ఫ్లవర్‌ కాదు.. ఫైర్‌!

ABN , First Publish Date - 2022-03-11T06:47:36+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌ను బుల్డోజర్‌ దున్నేసింది! రికార్డులను బద్దలు కొడుతూ యోగి ఆదిత్యనాథ్‌

ఫ్లవర్‌ కాదు.. ఫైర్‌!

  • యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాల్లో కమలం విజయభేరి
  • పంజాబ్‌ను ఊడ్చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ;    కాంగ్రెస్‌..  నెగ్గేదేలే!
  • యోగి సుపరిపాలనకు జేజేలు.. కుల, మతాలకతీతంగా ఓట్లు
  • జాట్‌లు, రైతుల ఓట్లూ బీజేపీకే.. ముస్లిం నియోజకవర్గాల్లోనూ గెలుపు
  • ఎనిమిదేళ్లలో వరుసగా నాలుగోసారి 40 శాతానికి పైగా ఓట్లు
  • పంజాబ్‌లో ఆప్‌ నాలుగింట మూడొంతుల అద్భుత విజయం
  • మట్టి కరిచిన మహామహులు.. కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పార్టీలు ఖల్లాస్‌
  • స్వయంకృతాపరాధాలతో ఘోర పరాజయం పాలైన హస్తం
  • క్రైస్తవులు గణనీయంగా ఉన్న గోవా, మణిపూర్‌ల్లోనూ కమల వికాసం
  • మూడుసార్లు సీఎంలను మార్చినా ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీకే పట్టం
  • జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ శక్తిగా  ఆవిర్భవిస్తున్న కేజ్రీ 


ఉత్తర ప్రదేశ్‌ను బుల్డోజర్‌ దున్నేసింది! రికార్డులను బద్దలు కొడుతూ యోగి ఆదిత్యనాథ్‌ పార్టీని విజయ పథంలో నడిపారు! గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు కాస్త తగ్గినా.. అప్పటి కంటే ఎక్కువ ఓట్లను సాధించారు! యూపీ చరిత్రలో మూడున్నర దశాబ్దాల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నాయకుడిగా నిలిచారు! ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాల్లో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది! వరుసగా రెండుసార్లు గెలవరని పేరున్న యూపీ, ఉత్తరాఖండ్‌లను బీజేపీ వరుసగా రెండోసారి దక్కించుకోవడం విశేషం! క్రైస్తవులు గణనీయంగా ఉండే గోవా, మణిపూర్‌ల్లో కాషాయ జెండా ఎగిరింది! ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లోనూ కమలం పైచేయి సాధించింది! అన్ని వర్గాలూ అక్కున చేర్చుకున్న పార్టీగా బీజేపీ నిలిచింది! వెరసి, బీజేపీకి వారం రోజుల ముందే హోలీ వచ్చింది! ఐదు రాష్ట్రాల్లో నాలుగుచోట్ల కమలం మరింతగా విరబూసింది! మిగిలిన పంజాబ్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఊడ్చేసింది! దాంతో, ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’కు ఇక రెండు అడుగులే మిగిలింది! ఆ పార్టీ సొంతంగా రెండు రాష్ట్రాల్లో (రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌)నే అధికారంలో ఉండగా.. మరో మూడు రాష్ట్రాల్లో మాత్రం ఇతర పార్టీల ప్రభుత్వాల్లో ఒదిగిపోయింది!


కాలికి బలపం కట్టుకుని తిరిగినా యూపీలో రాహుల్‌, ప్రియాంక ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు! కేవలం రెండంటే రెండు సీట్లకే పరిమితయ్యారు! దాంతో, బీజేపీని ఢీకొనే శక్తి కాంగ్రె్‌సకు లేదని ఈ ఎన్నికలతో మరోసారి సంపూర్ణంగా రూఢీ అయిపోయింది! కాంగ్రె్‌సతో కూడిన ఫ్రంట్‌కు కాలదోషం పట్టినట్లయింది! సమీప భవిష్యత్తులో ఫెడరల్‌ ఫ్రంట్‌ రూపుదిద్దుకోలేని పరిస్థితిని ఈ ఎన్నికలు కల్పించాయి! యూపీ ఎన్నికల ఫలితాలపై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు! అక్కడ బీజేపీ ఓడిపోతే.. ఆ తర్వాత తిప్పడానికి చక్రాలు రెడీ చేసుకున్నారు! కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి!


