నోరూరించే న్యూడుల్స్‌

ABN , First Publish Date - 2021-09-18T06:07:27+05:30 IST

నూడుల్స్‌ అనగానే ఎవరికైనా టేస్ట్‌ చేయాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. అయితే నూడుల్స్‌ అంటే ఫ్రై ఒక్కటే కాదు. వాటితో సమోసాలు చేసుకోవచ్చు. సూప్‌ తయారుచేసుకుని లాగించొచ్చు...

నోరూరించే న్యూడుల్స్‌

నూడుల్స్‌ అనగానే ఎవరికైనా టేస్ట్‌ చేయాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. అయితే నూడుల్స్‌ అంటే ఫ్రై ఒక్కటే కాదు. వాటితో సమోసాలు చేసుకోవచ్చు. సూప్‌ తయారుచేసుకుని లాగించొచ్చు. రొయ్యలతో కలిపి రుచి చూడొచ్చు. థాయ్‌ రుచులు ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. మరి ఈ వారం అలాంటి నూడుల్స్‌ రెసిపీల తయారీ విశేషాలు మీకోసం...


వందగ్రాముల నూడుల్స్‌లో పోషక విలువలు

  • క్యాలరీలు 137
  • ఫ్యాట్‌ 2.6గ్రా
  • కార్బోహైడ్రేట్లు 25గ్రా
  • ప్రొటీన్లు 4.5గ్రా


  1. చైనాలో 4వేల ఏళ్ల క్రితమే నూడుల్స్‌ ఉన్నట్లు పరిశోధకుల అంచనా.
  2. ఇప్పుడంటే నూడుల్స్‌ అందరికీ అందుబాటులో ఉన్నాయి కానీ ఒకప్పుడు లగ్జరీ ఫుడ్‌ అది. బాగా డబ్బున్న వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.
  3. ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ను మొదట జపాన్‌ వాళ్లు తయారు చేశారు.
  4. జపాన్‌లోని యోకొహోమాలో యోకొహోమా కప్‌ నూడుల్స్‌ పేరుతో ఒక మ్యూజియం ఉంది.




నూడుల్స్‌ సమోసా

కావలసినవి

నూడుల్స్‌ ఉడికించినవి - ఒక బౌల్‌ నిండా, నూనె - సరిపడా, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, క్యాప్సికం - ఒకటి, క్యారెట్‌ - ఒకటి, క్యాబేజీ తురుము - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, సోయా సాస్‌ - రెండు టీస్పూన్లు, వెనిగర్‌ - ఒకటేబుల్‌స్పూన్‌, మైదా - రెండు కప్పులు, గోధుమపిండి - ఒక కప్పు, వాము - ఒక టీస్పూన్‌, నీళ్లు - కొద్దిగా. 


తయారీ విధానం

  1. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. 
  2. తరువాత క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం, క్యాబేజీ తురుము వేసి మరికాసేపు వేగించుకోవాలి.
  3. తగినంత ఉప్పు వేసి, సోయాసాస్‌, వెనిగర్‌, ఉడికించిన నూడుల్స్‌ వేసి కలుపుకోవాలి. కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక ప్లేట్‌లో మైదా, గోధుమపిండి వేసి, తగినంత ఉప్పు, వాము, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంటపాటు పక్కన పెట్టాలి.
  5. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీల్లా చేసుకోవాలి. తరువాత సగానికి కట్‌ చేసుకోవాలి. ఆ భాగాన్ని మళ్లీ సగానికి కట్‌ చేయాలి.
  6. తరువాత ఒక భాగం తీసుకుని మధ్యలో నూడుల్స్‌ మిశ్రమం పెట్టి చివర్లు నూనె లేదా నీటితో అద్దుతూ మూసేయాలి. 
  7. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక సమోసాలు వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా ఏదైనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి. 





లక్సా

ఇది నూడుల్స్‌ సూప్‌. సింగపూర్‌లో ఎక్కువ మంది ఇష్టంగా లాగిస్తారు. దీని తయారీకి...

