సముద్రంలో ఆగని వేట!

ABN , First Publish Date - 2022-05-19T06:38:07+05:30 IST

సముద్రంలో చేపల వేటపై ప్రస్తు తం నిషేధం ఉన్నా... కొంతమంది మత్స్యకారులు ఉల్లంఘిస్తున్నారు.

సముద్రంలో ఆగని వేట!
ఫిషింగ్‌ హార్బరులో వేలానికి పెట్టిన భారీ చేపలు

హార్బర్‌కు భారీగా చేపలు    

నిషేధానికి తూట్లు

పట్టించుకోని అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సముద్రంలో చేపల వేటపై ప్రస్తు తం నిషేధం ఉన్నా... కొంతమంది మత్స్యకారులు ఉల్లంఘిస్తున్నారు. అర్ధరాత్రి వేళ వెళ్లి...తెల్లవారేసరికి భారీ చేపలతో తీరాన్ని చేరుతున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌లో సాధారణ రోజుల్లో ఎలాగైతే చేపల వేలం జరుగుతుందో... ఇప్పుడు కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. ఏప్రిల్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ జూన్‌ 14వ తేదీ వరకు చేపల వేటపై నిషేధం ఉంది. సంప్రదాయ బోట్లు వినియోగించేవారు తప్ప ఇంజన్లు కలిగిన బోట్లు వేటకు వెళ్లకూడదు. ఆ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే...చర్యలు చేపట్టే అధికారం మత్స్య శాఖ అధికారులకు ఉంది. కానీ వారు నిషేధం అమలుపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. పొరపాటున ఒకటి అరా కేసులు పెట్టినా రాజకీయ నాయకుల ఆదేశం మేరకు ఆ బోట్లను వదిలిపెట్టాల్సి వస్తోంది. దాంతో వారు ఆ విషయం పట్టించుకోవడం లేదు.

పెదజాలరిపేట నుంచే ఎక్కువ

పెదజాలరిపేటకు చెందిన కొంతమంది ఫైబర్‌ తెప్పలకు రెండు ఇంజన్లు బిగించి సముద్రంలో వేటకు వెళ్లిపోతున్నారు. ఇతర బోట్లు ఏవీ వేట సాగించకపోవడం వల్ల వారికి సులువుగానే చేపలు లభిస్తున్నాయి. దాంతో నాలుగైదు గంటల్లోనే భారీ వేటతో తీరం చేరుతున్నారు. వారికి సూరలు, కొమ్ముకోనెం చేపలు ఎక్కువగా లభిస్తున్నాయి. వాటిని తీసుకొచ్చి ఫిషింగ్‌ హార్బర్‌లోనే వేలం వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో హార్బర్‌లో ఇదే దృశ్యం కనిపించింది. వేట నిషేధ సమయంలో ఇన్ని చేపలు ఎక్కడి నుంచి తెస్తున్నారని ఏ అధికారీ వారిని ప్రశ్నించడం లేదు. కనీసం జిల్లా ఉన్నతాధికారులైనా...దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాజకీయ సిఫారసులను పక్కకు పెట్టక తప్పదు. 


Updated Date - 2022-05-19T06:38:07+05:30 IST