బాలినేనే కాదు.. నేనూ ఇబ్బంది పడుతున్నా!

ABN , First Publish Date - 2022-06-29T08:06:37+05:30 IST

బాలినేనే కాదు.. నేనూ ఇబ్బంది పడుతున్నా!

బాలినేనే కాదు.. నేనూ ఇబ్బంది పడుతున్నా!

నా నియోజకవర్గంలోనూ సొంత పార్టీ ఎమ్మెల్యేల జోక్యం

నన్ను బలహీనపరిచే యత్నాలు

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి ధ్వజం


నెల్లూరు (జడ్పీ) జూన్‌ 27: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డే కాదు.. తాను కూడా సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గంలో తనను బలహీనపరిచేందుకు తమ పార్టీకే చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో కొంత మంది నేతల తీరు సరిగా లేదని.. ఇది పార్టీకి శ్రేయస్కరం కాదని అన్నారు. కోటంరెడ్డి మంగళవారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో కొంత మంది ప్రముఖులు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని నేతలు తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని ఆక్షేపించారు. వారు సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధిని గాలికి వదిలేసి తన సెగ్మెంటులో జోక్యం చేసుకోవడం పార్టీకి కూడా శ్రేయస్కరం కాదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వీర విధేయుడిగా ఉన్న బాలినేని కాంగ్రె్‌సలో మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్‌కు అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాగే 22 నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్‌గా, మూడు జిల్లాలకు ఇన్‌చార్జిగా ఉన్న బాలినేని ఆత్మస్థైర్యం తగ్గేలా ఎవరు వ్యవహరించినా సరికాదని చెప్పారు. సొంత పార్టీ నేతలే ఇతర పార్టీల వారితో కలిసి కుట్ర చేస్తున్నారన్న ఆయన ఆవేదనపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తనను బద్ధశత్రువుగా చూస్తానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ అన్నారని.. తాను మాత్రం ఆయన్ను రాజకీయ శత్రువుగా, ప్రత్యర్థి అభ్యర్థిగా, పోటీదారుగా చూడనన్నారు.

Updated Date - 2022-06-29T08:06:37+05:30 IST