కావలసినవి: రొయ్యలు - రెండు, చికెన్‌ - పావు కప్పు, నూడుల్స్‌ - పావు కప్పు, చికెన్‌ స్టాక్‌ - ఒక కప్పు, లక్సా పేస్ట్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపాలు - ముప్పావు కప్పు, పుదీనా, కొత్తిమీర - కొద్దిగా, నిమ్మకాయ - ఒకటి.

లక్సా పేస్టు కోసం : వెల్లుల్లి రెబ్బలు - ఐదు, పచ్చిమిర్చి - ఐదారు, ఎండుమిర్చి - ఐదారు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం - కొద్దిగా, రొయ్యల పేస్టు - అర టేబుల్‌స్పూన్‌, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, వేరుశనగలు - ఒక కప్పు.

గార్నిష్‌ కోసం : చిల్లీ ఫ్లేక్స్‌ - అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - ఒక టేబుల్‌స్పూన్‌(దంచి వేగించినవి), ఉల్లిపాయలు - ఒక టేబుల్‌స్పూన్‌(వేగించినవి), వేరుశనగలు - ఒక టేబుల్‌స్పూన్‌(పొట్టు తీసి దంచినవి), కోడిగుడ్డు - ఒకటి(ఉడికించినది),  కొత్తిమీర - కొద్దిగా.


తయారీ విధానం

  1. రొయ్యలను, చికెన్‌ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. నూడుల్స్‌ను నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి.
  2. తరువాత లక్సా పేస్టు తయారుచేసుకోవాలి. ఇందుకోసం మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, రొయ్యల పేస్టు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, పసుపు, వేరుశనగలు, కొత్తిమీర మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి. 
  3. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక లక్సా పేస్టు వేయాలి. తరువాత కొబ్బరిపాలు వేసి కలపాలి. 
  4. కాసేపు ఉడికిన తరువాత చికెన్‌ స్టాక్‌ వేసుకోవాలి. మరుగుతున్న సమయంలో ఉప్పు వేసి రొయ్యలు, చికెన్‌ ముక్కలు వేసి కలుపుకోవాలి.
  5. కాసేపు ఉడికిన తరువాత నూడుల్స్‌ వేసి మరికాసేపు ఉడికించాలి.
  6. పుదీనా, కొత్తిమీర వేయాలి. చివరగా చిల్లీ ఫ్లేక్స్‌, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, వేరుశనగలు, కోడిగుడ్డు,  కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.





రొయ్యల నూడుల్స్‌

కావలసినవి

టైగర్‌ రొయ్యలు - నాలుగు, రైస్‌ నూడుల్స్‌ - ఒక ప్యాకెట్‌, నూనె - సరిపడా, నిమ్మరసం - పావుకప్పు, ఎండుమిర్చి - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - సరిపడా, మిరియాలు - నాలుగైదు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, టూత్‌ పిక్స్‌ - నాలుగు(పొడవైనవి)

సాస్‌ కోసం : నిమ్మరసం - పావుకప్పు, ఫిష్‌ సాస్‌ - రెండు టీస్పూన్లు, వెల్లుల్లి - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, పంచదార - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ విధానం

  1. రొయ్యలను శుభ్రంగా కడిగి నిమ్మరసం, దంచిన ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి మారినేట్‌ చేసుకోవాలి.
  2. నూడుల్స్‌ను ఉడికించి పెట్టుకోవాలి.
  3. ఒక బౌల్‌లో ఫిష్‌సాస్‌ తీసుకుని అందులో నిమ్మరసం, దంచిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, పంచదార, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి సాస్‌ తయారుచేసి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు మారినేట్‌ చేసి పెట్టుకున్న రొయ్యలకు టూత్‌పిక్స్‌ గుచ్చాలి. 
  5. తరువాత వాటిచుట్టూ నూడుల్స్‌ చుట్టాలి. 
  6. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక డీప్‌ ఫ్రై చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.





వెజ్‌ పాడ్‌ థాయ్‌

కావలసినవి

రైస్‌ నూడుల్స్‌ - ఒక ప్యాకెట్‌.

