Facebook: అంతర్గత సర్వేలో వెలుగులోకి షాకింగ్ విషయాలు!

ABN , First Publish Date - 2022-07-22T03:01:27+05:30 IST

సోషల్ మీడియా అనగానే ఠక్కున గుర్తొచ్చే ఫేస్‌బుక్‌ (Facebook)కు గతేడాది చివరి త్రైమాసికంలో తొలిసారి

Facebook: అంతర్గత సర్వేలో వెలుగులోకి షాకింగ్ విషయాలు!

న్యూఢిల్లీ: సోషల్ మీడియా అనగానే ఠక్కున గుర్తొచ్చే ఫేస్‌బుక్‌ (Facebook)కు గతేడాది చివరి త్రైమాసికంలో తొలిసారి భారత్‌లో ఎదురుదెబ్బ తగిలింది.  తమ యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గినట్టు ప్రకటించింది. యూజర్ల సంఖ్య పెరగమే కానీ తగ్గడం తెలియని ఫేస్‌బుక్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బగానే భావించారు. ఎందుకిలా తగ్గారన్న దానిపై కారణం కూడా చెప్పింది. దేశంలో మొబైల్ డేటా (Mobile Data) రేట్లు పెరగడమే అందుకు కారణమని పేర్కొంది. అయితే, అసలు నిజం అదికాదని, అదే రోజున వెల్లడైన ఫేస్‌బుక్ రహస్య సర్వే నివేదిక బయటపెట్టింది.


ఫేస్‌బుక్ అంతర్గతంగా రెండేళ్లపాటు నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం..  ఫేస్‌బుక్ యాక్టివ్ యూజర్లు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి.  ఫేస్‌బుక్‌లో పురుషాధిక్యత ఎక్కువైపోతోందని, ఫలితంగా తమ గోప్యతకు భంగం వాటిల్లుతోందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా వారు ఫేస్‌బుక్‌కు దూరం జరుగుతున్నారు. ఫేస్‌బుక్‌లో న్యూడిటీ మరీ మితిమీరిపోతోందని, వారానికోసారైనా తమ వాల్‌పై అశ్లీల చిత్రాలు కనిపిస్తున్నాయని చాలామంది మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. దాదాపు 20-30 శాతం మంది మహిళలు ఇలాంటి ఫిర్యాదు చేశారు.


అలాగే, ఫేస్‌బుక్ ఉపయోగించే పురుషుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో లింగ అసమానత స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా నివేదిక పేర్కొంది. ఈ సందర్భంగా కొందరు మహిళలు పంచుకున్న అభిప్రాయాలను కూడా ఆ నివేదికలో పేర్కొంది. ముఖం కనిపించకుండా ఫొటో అప్‌లోడ్ చేసిన ఓ మహిళకు లెక్కకు మించిన ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చాయి. అంతేకాదు, ముఖం కనిపించకున్నా ‘చాలా అందంగా ఉన్నావని’, ‘ఎక్కడుంటావని’ కామెంట్లు వచ్చాయని ఆమె పేర్కొన్నట్టు నివేదిక వెల్లడించింది. ఇలాంటి కారణాలన్నీ ఫేస్‌బుక్‌కు మహిళలు దూరం జరిగేలా చేస్తున్నాయని పేర్కొంది. 


అంతేకాదు, 2020లో భారత్‌లో ప్రవేశపెట్టిన ప్రొఫైల్ లాక్ ఆప్షన్‌ను ఏకంగా 34 శాతం మంది మహిళలు ఉపయోగించుకోవడం వారి అభద్రతకు అద్దంపడుతోందని తెలిపింది. ఇవే కాదు.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో నెగటివ్ కంటెంట్ విస్తృతగా ప్రచారం అవుతున్నట్టు కూడా నివేదిక వివరించింది.

Updated Date - 2022-07-22T03:01:27+05:30 IST