మిథ్య కాదు, అదే సత్యం

ABN , First Publish Date - 2020-12-24T06:07:23+05:30 IST

కాషాయ వేషంలో ఉండి ఆ మాట అన్నాడు కాబట్టి, వేదాంతం మాట్లాడుతున్నాడని కొందరు అనుకున్నారు, మరి కొందరు ఆయన్ను...

మిథ్య కాదు, అదే సత్యం

ఆశ్చర్యం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా లేకుండా పోయింది. రెండు ప్రాంతీయ పార్టీలు, ఒక జాతీయ పార్టీ. బిజెపిని తీవ్రంగా ఎదిరించకపోవడానికి ఎవరి లెక్కలు వారికి, ఎవరి భయాలు వారికి ఉన్నాయి. జాతీయపార్టీ మాత్రం ఇద్దరినీ కడిగేస్తుంది. తెలంగాణలో అదే లక్ష్యం కోసం అధికారపార్టీ పనిచేసి, కోరి మరీ బిజెపిని ప్రత్యర్థిని చేసుకున్నది. గట్టిగా ఎదిరించలేరు, ఉద్యమాలు నిర్మించలేరు. కేంద్రం చేతిలో చాలా ఆయుధాలున్నాయి. వారి మనసులో ఎన్నో వ్యూహాలున్నాయి. మరి, తెలుగు వారి మూడు ప్రాంతీయపార్టీలకు భవిష్యత్తు ఏమిటి?


దృఢమైన కేంద్రాన్ని నిర్మించే పనిని మొదట ఇందిరాగాంధీ చేశారు. జనాకర్షణ, రాజ్యాంగ వ్యవస్థలను అనుకూలంగా మలచుకోగల నేర్పు, సాహసం- ఈ మూడు ఆమెను నియంతను కూడా చేశాయి. ఇప్పుడు ఉక్కు కేంద్రాన్ని నిర్మించే పనిలో నరేంద్రమోదీ ఉన్నారు. ఆయనకు కూడా అపారమైన జనాకర్షణ, వ్యవస్థలను దారికితెచ్చుకునే చాకచక్యం, సాహసం ఉన్నాయి. ఈ మూడిటితో పాటు, ఆయనకు ప్రజల సమ్మతి ఉన్నది. 


కాషాయ వేషంలో ఉండి ఆ మాట అన్నాడు కాబట్టి, వేదాంతం మాట్లాడుతున్నాడని కొందరు అనుకున్నారు, మరి కొందరు ఆయన్ను బాగానే వెటకరించారు. కానీ, అది చిన్న మాట కాదు, అర్థం లేనిదీ కాదు, వేదాంతమూ తర్కమూ అసలే కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు ‘కేంద్రం మిథ్య’ అనడం ఆనాటి ప్రాంతీయ ఆకాంక్షల రాజకీయాలకు తగిన ప్రకటన. దేశమంతా తానే అని చెప్పుకోవచ్చును కానీ, కేంద్రప్రభుత్వానికి తనకు మాత్రమే చెందిన భూభాగం అంటూ లేదు. వ్యవసాయం దగ్గర నుంచి వైద్యం దాకా, ప్రజలకు చేరాలంటే తనకంటూ ఒక సొంత యంత్రాంగం లేదు. రాష్ట్రాలు అన్నీ కలిస్తేనే దేశమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా కేంద్రం ఏమీ చేయలేదు. అయినప్పటికీ, తన నైరూప్యమైన ఉనికి నుంచే, తన దగ్గర ఉన్న కీలకమయిన కొన్ని విభాగాల కారణంగానే- కేంద్రం బలశాలిగా పరిణమించింది. తనను తానొక మహాశక్తిగా, అంతర్భాగాలన్నిటినీ అవశిష్టంగా మార్చేయగల అధికార కేంద్రంగా మలచుకుంది. ఒక మహాబిలం వలె, ఆవరణంలోని అన్నిటినీ తనలో లయం చేసుకుని, కేంద్రం తానే మిగలాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.


భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు, స్థానిక పాలనాసంస్థలు కూడా ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాల రంగాలకు వేర్వేరు జాబితాలున్నాయి. కొన్ని అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి అనేక అంశాలలో ఉన్నది కానీ, కేంద్రచట్టాలను రాష్ట్రాలు తలదాల్చవలసిందే. ఉచితమనుకున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేయగలదు. రాష్ట్రాల స్వేచ్ఛ, తల మీద వేలాడే కత్తికి లోబడి ఉంటుంది. అమెరికా లాగా మన దేశంలోనూ అధ్యక్ష పాలనావ్యవస్థ కావాలని కొందరికి కోరికగా ఉంది కానీ, ఆ దేశంలో రాష్ట్రాలు, దాదాపు స్వతంత్ర దేశాలంత ప్రతిపత్తి కలిగినవి. అధ్యక్షుడి అధికారాలు కూడా చట్టసభల అనుమతులకు లోబడే ఉంటాయి. అన్నిటికి అమెరికాను ఆదర్శంగా చెప్పేవారు, అక్కడ ఆంతరంగిక పాలనా వ్యవస్థలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, వికేంద్రీకరణను మాత్రం స్వీకరించాలని అనుకోరు. ఎందుకంటే, ఇక్కడ, పైకి ఒప్పుకోరు కానీ, సాధ్యమైనంత అధికార కేంద్రీకరణ కావాలి. జనాదేశంతో సంపాదించిన అధికారంతో ఆ జనాన్నే అదుపులో పెట్టాలి. బలమైన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థ అందించిన విచక్షణాయుత అపరిమిత అధికారాన్ని యథేచ్ఛగా వినియోగించగలదు. అపారమైన వనరులున్న చోట పెద్దగా ప్రజాచైతన్యం లేకపోవడం, ఆ ప్రాంతాల ప్రజాప్రతినిధులకు జాతీయస్థాయిలో చెలామణి లేకపోవడం, విద్యాసాంస్కృతిక రంగాలలో ముందంజలో ఉన్న ప్రాంతాలు జనసంఖ్య రీత్యా చిన్నవి కావడం- వంటి అనేక అంశాలు, జాతీయ స్థాయిలో అంతర్గత దోపిడికి ఆస్కారం కలిగిస్తాయి. విదేశీ కార్పొరేట్లను కూడా సంతృప్తిపరచవలసి వస్తే, అది కూడా సాధ్యపడుతుంది. భారత్ వంటి విశాల దేశంలో ఉన్న రకరకాల అసమానతలు, సరిసమానమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రతినిధులను చట్టసభలకు పంపడానికి అవరోధం అవుతాయి. నోరున్న, బలమున్న శ్రేణులు అధికారాన్ని గుప్పిట పట్టుకుని, మరింత మరింత కేంద్రీకృత అధికారం కోసం తపిస్తుంటాయి, నిర్నిరోధంగా సమస్త వనరుల మీదా హక్కు కోసం. 