సాస్‌ కోసం : పంచదార - మూడు టేబుల్‌స్పూన్‌, వెజిటబుల్‌ స్టాక్‌ - పావు కప్పు, సోయా సాస్‌ - మూడున్నర టేబుల్‌స్పూన్లు, చింతపండు గుజ్జు - రెండు టేబుల్‌స్పూన్లు, చిల్లీ సాస్‌ - ఒక టీస్పూన్‌, చిల్లీ ఫ్లేక్స్‌ - ఒక టీస్పూన్‌. 

ఫ్రై కోసం : నూనె - సరిపడా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఉల్లిపాయ - ఒకటి, టోఫు - అర కప్పు, బొక్‌ చొయ్‌  - నాలుగు ఆకులు(దీనికి బదులుగా క్యాబేజీ కూడా వాడుకోవచ్చు), మొలకెత్తిన గింజలు - రెండు కప్పులు, వేగించిన వేరుశనగలు - పావు కప్పు, కొత్తిమీర - గార్నిష్‌ కోసం కొద్దిగా, నిమ్మకాయ - ఒకటి.


తయారీ విధానం

  1. స్టవ్‌పై ఒక పాత్రపెట్టి నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో నూడుల్స్‌ వేయాలి. ఐదారు నిమిషాలు ఉడికిన తరువాత నూడుల్స్‌లో నుంచి నీళ్లు తీసేయాలి. తరువాత చల్లటి నీళ్లతో ఒకసారి కడిగి పక్కన పెట్టాలి. 
  2. ఒక బౌల్‌లో వెజిటబుల్‌ స్టాక్‌ తీసుకుని అందులో సోయాసాస్‌, పంచదార, చింతపండు గుజ్జు, చిల్లీసాస్‌, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలుపుకొని సాస్‌ రెడీ చేసుకోవాలి.
  3. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత బొక్‌ చొయ్‌ ఆకులు వేసి వేగించాలి.
  4. ఆకులు మెత్తగా ఉడికిన తరువాత టోఫు వేసి కలుపుకోవాలి. తరువాత నూడుల్స్‌ వేసి కలియబెట్టాలి. సాస్‌ వేసి అంతగా సమంగా కలిసేలా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. చిన్నమంటపై వేగనివ్వాలి.
  5. నూడుల్స్‌ బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. మొలకెత్తిన గింజలు, వేగించిన వేరుశనగలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. నిమ్మరసం పిండుకుని సర్వ్‌ చేసుకోవాలి.





సోబా నూడుల్స్‌

కావలసినవి

సోబా నూడుల్స్‌ - ఒక ప్యాకెట్‌(బక్వీట్‌తో తయారుచేసిన నూడుల్స్‌), సోయాసాస్‌ - పావు కప్పు, నువ్వుల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, వెనిగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, తేనె - ఒక టేబుల్‌స్పూన్‌, మిసో - ఒక టేబుల్‌స్పూన్‌(సోయాబీన్‌, బార్లీతో చేసిన చిక్కటి మిశ్రమం), వెల్లుల్లి - రెండు రెబ్బలు, ఉల్లిపాయ - ఒకటి, వేగించిన నువ్వులు - కొద్దిగా.

తయారీ విధానం

  1. ముందుగా నూడుల్స్‌ని ఉడికించుకోవాలి. తరువాత నీళ్లను తీసేసి చల్లటి నీటితో మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక బౌల్‌లో సోయా సాస్‌ తీసుకుని అందులో నువ్వుల నూనె, వెనిగర్‌, తెనే, మిసో, దంచిన వెల్లుల్లి రెబ్బలు  వేసి సాస్‌ రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలను గుండ్రంగా తరిగి పెట్టుకోవాలి.
  3. ఒక బౌల్‌లో నూడుల్స్‌ తీసుకుని సాస్‌లో ముంచుకుంటూ ప్లేట్‌లోకి మార్చుకోవాలి. నువ్వులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-09-18T06:07:27+05:30 IST