
సర్కారు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం తీరు
తినలేక అవస్థలు పడుతున్న విద్యార్థులు
అమలుకాని మెనూ.. కానరాని మార్గదర్శకాలు
నిర్వాహకులతో హెచ్ఎంల కుమ్మక్కు
తనిఖీలే మరచిన విద్యాశాఖాధికారులు
నీరుగారుతున్న పథకం లక్ష్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం
పథకం అమలు అత్యంత అధ్వానంగా మారింది. వంట చేయడంలో, వడ్డించడంలో ఎలాంటి
ప్రమాణాలను పాటించడం లేదు. భోజనం నాసిరకంగా ఉంటోంది. మెనూను ఏ మాత్రం
పాటించడం లేదు. ఉడికీ ఉడకని అన్నం విద్యార్థులు తినలేకపోతున్నారు. దానికి
తోడు నీళ్లచారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది.
విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం
విమర్శలకు తావిస్తోంది. అధికారుల అలసత్వం, ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం,
నిర్వాహకుల లాలూచీ వల్ల క్షేత్రస్థాయిలో పథకం నీరుగారిపోతోంది.
హనుమకొండ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పేదవిద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం మానివేయకూడదనే ఉద్దేశంతో పాఠశాలల్లో ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్యను, హాజరయ్యే వారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమభావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద అన్ని పనిదినాలలో విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టాలి. ఈ విధానం గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎప్పటినుంచో అమలులో ఉండగా 2001 నవంబర్ 28న సుప్రీం కోర్టు ధర్మాసనం మార్గదర్శనం నేపథ్యంలో ఇతర అన్ని రాష్ట్రాల్లో అమలులోకి వచ్చింది.
నాసిరకం
మధ్మాహ్న భోజనంలో ఆహారం నాణ్యంగా ఉండటం లేదనే విమర్శలున్నాయి. పేరుకే సాంబారు తప్ప అందు లో చారు నీళ్లు తప్ప మరేమి ఉండడం లేదు. ఇదేంటని అడిగితే వంట వండే వాళ్లు మమ్మల్ని తిడుతున్నారని విద్యార్థులు బోరు మంటున్నారు. దీనికితోడు పెరిగిన కూరగాయల ధరలతో మెనూను పాటించడం కష్టంగా ఉందని సిబ్బంది చెబుతున్నారు. తక్కువ ధరలున్న కూరగాయలు తెచ్చి వంట చేస్తున్నారు. సాంబారులో కూరగాయ ముక్కలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో సాంబారు, గుడ్డుతో భోజనం పెట్టాల్సి ఉండగా కిచిడి, పచ్చి పులుసుతో సరిపెడుతున్నారు.
నిధులు స్వాహా
మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాథమిక పాఠశాల విద్యార్ధికి రూ.4.13 పైసలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.6.18 చొప్పున ప్రభు త్వం నిధులు విడుదల చేస్తోంది. అలాగే విద్యార్థికి వారానికి మూడు కోడి గుడ్లు పెట్టాలి. ఒక్కో గుడ్డుకు రూ.4చొప్పున నిధులు ఇస్తోంది. కానీ కొన్నిచోట్ల గుడ్లకు బదులు అరటి పండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వారానికి మూడు రోజులు ఇవ్వాల్సిన గుడ్డ్డును వారంలో ఒక్క రోజు కూడా ఇవ్వడం లేదు. సన్నరకం బియ్యం అయినప్పటికీ అన్నం మెత్తగా కావడంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. కొంతమంది ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కుమ్మక్కై భోజనం చేయని విద్యార్థుల డబ్బులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మండల విద్యాధికారులు కనీసం పాఠశాలలను నెలకొకసారి తనిఖీ చేయాల్సి ఉన్నా ఎక్కడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.
వంట గదుల కొరత
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండడానికి నిర్వాహకులకు ఇబ్బందిగా మారుతోంది. వంట గదుల కొరత, కొన్ని పాఠశాలల్లో వంట గదులు ఇరుకుగా ఉండడంతో ఆరుబయటే వంట చేయాల్సి వ స్తోంది. గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో కట్టెల పొయ్యి మీదనే వండుతున్నారు. దీంతో పాఠశాల మొత్తం పొగ వ్యాపిస్తోంది. తాగేందుకు, వంటకు శుద్ధి నీరు లేకపోవడంతో నల్లా, బోరు నీరే వినియోగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న వంట గదులను పూర్తి చేయాలని, పెరిగిన చార్జీలకు అనుగుణంగా ధరలు పెంచాలని మధ్యాహ్న ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.
మెనూ ఇలా..
మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం మెనూ నిర్ణయించింది. సోమవారం అన్నంతో పాటు గుడ్డు, సాంబారు, మంగళవారం కూరగాయలు, బుధవారం పప్పు, ఆకుకూరలు, గురువారం గుడ్డు, సాంబారు, శుక్రవారం గుడ్డు, కూరగాయలు, శనివారం పప్పు, ఆకుకూరలు వడ్డించాలి. విద్యార్థులకు ఒక రోజు ఆహార పరిమాణం ఎలా ఉండాలో కూడా నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బియ్యం 100 గ్రాములు, పప్పులు 20 గ్రాములు, కూరగాయలు 50 గ్రాములు, నూనె 5 గ్రాముల చొప్పున ఉండాలి. సాంబారులో పప్పు 10 గ్రాములు, కూరగాయలు 25 గ్రాముల చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఒక రోజు ఆహార పరిమాణం బియ్యం 150 గ్రాములు, పప్పులు 30 గ్రాములు, కూరగాయలు 75 గ్రాములు, నూనె 7.5 గ్రాములు చొప్పున ఉండాలి. సాంబారులో పప్పు 35 గ్రాములు, కూరగాయలు 35 గ్రాముల చొప్పున ఉండాలి.
పాఠశాలలు - విద్యార్థులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న ప్రభుత్వ జిల్లా పరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలలు మొత్తం 3,707 ఉన్నాయి. వీటిలో 3,75,578 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 878 పాఠశాలలు ఉండగా, వీటిలో 1,41,430 విద్యార్థులు చదువుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో 1,025 పాఠశాలలు ఉండగా, 1,26,049 మంది విద్యార్థులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 428 పాఠశాలలు ఉండగా, వీటిలో 16,519 మంది విద్యార్థులు, జనగామ జిల్లాలో 508 పాఠశాలలు ఉండగా, 36వేల మంది విద్యార్థులు, ములుగు జిల్లాలో 248 పాఠశాలలు ఉండగా, 17,580 మంది విద్యార్థులు, మహబూబాబాద్ జిల్లాలో 620 పాఠశాలలు ఉండగా 38,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.