలివి
  • జరిమానా విధించి వసూలును మరిచిన ఈవీడీఎం
  • బడా వ్యాపార సంస్థల నుంచీ భారీగా పెండింగ్‌
  • పట్టించుకోని యంత్రాంగం.. ఒత్తిళ్లే కారణమా?
  • అధికారుల తీరుపై పౌరుల తీవ్ర ఆగ్రహం


హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): అనుమతి ఉన్నదానికి మించి భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు విధించినందుకు గాను టీఆర్‌ఎస్‌ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఇప్పటిదాకా విధించిన రకరకాల జరిమానాల బకాయి దాదాపు 45 లక్షల రూపాయలు! బీజేపీ బకాయిలు రూ.40 లక్షల దాకా ఉండగా.. అందులో మొన్నటి కార్యవర్గ సమావేశాల తాలూకూ బకాయిలే రూ.22 లక్షలు! సామాన్యులు, చిన్న వ్యాపారుల నుంచి ఈ బకాయిలను ముక్కుపిండి వసూలు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌(ఈవీడీఎం).. రాజకీయ పార్టీలు, బడా వ్యాపార సంస్థల విషయంలో మాత్రం పట్టనట్టు ఉండిపోతోంది. నిబంధనల నిక్కచ్చి అమలు, అక్రమ నిర్మాణాల నియంత్రణ, అవినీతి, అక్రమాలపై సంస్థాగత విచారణ, విపత్తుల సమయంలో మెరుగైన నిర్వహణ లక్ష్యంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత ఆసక్తితో ఏర్పాటుచేయించిన విభాగమే ‘ఈవీడీఎం’. నాలుగేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీలో పురుడు పోసుకున్న ప్రత్యేక విభాగమిది. దీనికోసం కేటీఆర్‌ ప్రత్యేకంగా ఒక ఐపీఎస్‌ అధికారిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు.


 హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుతో నగరం లుక్‌ దెబ్బతింటుందని భావించిన కేటీఆర్‌.. పబ్లిక్‌ డిఫే్‌సమెంట్‌ యాక్ట్‌ ఖచ్చిత అమలుకు ఆదేశాలు జారీ చేశారు. 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే హోర్డింగ్‌లను నిషేధించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ఏర్పాటుచేసిన వారికి పెనాల్టీ విధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ మల, మూత్ర విసర్జనకూ జరిమానా వేయాలని నిర్ణయించారు. కానీ ఈవీడీఎం పనితీరు మాత్రం.. ఆరంభ శూరత్వమే అన్నట్టుగా మారింది. ఆదిలో క్షేత్రస్థాయి తనిఖీలు, పెనాల్టీలతో హడావిడి చేసిన అధికారులు కొంతకాలంగా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ట్విటర్‌ఫిర్యాదుల ఆధారంగా విధించిన పెనాల్టీల వసూలులోనూ ఉదాసీనత కనబరుస్తున్నారు. కాగా, నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు తీసుకునేందుకు బుద్ధభవన్‌లో ఈవీడీఎం సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  సెల్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి ట్విటర్‌ ఖాతా తెరిచిన అధికారులు.. ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి తీసుకువస్తామని 2019లో ప్రకటించారు. మూడేళ్లు గడుస్తున్నా ఆ యాప్‌ అందుబాటులోకి రాలేదు. ఇన్నాళ్లుగా ట్విటర్‌ఖాతాలో వస్తున్న  ఫిర్యాదుల ఆధారంగా జరిమానాలు విధిస్తున్నారు. ఇలా గత మూడేళ్లలో రూ.12 కోట్ల పెనాల్టీలు వేశారు. కానీ, ఇప్పటి వరకూ వసూలు చేసింది మాత్రం రూ1.19 కోట్లే. విధించిన పెనాల్టీల్లో వసూలైంది పది శాతంలోపే. అవీ సామాన్యులు, వ్యాపారస్తుల నుంచి వసూలు చేసినవేకావడం గమనార్హం. 


సామాన్యుల నుంచి పెనాల్టీ వసూలు చేస్తున్న ఈవీడీఎం.. రాజకీయ పార్టీలు, బడా వ్యాపార సంస్థల జోలికి మాత్రం వెళ్లట్లేదు. ఉదాహరణకు.. 2021, 2022 సంవత్సరాల్లో టీఆర్‌ఎస్‌  రెండుసార్లు ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది. ఆ సమయంలో నగరం మొత్తం కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలతో ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్లీనరీలు జరిగిన రెండుసార్లూ.. ఈవీడీఎం ట్విటర్‌ఖాతా పని చేయలేదు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌, సర్వర్‌ డౌన్‌ అంటు మూడు, నాలుగు రోజులు సస్పెన్షన్‌లో పెట్టారు. అప్పట్లో ఈవీడీఎం డైరెక్టర్‌ కూడా సెలవులో వెళ్లడం గమనార్హం.  అయితే, సీఈసీ- ఈవీడీఎం ఖాతా అందుబాటులోకి రాగానే నెటిజన్లు వెల్లువలా ఫిర్యాదు చేశారు. దీంతో సీఈసీ- ఈవీడీఎం బృందం ఈ-చలానాలు జారీచేసింది. అలాగే, ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లపై రూ.4 లక్షలు జరిమానా విధించింది. ఇలా ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌, ఆ పార్టీ నేతలకు విధించిన పెనాల్టీ రూ.45.50 లక్షలు కాగా.. చిన్నా, చితక నేతలు రూ.5 వేలు, రూ.10 వేల జరిమానాలు మాత్రమే చెల్లించారు. ఇప్పటికీ రూ.45 లక్షలకుపైగా జరిమానా బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 70 శాతానికిపైగా టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పేరిట పార్టీకి వేసిన పెనాల్టీలు కావడం గమనార్హం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ పాదయాత్ర, నగరానికి  ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల రాక, పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా బీజేపీకీ భారీగానే జరిమానాలు విధించారు. అలాగే.. కాంగ్రెస్‌, ఆ పార్టీ నేతలు రూ.5 లక్షలు, ఎంఐఎం, ఆ పార్టీ నేతలు రూ.1.5 లక్షల బకాయి ఉన్నారని ఓ అధికారి తెలిపారు. కొన్నాళ్ల క్రితం అమీర్‌పేట, సోమాజిగూడ ప్రాంతాల్లో ఛలానాలు చెల్లించని దుకాణాలను మూసి వేసిన ఈవీడీఎం అనంతరం వెనక్కి తగ్గింది. ఉన్నత స్థాయి ఒత్తిళ్లే ఇందుకు కారణమన్న అభిప్రాయం ఉంది.

Updated Date - 2022-07-06T09:37:00+05:30 IST