Covid 19 Crisis: అప్పు అడగలేకపోతున్నారా..? సులభంగా డబ్బు పొందే నాలుగు మార్గాలివే..!

ABN , First Publish Date - 2021-04-30T21:01:08+05:30 IST

ఎక్కడా అప్పు పుట్టక, అడిగేందుకు మనసురాక, ఎవరినీ చేయి చాచి డబ్బులు అడగలేక ఎంతో మంది మనోవేదనకు గురవుతున్నారు. కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

Covid 19 Crisis: అప్పు అడగలేకపోతున్నారా..? సులభంగా డబ్బు పొందే నాలుగు మార్గాలివే..!

అసలే కరోనా కాలం. ఏ ఇంట చూసినా నెల నెలా వచ్చిన జీతం మంచినీళ్లల్లా ఖర్చయిపోతోంది. నెల తిరిగే సరికి కుటుంబం గడవడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, మంచి పోషకాహారం కోసం ఖర్చు చేయడం, మెడిసిన్స్, ట్రావెల్ ఖర్చులు, పెరిగిన నిత్యావసరాల ధరలు, ఇలా ఒకటేమిటి అన్నింటితోనూ సామాన్యుడు యుద్ధం చేస్తున్నాడు. ఓ వైపు కరోనాతోనూ, మరో వైపు పెరిగిన ధరలతోనూ సతమతమవుతున్నాడు. ఈ సమయంలో ఏదైనా అత్యవసరం వస్తే డబ్బులు ఎలా? అన్న ప్రశ్నే అందరినీ వేధిస్తుంటుంది. అప్పులు అడుగుదామన్నా అందరి ఇళ్లల్లోనూ ఇదే సమస్య. ఎక్కడా అప్పు పుట్టక, అడిగేందుకు మనసురాక, ఎవరినీ చేయి చాచి డబ్బులు అడగలేక ఎంతో మంది మనోవేదనకు గురవుతున్నారు. కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పులు చేయకుండా డబ్బులను సులభంగా పొందేందుకు నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. 


1. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేయండి:

ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేటు ఉద్యోగి అయినా ప్రొవిడెంట్ ఫండ్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉంటుంది. వాస్తవానికి ఈ ఖాతా నుంచి డబ్బులను విత్ డ్రా చేసే అవసరం చాలా మందికి రాదు. ఒక వేళ డబ్బు అవసరం వచ్చినా బ్యాంకుల్లో లోన్స్ తీసుకుని తీర్చుతుంటారు కానీ, పీఎఫ్ జోలికి ఎవరూ వెళ్లరు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తే, అది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని చాలా మంది పీఎఫ్ ను ముట్టుకోరు. కానీ ఆ కరోనా కాలంలో కనుక డబ్బు అత్యవసరం అయితే పీఎఫ్ డబ్బుల్లోంచి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేయడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు కదా అని హితవు పలుకుతున్నారు. ఎవరినీ అప్పులు అడిగే పరిస్థితి కనుక లేకుంటే పీఎఫ్ ఖాతాలోంచి డబ్బులను తీసుకోవడం అత్యుత్తమ మార్గమని చెబుతున్నారు. 


2. ఎఫ్‌డీ విత్ డ్రా:

భవిష్యత్ అవసరాలపై దూరదృష్టి కలిగిన చాలా మంది బ్యాంకుల్లో కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. అయిదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ద్వారా అధిక లాభాలను చూరగొంటుంటారు. ఈ లోపు మాత్రం వాటిని తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచన చేయరు. కానీ ఈ కరోనా కాలంలో మెడికల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసరాల నిమిత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసుకోవచ్చునని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ముందుగానే విత్ డ్రా చేసుకున్నందుకు గానూ బ్యాంకులు 0.5 నుంచి ఒక శాతం చార్జీలను వసూలు చేస్తాయనీ, అయినప్పటికీ చేతికి వచ్చే డబ్బుతో ఈ విపత్కర పరిస్థితుల్లో బేఫికర్ గా ఉండొచ్చని చెబుతున్నారు. 


3. సేవింగ్స్ ఖాతా నుంచి విత్ డ్రా:

చాలా మంది మధ్య తరగతి జీవులు వ్యక్తిగత అవసరాలకు సేవింగ్స్ ఖాతాను ఒకటి వాడుతూ ఉంటారు. రోజువారీ అవసరాలకు ఓ ఖాతాను వాడుతూనే, ఆర్థిక భరోసా కోసం మరో ఖాతాను పెట్టుకుంటారు. డబ్బు చేతిలో ఉన్నప్పుడల్లా కొంత మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాలోకి మళ్లిస్తారు. మరీ అత్యవసరం అయితే తప్ప ఆ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బును ముట్టుకోరు. పిల్లల ఉన్నత విద్యాభ్యాసాలు, పెళ్లిళ్లు వంటి అవసరాలు వస్తే తప్ప ఆ ఖాతాను ముట్టుకోరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు కనుక చేతిలో లేకుంటే, సేవింగ్స్ ఖాతాలోంచి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. దాంట్లోంచి విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు కూడా చేయవు కనుక, ఈ పరిస్థితుల్లో సేవింగ్స్ ఖాతాను వాడుకోవడం మేలని చెబుతున్నారు. 


4. మ్యూచువల్ ఫండ్స్ అమ్మకాలు:

ఈ కరోనా కాలంలో అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్‌ యూనిట్లను అమ్మడం కూడా ఓ ఆప్షన్ గా పెట్టుకోవచ్చునని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించొద్దని నిపుణులు సలహా ఇస్తుంటారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అన్ని ఇళ్లల్లోనూ ఆర్థిక అవసరాలే ఉంటున్నాయి. అప్పులు కూడా దొరకడం లేదు. కాబట్టి వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఈ మార్గాన్ని వాడకోక తప్పదని చెబుతున్నారు. 

Updated Date - 2021-04-30T21:01:08+05:30 IST