విదేశాంగం, రక్షణ, కమ్యూనికేషన్లు వంటి కొన్ని అంశాలు మినహా, తక్కిన అన్ని విషయాల్లోనూ రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయోద్యమకాలంలో వాదించింది. అధికారంలోకి రాగానే, ఆ నాటి ఏకపార్టీ సానుకూలతను ఆసరా చేసుకుని దేశంలో పాలనా, రాజకీయ అధికారాలను కూడా కేంద్రీకరణకు గురిచేసింది. ద్రవిడ ఉద్యమం, అకాలీ ఉద్యమం ఆ తరువాత తెలుగుదేశం అవతరణ, అస్సాం ఉద్యమం.. ఇటువంటివన్నీ కాంగ్రెస్ చేతిలో దుర్భేద్యంగా తయారైన కేంద్రాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించినవే. ఆ సమయంలో, భారతీయ జనతాపార్టీ, దాని పూర్వ రూపాలు కూడా ఫెడరలిజం గురించి చాలా మాట్లాడాయి. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే, తమ ప్రభుత్వం ఏ తీరున వ్యవహరించబోతున్నదో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరించారు. 2014 జూన్ 11వ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన, తాము రాష్ట్రాల విషయంలో సహకార సమాఖ్య పద్ధతిలో నడుచుకుంటామని చెప్పారు. కానీ, ఆ వెంటనే, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు నడుమ పక్షపాతం చూపించడం మాత్రమే కాకుండా, మొత్తంగా రాష్ట్రాల శక్తినే తగ్గించివేసే చర్యలు మొదలుపెట్టారు. అన్నిటిని అజమాయిషీ చేసే కేంద్రీకృత అధికార పీఠంగా ఢిల్లీని తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. నవభారత నిర్మాణం వంటి అమూర్తమైన ఆధునిక ఆదర్శాలేవో నెహ్రూకు ఎక్కువగాను, ఆయన కుమార్తెకు కొద్దిగాను ఉండేవి కానీ, వారికి బలమైన జాతి నిర్మాణం అన్న ప్రత్యేక ఎజెండా ఏదీ లేదు. ప్రస్తుత నరేంద్రమోదీ ప్రభుత్వానికి, ఆయన పార్టీకి బలశాలి అయిన జాతీయవాద జాతిని నిర్మించే లక్ష్యం ఉన్నది. దేశాన్నంతా కలిపే రహదారులు, నదుల అనుసంధానం, ఒకే దేశం ఒకే పన్ను, ఒకే ప్రవేశపరీక్ష, వ్యవసాయం ఉమ్మడి జాబితా అయినా, రాష్ట్రాల మీద ఏకపక్షంగా రుద్దిన మూడు వివాదాస్పద చట్టాలు, ఇప్పుడు నెమ్మదిగా చర్చలోకి తెస్తున్న జమిలి ఎన్నికలు- ఇవన్నీ మనుషులను వారనుకున్న పద్ధతిలో ఒకే కోవలోకి తెచ్చేందుకు తీసుకుంటున్న పాలనాచర్యలు. ఒకే దేశం, ఒకే ప్రజ- అన్న తరువాత, ఇంకేమేమి ఒకే విశేషణంతో వస్తాయో ఊహించుకోవచ్చు. 


దృఢమైన కేంద్రాన్ని నిర్మించే పనిని మొదట ఇందిరాగాంధీ చేశారు. జనాకర్షణ, రాజ్యాంగ వ్యవస్థలను అనుకూలంగా మలచుకోగల నేర్పు, సాహసం- ఈ మూడు ఆమెను నియంతను కూడా చేశాయి. నవ భారత ఆశాభంగాల కాలమది. ప్రజలు ప్రశ్నించారు, ఆమె అధికారంతో అణచివేశారు. ఇప్పుడు ఉక్కు కేంద్రాన్ని నిర్మించే పనిలో నరేంద్రమోదీ ఉన్నారు. ఆయనకు కూడా అపారమైన జనాకర్షణ, వ్యవస్థలను దారికితెచ్చుకునే చాకచక్యం, సాహసం ఉన్నాయి. ఈ మూడిటితో పాటు, ఆయనకు ప్రజల సమ్మతి ఉన్నది. సమ్మతిని నిర్మించుకునే సాధనాలపై పట్టు ఉన్నది. తనను ఎవరూ నియంత అనరు. ఎన్ని ఆశాభంగాలు ఉన్నా, ప్రజలు పెద్దగా ప్రశ్నించరు. కేంద్రం చేతిలోనే ఉన్న అనేకానేక సంస్థల ద్వారా ఆయన చతుర్విధోపాయాలను ఉపయోగించి, ప్రజల అసమ్మతిని నియంత్రిస్తుంటారు. 


డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కూడా బలమైన కేంద్రం కావాలని కోరుకున్నారు. కానీ, ఆయన వాదన వేరు. రాష్ట్రాలలో ప్రాంతీయ పాలకులు, అట్టడుగు వర్గాలకు, మైనారిటీలకు వ్యతిరేకులుగా ఉంటారని, వారిని అదుపులో పెట్టడానికి కేంద్రానికి సర్వాధికారాలుండాలని ఆయన భావించారు. ఆర్టికల్ మూడు ద్వారా కేంద్రం కొత్త రాష్ట్రాలను ఏర్పరచే అధికారాన్ని ఇవ్వడం కూడా, ఒక రాష్ట్రంలో అల్పసంఖ్యలో ఉన్న జనశ్రేణి ఆకాంక్షలు నెరవేరాలంటే, కేంద్రం జోక్యం ఒక అవకాశమని ఆయన భావించారు. కానీ, కాంగ్రెస్, బిజెపి ఆలోచన వేరు. బలమైన కేంద్రం అని నేరుగా అనకుండా, దేశ సమగ్రత, ఐక్యత అన్న నినాదాన్ని ఇందిరాగాంధీ ఇచ్చారు. అత్యవసర పరిస్థితిలో డిఎంకె ప్రభుత్వాన్ని రద్దుచేయడం, అకాలీ ఉద్యమాన్ని అణచడం, ఎన్టీయార్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం, ఫరూఖ్ అబ్దుల్లాను తొలగించడం- ఇవన్నీ ఇందిర హయాంలో ప్రాంతీయ అధికారాన్ని, ఆకాంక్షలను అణచడానికి తీసుకున్న చర్యలే. ఇందిర, రాజీవ్ తరువాత- సంకీర్ణ ప్రభుత్వాల కాలమే వచ్చి, ప్రాంతీయ శక్తుల ఆసరాతో కేంద్రం నడవవలసి వచ్చింది. వాజపేయి ప్రధానిగా ఉండిన మొదటి ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా అనేక అనుసంధాన ప్రాజెక్టులను ముందుకు తెచ్చింది. రాజ్యాంగాన్ని సమీక్షించడం అనే ఆలోచన కూడా ఆ కాలంలో వచ్చింది. ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆసరాతో తన బలాన్ని విస్తరించుకుంటూ వచ్చిన బిజెపి, రెండో ఎన్‌డిఎ కాలం నాటికి ఏకైక బలశాలిగా రూపొందింది. అనేక ఆలోచనలను ఆచరణలోకి తెచ్చింది. ఇప్పుడు ఏ రా‌‌‌‌ష్ట్రంలో ఏ ఎన్నిక, ఏ ఉప ఎన్నిక జరిగినా భారతీయ జనతాపార్టీ కేంద్రం చేసిన మేళ్లను ఏకరువు పెడుతున్నది. కేంద్రాన్ని ఒక మూర్త అస్తిత్వంగా వాళ్లు తీర్చిదిద్దుతున్నారు. 


తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతీయ ఉద్యమమైనా దాన్ని సమర్థించడంలో భారతీయ జనతాపార్టీ ఆలోచన వేరే. చిన్నచిన్న రాష్ట్రాలు బలమైన కేంద్రానికి దారితీస్తాయని ఆ పార్టీ అవగాహన. అందుకు అనుగుణంగానే మొదటి ఎన్‌డిఎ ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పరచింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పుడు, ఏ పార్టీ పాలనలో ఉన్నప్పటికీ, బలహీనమయిన రాజకీయ శ్రేణులతో, అపారమయిన గని నిక్షేపాలతో కేంద్రానికి అందుబాటులోకి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి నిజమే కానీ, రెంటికీ ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాలు రావడం, వాటి విషయంలో రెండూ ఐక్యతతో వ్యవహరించడం మునుముందు ఎప్పుడైనా జరుగుతుందేమో తెలియదు. కానీ, రెండు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకోవడానికి మాత్రం భారతీయ జనతాపార్టీకి విభజన కొంత దోహదపడుతున్నది. చిన్న రాష్ట్రం మైనారిటీలకు చేటు చేస్తుంది అని అసదుద్దీన్ ఒవైసీ నాడు చేసిన వాదనలో హేతువు లేకపోలేదు. 


ఆశ్చర్యం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా లేకుండా పోయింది. రెండు ప్రాంతీయ పార్టీలు, ఒక జాతీయ పార్టీ. బిజెపిని తీవ్రంగా ఎదిరించకపోవడానికి ఎవరి లెక్కలు వారికి, ఎవరి భయాలు వారికి ఉన్నాయి. జాతీయపార్టీ మాత్రం ఇద్దరినీ కడిగేస్తుంది. తెలంగాణలో అదే లక్ష్యం కోసం అధికారపార్టీ పనిచేసి, కోరి మరీ బిజెపిని ప్రత్యర్థిని చేసుకున్నది. గట్టిగా ఎదిరించలేరు, ఉద్యమాలు నిర్మించలేరు. కేంద్రం చేతిలో చాలా ఆయుధాలున్నాయి. వారి మనసులో ఎన్నో వ్యూహాలున్నాయి. మరి, తెలుగు వారి మూడు ప్రాంతీయపార్టీలకు భవిష్యత్తు ఏమిటి? 


కె. శ్రీనివాస్

Updated Date - 2020-12-24T06:07:23+05:30 IST