ఆగని రేషన్‌ బియ్యం అక్రమ దందా

ABN , First Publish Date - 2022-09-25T04:29:37+05:30 IST

ప్రభుత్వం అందిస్తున్న రాయితీ బియ్యం కొంతమంది వ్యాపారులకు కాసులు కూడబెడుతోంది. ప్రభుత్వం పేదలకు అందించే రేషన్‌ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఆగని రేషన్‌ బియ్యం అక్రమ దందా

- సరిహద్దులు దాటుతున్న రేషన్‌ బియ్యం

- అక్రమంగా మహారాష్ట్రకు రవాణా

- రేషన్‌ షాపులు, లబ్దిదారుల నుంచి సేకరణ

- దాడులు చేస్తున్నా కొనసాగుతున్న వైనం

బెజ్జూరు, సెప్టెంబరు 17: ప్రభుత్వం అందిస్తున్న రాయితీ బియ్యం కొంతమంది వ్యాపారులకు కాసులు కూడబెడుతోంది. ప్రభుత్వం పేదలకు అందించే రేషన్‌ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆహార భద్రతా పథకాన్ని అబాసుపాలు చేస్తున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15కిలోల బియ్యం ఇస్తుండటంతో బియ్యం అక్రమ దందా జోరందుకుంది. రేషన్‌ షాపులు, లబ్ధిదారుల నుంచి దళారులు బియ్యాన్ని సేకరించి ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటున్నారు. కొంతమంది దళారులు రేషన్‌ బియ్యాన్ని సేకరించేందుకు కొన్ని టీంలు ఏర్పాటు చేసి బియ్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. నిత్యం బియ్యం దందా కొనసాగుతూ ఏదో ఒక చోట పట్టుబడుతున్నా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. 

ఇదీ పరిస్థితి

ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. వీటిని వదిలి బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం కొంటున్నారు. ఇంట్లో దొడ్డు బియ్యం తినడం లేదని మరికొంతమంది విక్రయిస్తున్నారు. సగటున కిలోకు రూ.10చొప్పున దళారులకు, ఇతరులకు అమ్ముతున్నారు. మరి కొన్నిచోట్ల కొనేవారు ఇంటింటికి తిరిగి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. సిర్పూర్‌ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెజ్జూరు, కౌటాల, సిర్పూర్‌(టి), చింతలమానేపల్లి తదితర మండలాల్లో రేషన్‌దందా జోరుగా కొనసాగుతోంది. ఆయా మండలాల్లో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి బియ్యానికి మహారాష్ట్రలో మంచి డిమాండ్‌ ఉండటంతో కొంతమంది ఇదే పనిగా పెట్టుకొని బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడ కిలోకు రూ.10తో కొనుక్కొని అక్కడ కిలోకు రూ.20నుంచి 30వరకు అమ్ముకుంటున్నారు. కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల సరిహద్దున గల ప్రాణహిత నదిపై గూడెం వద్ద వంతెన పూర్తి కావడంతో అక్రమార్కులకు ఇది రాచమార్గంగా మారింది. ప్రతి నిత్యం రాత్రి వేళల్లో ద్విచక్రవాహనాలు, బొలేరో, ఆటోల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలించి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక సిర్పూర్‌ వంటి మండలం నుంచి రైళ్ల ద్వారా బియ్యాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు తరచూ దాడులు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొంతమంది రేషన్‌ డీలర్ల వద్ద నుంచే బియ్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలోనే దళారులు లబ్దిదారుల నుంచి అక్కడే కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది రేషన్‌ డీలర్లు కూడా దళారులతో చేతులు కలిపి ఈ వ్యవహారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై ఈ తంతు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డీలర్లు బయటకు రాకుండా ఉండేందుకు దళారుల చేత బియ్యాన్ని సేకరించి వచ్చిన ఆదాయంలో సమంగా పంచుకుంటున్నారని బాహాటంగానే ఆరోపణలు ఉన్నాయి.

అడ్డుకట్ట పడేదెన్నడో

గ్రామాల నుంచి నిత్యం రేషన్‌ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిపోతున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. పేదలకు సరఫరా చేస్తున్న రాయితీ బియ్యం ద్వారా అక్రమార్కులు లక్షలు ఆర్జిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం అందిన సమయాల్లోనే దాడులకు పాల్పడి కేసులు నమోదు చేస్తున్నారే తప్ప అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ బియ్యం రవాణా అక్రమార్కులకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మారింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2022-09-25T04:29:37+05:30 IST