Advertisement

నత్తతో పోటీ..!

Jan 21 2021 @ 23:52PM
పెండ్లిమర్రి మండలంలో ఆగిపోయిన గాలేరు-నగరి ప్యాకేజీ-2 పనులు

పురోగతి లేని జీఎనఎ్‌సఎ్‌స ప్రధాన కాలువ పనులు

రూ.735 కోట్లతో ప్యాకేజీ-1, 2 

జగన వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌

పనులు చేపట్టిన పీఎల్‌ఆర్‌, ఎంఆర్‌కేఆర్‌ 

రూ.105 కోట్లు బకాయి 

గాలేరు-నగరి ప్రాజెక్టు ఫేజ్‌-2 తాజా పరిస్థితి


గాలేరు-నగరి ఫేజ్‌-2 పనులపై పదైదేళ్ల నిర్లక్ష్యం. ఫారెస్టు అనుమతుల్లో జాప్యం.. పాలకుల వైఫల్యం వెరసి పురోగతి నత్తకు నడక నేర్పుతోంది. గత ప్రభుత్వంలో వేసిన టెండర్లను జగన ప్రభుత్వం రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా మళ్లీ టెండర్లు పిలిచింది. పీఎల్‌ఆర్‌, ఎంఆర్‌కేఆర్‌ కంపెనీలు పనులు సొంతం చేసుకున్నాయి. గత జూలైలో ఆర్భాటంగా పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.105 కోట్ల పనులు చేసినా బిల్లులు రాక పురోగతి పడకేసింది. గడువులోగా ప్రధాన కాలువ పూర్తి కావడం ప్రశ్నార్థకమే అని స్థానికులు అంటున్నారు.. ప్యాకేజీ-3, 4, 5 టెండర్ల దశ దాటడం లేదు. గాలేరు-నగరి ప్రాజెక్టు ప్రధాన కాలువ తాజా పరిస్థితి ఇది. 


(కడప-ఆంధ్రజ్యోతి): గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎనఎ్‌సఎ్‌స) ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాలకు తాగునీరు అందించడం. శ్రీశైలం జలాశయం ఎగువ నుంచి 38 టీఎంసీలు కృష్ణా వరద జలాలు తీసుకోవడానికి వీలుగా 2004-05లో అప్పటీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఫేజ్‌-2 కింద కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రధాన కాలువ, రిజర్వాయర్ల నిర్మాణాలకు రూ.2,189 కోట్లు మంజూరు చేస్తూ 2005 అక్టోబరు 15న పరిపాలనా అనుమతులు ఇచ్చారు. 14 ప్యాకేజీలకు టెండర్ల ద్వారా 2006లో కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. రూ.946.82 కోట్లతో ప్యాకేజీ-1 నుంచి 7 వరకు కడప జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టు సీఈ పర్యవేక్షణలో పనులు చేపట్టారు. అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం, కాంట్రాక్ట్‌ సంస్థల బాధ్యతారాహిత్యం, పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం... కారణాలు ఏవైనా పనుల్లో ప్రగతి 20-25 శాతం కూడా దాటలేదు. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందే తప్ప ప్రాజెక్టు ఆశయం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం ప్యాకేజీ-1, 2 కాంట్రాక్టర్ల విన్నపం మేరకు పనులు రద్దు చేసి 2019లో రీటెండర్లు నిర్వహిస్తే.. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమే్‌షకు చెందిన రిత్విక్‌ సంస్థ టెండరు దక్కించుకుని జలవనరుల శాఖతో ఒప్పందం (అగ్రిమెంట్‌) కూడా చేసుకుంది. 