సుపరిపాలనకు మంచి మార్కులు

‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అని పిలుపు ఇచ్చిన వేళా విశేషం ఏమిటో కానీ.. అక్కడక్కడా ఎదురు దెబ్బలు తగిలినా.. బీజేపీ గెలుపు బాటలో పయనిస్తూనే ఉంది. ఢిల్లీకి దగ్గరి దారిగా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్‌లో మరోసారి పాగా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. యూపీలో యోగి ఐదేళ్ల పాలనకు మంచి మార్కులే దక్కాయి. కులాల కుంపట్ల కంటే సుపరిపాలనకే అక్కడి ప్రజలు ఓటేశారు. లంచంగా ఇచ్చే తాయిలాల కంటే లక్షణమైన అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట వేశారు. రౌడీలు, గూండాల చెర నుంచి విముక్తి కల్పించిన యోగికి మరోసారి పట్టం కట్టారు. ట్రిపుల్‌ తలాక్‌కు చరమగీతం పాడిన పార్టీనే ముస్లిం మహిళలు నెత్తిన పెట్టుకున్నారు! వారణసీ అద్భుత నిర్మాణానికి; అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణానికి మురిసి హిందువులు మరోసారి దీవించారు!


వెరసి, 403 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 254 సీట్లలో ఘన విజయం సాధించింది! గత ఎన్నికల (312 సీట్లు) కంటే 58 సీట్లు తగ్గినా.. మొదటి నుంచీ సంపూర్ణ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ఇక, బీజేపీ బుల్డోజర్‌ ధాటికి ఏనుగు ముందే పక్కకు తప్పుకోగా.. సైకిల్‌ ఎదురు నిలవలేకపోయింది. గత ఎన్నికల్లో కేవలం 47 సీట్లు సాధించిన సమాజ్‌వాదీ.. ఈసారి 105 సీట్లను సాధించినా అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. అఖిలేశ్‌కు కంచుకోటలైన ముస్లిం నియోజకవర్గాల్లోనూ బీజేపీ పాగా వేసింది. గతంతో పోలిస్తే ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. ఓబీసీలు బీజేపీకి దూరమనే వాదన పటాపంచలైంది. గత ఎనిమిదేళ్లలో ఏకంగా నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ 40 శాతానికిపైగా ఓట్లను సాధించడమే ఇందుకు నిదర్శనం. ఇంకా చెప్పాలంటే, ఎస్పీ, బీఎస్పీలు ఘన విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పుడు కూడా వాటికి వచ్చిన ఓట్ల శాతం 30 శాతం దాటకపోవడం విశేషం.


హిందువులు, ముస్లిములు, ఓబీసీలు, దళితులు బీజేపీకి అండగా నిలవడమే 40 శాతానికిపైగా ఓట్ల శాతానికి కారణమని విశ్లేషకులు వివరిస్తున్నారు. యూపీలో ఘన విజయంతో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రాంతీయ పార్టీలపై పెద్దగా ఆధారపడనక్కర్లేదు! లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లే! తాజా విజయంతో యోగికి జాతీయ స్థాయిలో మాస్‌ ఇమేజ్‌ వచ్చిందని, మోదీ తర్వాత బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రధాని అభ్యర్థిగా ఆయన నిలిచే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.


పంజాబ్‌ను ఊడ్చేసింది..

పంజాబ్‌లో మకిలి రాజకీయాలను చీపురు ఊడ్చేసింది. ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ తీరుతో విసిగిపోయిన పంజాబ్‌ను ప్రజల మనసులను ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. పంజాబ్‌ అసెంబ్లీలో 117 సీట్లు ఉంటే.. ఆప్‌ ఏకంగా 92 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. నిజానికి, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌దే ఆధిపత్యం. తొలిసారిగా ఆ రెండింటినీ మట్టి కరిపించి ఆప్‌ అధికారం దక్కించుకుంది. ‘ఢిల్లీ మోడల్‌’ను దగ్గరగా చూసిన పంజాబ్‌ ప్రజలు ఆప్‌ను అక్కున చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించకుండా తప్పులో కాలేసిన కేజ్రీవాల్‌.. ఈసారి దానిని సరిదిద్దుకున్నారు. ప్రజల్లో మంచి పలుకుబడి కలిగిన భగవంత్‌ సింగ్‌ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.


పార్టీని విజయ పథంలో నడిపి..

ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చినా.. దేవభూమి ప్రజలు బీజేపీని నెత్తిన పెట్టుకున్నారు. 70 సీట్ల ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో 47 స్థానాలను కమలానికి కట్టబెట్టారు. విచిత్రంగా, ఇక్కడ రెండు ప్రధాన పార్టీల సీఎం అభ్యర్థులూ ఓటమి పాలయ్యారు. పార్టీకి అద్భుత విజయాన్ని అందించినా.. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ మాత్రం ఓటమి పాలయ్యారు! దీంతో, అక్కడ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఇక, పార్టీ నేతలు సహకరించడం లేదని, తనకు విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తోందన్న కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి హరీశ్‌ రావత్‌కు ఓటర్లు విశ్రాంతిని ఇచ్చారు.


