నోరూరించే వెదురు కొమ్ములు

ABN , First Publish Date - 2022-08-08T06:17:45+05:30 IST

లినాళ్లలో వెదురు కొమ్ములను ఆదివాసీలు మాత్రమే ఆహారంగా తీసుకునే వారు. కాలక్రమంగా అన్ని వర్గాల ప్రజలు వెదురు కొమ్ములను ఆహారంగా తీసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వెదురు కొమ్ముల కూర మంచి రుచిగా ఉంటుంది.

నోరూరించే వెదురు కొమ్ములు
లంబసింగి ఘాట్‌లో విక్రయిస్తున్న వెదురు కొమ్ములు

- ఆసక్తి చూపుతున్న వినియోగదారులు

- మెండైన పోషకాలు లభిస్తాయంటున్న శాస్త్రవేత్తలు


జిల్లాలో వర్షాకాలం ప్రారంభమైందంటే ఆదివాసీలు సంప్రదాయ ఆహారంగా వెదురు కొమ్ములను  తింటారు. ఈ సీజన్‌లో అడవిలోని వెదురు మొక్కల వద్ద అధికంగా పిలకలు(లేత వయస్సు కలిగిన వెదురు)వస్తాయి. ఈ లేత వెదురు పిలకలను సేకరించుకుని ఆదివాసీలు కూరగా చేసుకుని తినడం ఆనవాయితీ. 

చింతపల్లి, ఆగస్టు 7: తొలినాళ్లలో వెదురు కొమ్ములను ఆదివాసీలు మాత్రమే ఆహారంగా తీసుకునే వారు. కాలక్రమంగా అన్ని వర్గాల ప్రజలు వెదురు కొమ్ములను ఆహారంగా తీసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వెదురు కొమ్ముల కూర మంచి రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ కూర తిన్నవారు మరోసారి తినాల్సిందే. మైదాన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి గిరిజన ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చిన ఉద్యోగులకు సైతం వెదురుకొమ్ముల కూర ప్రియమైందిగా మారిపోయిందంటే అతిశయోక్తికాదు. వెదురు కొమ్ముల కూర తాజాగా స్టార్‌ హోటళ్లలోనూ లభిస్తుంది. చైనా, వియత్నం దేశాల్లోనూ వెదురు కొమ్ములను కూరగా, స్నాక్స్‌గా తీసుకుంటున్నారు. వెదురు కొమ్ములను ఆంగ్లంలో బేంబూ షూట్స్‌ అని పిలుస్తారు. 

ఎగబడి కొంటున్న వినియోగదారులు

వెదురు కొమ్ములు(బేంబూ షూట్స్‌)ను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం లంబసింగి ఘాట్‌లో ఆదివాసీలు వెదురు కొమ్ములను విక్రయిస్తున్నారు. ఒక వాటా(ఐదు కొమ్ములు) రూ.50 ధరకు విక్రయిస్తున్నారు. ఈ కొమ్ములను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు. లంబసింగి ఘాట్‌ వద్ద గిరిజనులు ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఒక్కొక్కరు ప్రతి రోజు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల కొమ్ములు విక్రయిస్తున్నామని చెబుతున్నారు. 


అత్యధిక పోషక విలువలు

వెదురు కొమ్ములు(బేంబూ షూట్స్‌) అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారం. ఉడికించిన వెదురు కొమ్ములు 155గ్రాముల నుంచి 64 కేలరీలు శక్తి, 2.5గ్రాముల ప్రొటీన్‌, 4.5 గ్రాములు ఫ్యాట్‌, 2గ్రాములు ఫైబర్‌, విటమిన్‌ బి6- 14 శాతం, ఈ- 9శాతం, కె- 3శాతం, రిబోఫ్లేవిన్‌ 3శాతం, థైమిన్‌ 3శాతం, ఫాస్ఫరస్‌ 3శాతం, పొటాషియం 3శాతం, ఐరన్‌ 3శాతం లభిస్తుంది. పోషకాహార లోపం, రక్తహీనత కలిగిన వారితోపాటు గర్భిణులు, బాలింతలకు ఇది మంచి ఆహారం. 

 - బి.దివ్య సుధ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, బీసీటీ-కేవీకే హరిపురం


Updated Date - 2022-08-08T06:17:45+05:30 IST