పడకేసిన పురోగతి

సీఎం జగన ప్రభుత్వం కొలువుదీరాక గత ప్రభుత్వంలో వేసిన టెండర్లను రద్దు చేసింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా 2019 డిసెంబరులో టెండర్లు నిర్వహించారు. గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా 32 కి.మీల నుంచి 66 కి.మీల వరకు ప్రధాన కాలువ నిర్మాణ పనులకు ప్యాకేజీ-1 కింద రూ.391.14 కోట్లతో నిర్వహించిన రివర్స్‌ టెండర్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ నిర్మాణ సంస్థ పనులను దక్కించుకుంది. 66 నుంచి 96 కి.మీల వరకు మెయిన కెనాల్‌ పనులు ప్యాకేజీ-2 కింద రూ.349.97 కోట్లతో రివర్స్‌ టెండర్లు పిలిస్తే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబానికి చెందిన ఎంఆర్‌కేఆర్‌ నిర్మాణ సంస్థ టెండరు సొంతం చేసుకుంది. ఈ కంపెనీలు ఇరిగేషన శాఖతో ఒప్పందం చేసుకుని 2020 జూలై నెలలో నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పనులను ఎంతో ఆర్భాటంగా చేపట్టారు. తండ్రి కలల ప్రాజెక్టు కావడంతో సీఎం జగన జీఎనఎ్‌సఎ్‌స ఫేజ్‌-2 పనులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 36 నెలల గడువులోగా పూర్తి చేస్తారని స్థానికులు ఆశించారు. ప్యాకేజీ-1 కింద దాదాపు రూ.25 కోట్లు ఖర్చు చేసి 6.5 శాతం పనులు చేస్తే.. ప్యాకేజీ-2 పరిధిలో రూ.80 కోట్లు ఖర్చు చేసి 22.85 శాతం పూర్తి చేశారు. ఇంతవరకు భాగానే ఉన్నా ఇప్పటిదాక చేసిన సుమారు రూ.105 కోట్ల బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను సబ్‌ కాంట్రాక్టర్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లులు రాకపోవడం.. అప్పులు చేసి పనులు చేయలేమంటూ కొందరు సబ్‌ కాంట్రాక్టర్లు వాహనాలకు బ్రేకులు వేసినట్లు సమాచారం. దీంతో ఎక్కడి పనులు అక్కడే.. అన్న చందంగా మారాయి.


ఆ ప్యాకేజీలకు టెండర్లు ఎప్పుడో..?

ప్యాకేజీ-1, 2లకు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి పనులు చేపట్టారు. ప్యాకేజీ-4, 5, 6, 7 నాలుగు ప్యాకేజీల పనులు టెండరు దశకు కూడా చేరుకోలేదు. ఫారెస్ట్‌ క్లియరెన్స లేకపోవడమే పనులకు ప్రధాన అడ్డంకిగా మారుతోందని ఇంజనీర్లు అంటున్నారు. మిగిలిన నాలుగు ప్యాకేజీల బ్యాలెన్స పనుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిధులు, పరిపాలన అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ పనులు పూర్తి చేస్తేనే జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వవచ్చు. ఇప్పటికే 15 ఏళ్లు గడిచిపోయింది. జగన ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడంతో జిల్లాలో పలు ప్రాంతాలకు కృష్ణా జలాలు కలేనా..? అనే సందేహం వ్యక్తమవుతోంది.


కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు

- మధుసూదనరెడ్డి, ఎస్‌ఈ, గాలేరు-నగరి ప్రాజెక్టు, కడప

గాలేరు-నగరి ప్రాజెక్టు ప్యాకేజీ-1, 2 పరిధిలో జూలై నెలలో పనులు మొదలు పెట్టాం. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థలు పనులు చేస్తున్నాయి. ప్యాకేజీ-1 కింద పీఎల్‌ఆర్‌ సంస్థ సుమారుగా రూ.25 కోట్లు, ప్యాకేజీ-2 పరిధిలో దాదాపుగా రూ.80 కోట్లు పనులు చేశారు. బిల్లులు ప్రభుత్వానికి పంపాం.

 
కాంట్రాక్టరు క్యాంపులో ఆగిపోయిన వాహనాలు


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.