ఇక, సంపూర్ణ మెజారిటీ సాధించి మణిపూర్‌ను బీజేపీ తొలిసారిగా చేజిక్కించుకుంది! గత ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మెజారిటీ వచ్చింది. కానీ, ఆపరేషన్‌ ఆకర్ష్‌ కారణంగా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా కమలం పార్టీలో చేరారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. అలాగే, గోవాలో అధికారానికి ఒక్క సీటు దూరంలో నిలిచినా.. అక్కడ బీజేపీ సర్కారు ఏర్పాటు లాంఛనమే! గోవాలో కూడా బీజేపీ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది.


భస్మాసుర హస్తం

తన చేతిని తన నెత్తిపైనే పెట్టుకుని సర్వ నాశనం కావడం ఎలా!? గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోనూ ఓడిపోవడం ఎలా!? ఈ విషయాలను కాంగ్రె్‌సను చూసి నేర్చుకోవాలి! పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ల్లో పార్టీ ఓటమి ఇందుకు నిదర్శనం. పంజాబ్‌లో అమరీందర్‌ నాయకత్వంలో ప్రభుత్వం బలంగా ఉన్నట్లు కనిపించింది. అప్పట్లో ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతులూ ఆయనకే మద్దతు పలికారు. సరిగ్గా, అదే సమయంలో సిద్ధూను ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. సీఎం అమరీందర్‌తో ఆయన గొడవ పడినప్పుడు పార్టీ పట్టించుకోలేదు. డీజీపీలను, ఏజీలను మార్చాలని డిమాండ్‌ చేసినా చూసీ చూడనట్టు వదిలేసింది. చివరకు, అమరీందర్‌నే మార్చేసింది. దాంతో, ఆయన కొత్త కుంపటి పెట్టుకుని బీజేపీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత, ముఖ్యమంత్రిగా చన్నీని నియమిస్తే సిద్ధూ ఆయననూ వదలలేదు. ఘర్షణ కొనసాగించారు.


అయినా, రాహుల్‌, ప్రియాంకలు దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఫలితం.. పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 117 సీట్ల అసెంబ్లీలో ఆ పార్టీ కేవలం 18 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇటు సిద్ధూ, అటు సీఎం చన్నీతోపాటు మాజీ సీఎం అమరీందర్‌ను కూడా ఓటర్లు ఛీకొట్టారంటే అక్కడ కాంగ్రె్‌సపై వారి ఏవగింపును అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఐదేళ్లలో మూడుసార్లు ముఖ్యమంత్రిని మార్చిన ఉత్తరాఖండ్‌లోనూ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోలేకపోవడం కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మక తప్పిదమే.




కొత్త తార.. కేజ్రీవాల్‌!

అప్రతిహతంగా దూసుకుపోతున్న మోదీ పాలనకు తిరుగులేదా!? బీజేపీని అడ్డుకునే పార్టీ లేదా కూటమి ఇప్పట్లో ఆవిర్భవించే అవకాశం లేదా!? ఈ ప్రశ్నలకు జవాబుగా.. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న నాయకులు ఇద్దరే.. వారు మమతా బెనర్జీ! అరవింద్‌ కేజ్రీవాల్‌! నిన్న మొన్నటి వరకూ ఢిల్లీకే పరిమితమైన ఆప్‌.. ఇప్పుడు పంజాబ్‌లోనూ పాగా వేసింది. గోవాలో రెండు సీట్లను సాధించింది. రాబోయే రోజుల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లను దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ‘ఢిల్లీ మోడల్‌’తోపాటు కేజ్రీవాల్‌ పాజిటివ్‌ పాలిటిక్స్‌ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.


కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో కుదేలైన నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా పోటీ ఇచ్చే పార్టీ లేదా కూటమి కనిపించడం లేదు. ఆ శూన్యాన్ని భర్తీ చేసే దిశగా ఆప్‌ అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర ముఖ్యమంత్రులను కలుపుకొని ఫ్రంట్‌ దిశగా మమత అడుగులు వేస్తున్నా.. ఆమె కంటే కేజ్రీవాల్‌కే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం అభివృద్ధి, సంక్షేమం మంత్రంగా ఢిల్లీలో అయినా పంజాబ్‌లో అయినా ఆప్‌ అధికారంలోకి రావడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు.




Updated Date - 2022-03-11T06:47:36+05:30 IST