ఎన్నాళ్లీ ప్రసవ వేదన

ABN , First Publish Date - 2022-06-28T05:30:00+05:30 IST

చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజూ కనీసం ఆరుగురు గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు.

ఎన్నాళ్లీ ప్రసవ వేదన
గర్భిణిని పరీక్షిస్తున్న వైద్యాధికారి

- చింతపల్లి సీహెచ్‌సీలో భర్తీకాని గైనకాలజిస్టు, ఎనస్థీషియా పోస్టులు

- ప్రసవం కష్టమైతే 50 దూరంలో ఉన్న నర్సీపట్నం తరలింపు

- ప్రకటనలకే పరిమితమైన శస్త్రచికిత్స ప్రసవాలు


సామాజిక ఆరోగ్య కేంద్రంలో శస్త్రచికిత్స ప్రసవాలు జరగడం లేదు. ఆస్పత్రి స్థాయి పెరిగినా ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులు భర్తీ కావడంలేదు. ప్రధానంగా గైనకాలజిస్టు, ఎనస్థీషియా పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం వల్ల గర్భిణులకు అవస్థలు తప్పడం లేదు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రసవం కాస్త కష్టమైతే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అంబులెన్స్‌లో తరలిస్తున్న గర్భిణులకు మార్గమధ్యంలో నొప్పులు అధికం కావడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 


చింతపల్లి, జూన్‌ 27: చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజూ కనీసం ఆరుగురు గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. చింతపల్లి, జీకేవీధి మండలాల పరిధిలో ఉన్న 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణులను ప్రసవం కోసం చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుంటారు. దీనికి తోడు చింతపల్లిలో ఐటీడీఏ ఏర్పాటు చేసిన గర్భిణుల వసతి గృహం అందుబాటులో ఉండడంతో రెండు మండలాల గర్భిణులు అధిక సంఖ్యలో ప్రసవం కోసం సీహెచ్‌సీకి వస్తున్నారు. గర్భిణుల వసతి గృహంలో ప్రతి రోజు పది మంది గర్భిణులు ఉంటున్నారు. నొప్పులు ప్రారంభమైన గర్భిణులను వసతి గృహం నుంచి సీహెచ్‌సీకి తీసుకొస్తున్నారు. అయితే సాధారణ ప్రసవాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 90కిపైగా సాధారణ ప్రసవాలు సీహెచ్‌సీలో జరుగుతున్నాయి. కాస్త ప్రసవం కష్టమైతే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి వస్తుంది. ప్రతి నెల 50- 60 మంది గర్భిణులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. 

దూరాభారం

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి 50 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో గర్భిణులకు భారంగా మారింది. పాడేరు జిల్లా ఆస్పత్రి 69 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడికి పంపించే అవకాశం లేదు. సీహెచ్‌సీలో గర్భిణుల ప్రసవం కష్టమైతే అంబులెన్స్‌లో నర్సీపట్నం తరలిస్తున్నారు. ఓ వైపు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ అంబులెన్స్‌లో గంటన్నర ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన మల్కన్‌గిరి జిల్లా రోళ్లగెడ్డ పంచాయతీ లక్ష్మీపల్లికి చెందిన కొర్ర శారను అంబులెన్స్‌లో తరలిస్తుండగా లంబసింగి ఘాట్‌లో పురిటినొప్పులు అధికమై ఆ వాహనంలోనే ప్రసవించింది. ముందు జాగ్రత్తగా స్టాఫ్‌ నర్సును వైద్యాధికారి అంబులెన్స్‌లో పంపడంతో పురుడుపోశారు.  

ప్రకటనలకే పరిమితం

చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో శస్త్రచికిత్స ప్రసవాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సీహెచ్‌సీ 50 పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచినప్పటికి ప్రత్యేక వైద్యుల పోస్టులు భర్తీకావడంలేదు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి నుంచి గైనకాలజిస్టు చింతపల్లి సీహెచ్‌సీకి వారంలో మూడు, నాలుగు రోజులు వచ్చి చికిత్స అందిస్తున్నప్పటికి శస్త్రచికిత్స ప్రసవాలు చేసే పరిస్థితి లేదు. జనవరిలో చింతపల్లి వచ్చిన ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున సీహెచ్‌సీని సందర్శించి ఐదు నెలల్లో చింతపల్లిలో శస్త్రచికిత్స ప్రసవాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ శస్త్రచికిత్స ప్రసవాలు ప్రారంభించేందుకు పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

పోస్టుల భర్తీకి చర్యలు 

సీహెచ్‌సీలో శస్త్రచికిత్స ప్రసవాలు ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్‌, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గైనకాలజిస్టు, ఎనస్థీషియా పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నెలకు రూ.1.5 లక్షల జీతం చెల్లించేందుకు ఐటీడీఏ సిద్ధపడినా ఇక్కడ పనిచేసేందుకు వైద్యులు ముందుకురావడంలేదు. ఈ కారణంగా ప్రత్యేక వైద్యుల పోస్టులు భర్తీకావడం లేదు. 

- డాక్టర్‌ డి.మహేశ్వరరావు, సూపరింటెండెంట్‌, సీహెచ్‌సీ, చింతపల్లి


Updated Date - 2022-06-28T05:30:00+05:30 IST