అర్హులకు కాదు.. అనుచరులకే!

ABN , First Publish Date - 2022-07-07T05:20:16+05:30 IST

ఇళ్లు లేని పేదలకు ఇవ్వాల్సిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఘట్‌కేసర్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కొంతమంది ప్రజాప్రతినిధులు వారి అనుచరులు, బంధువులకు ఇప్పించుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పేదలు డిమాండ్‌ చేస్తున్నారు.

అర్హులకు కాదు.. అనుచరులకే!

  • టీఆర్‌ఎస్‌ నాయకులు,  ప్రజాప్రతినిధుల అనుయాయులకే డబులు బెడ్‌రూం ఇళ్లు
  • కౌన్సిలర్ల ఆగ్రహం.. కేటాయింపులన్నీ రద్దు చేసి
  • అందరి సంమక్షంలోనే డ్రా తీయాలని డిమాండ్‌
  • ఇళ్లు లేని పేదలను విస్మరించారని ఆరోపణలు


ఇళ్లు లేని పేదలకు ఇవ్వాల్సిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఘట్‌కేసర్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కొంతమంది ప్రజాప్రతినిధులు వారి అనుచరులు, బంధువులకు ఇప్పించుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పేదలు డిమాండ్‌ చేస్తున్నారు.


ఘట్‌కేసర్‌, జూలై 6: ఇళ్లులేని నిరుపేదలకు ఇవ్వాల్సిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఘట్‌కేసర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కొంతమంది ప్రజాప్రతినిధులు వారి అనుచరులు,  బంధువులకు ఇప్పించుకున్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధి మైసమ్మగుట్ట కాలనీ వద్ద 50 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఘట్‌కేసర్‌, బాలాజీనగర్‌, ఎన్‌ఎ్‌ఫసీనగర్‌, కొండాపూర్‌, చందుపట్లగూడ, బొక్కోనిగూడల్లో వందలాది మంది ఇళ్లు లేని నిరుపేదలున్నారు. గతంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పలుమార్లు విచారణ చేసి చివరకు 377 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ ఎవరికీ చెప్పకుండా కొద్దిరోజుల క్రితం కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధ్దిదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీతో పాటు బోడుప్పల్‌, పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్లలో డబుల్‌ ఇళ్ల డ్రాను మంత్రి మల్లారెడ్డి తీశారు. సాధారణంగా అర్హత కల్గిన వారందరీ  ముందు డ్రా తీయకుండా కీసరలో తీయడం పట్ల పలువు రు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పొందిన వారి జాబితాను మున్సిపల్‌ కార్యాలయంలో బోర్డుపై పెట్టారు. ఇళ్లు పొందిన వారి జాబితాలో పేర్లన్నీ టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, స్నేహితులవే ఉన్నాయి. సొంత వారికే కేటాయించారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల డ్రా తీసే విషయం స్థానిక కౌన్సిలర్లుకు సమాచారం అయినా ఇవ్వకుండా గోప్యత పాటించారు. దీంతో ఈ తతంగంపై కొందరు ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు, ఆర్డీవోకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఘట్‌కేసర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, తక్షణమే కేటాయింపులను రద్దు చేయాలని కొందరు కౌన్సిలర్లు డిమాండ్‌ చేస్తున్నారు.


  • టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు రాజీనామా అస్త్రం

బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పాలకవర్గ సభ్యు లు వారి అనుచరులకే ఇప్పించుకున్నారని బో డుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి కలతచెందారు. ఇక తాను ఇన్నాళ్లూ ఆశపడ్డ పేదప్రజలకు ఏం సమాధానం చెప్పాలని తన పదవికి రాజీనా మా చేస్తున్నట్లు ప్రకటించాడు. వెంటనే అమాత్యుడు కలుగజేసుకొని ఇళ్ల కేటాయింపులు రద్దు చేసి, అర్హుల పేర్లతో తిరిగి డ్రా తీసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగినట్లు నాయకులన్నారు. 


  •  ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరగాలి

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో  అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన 11 మంది అనుచరులు, స్నేహితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పించారని, పేదలకు తీరని అన్యాయం చేశారని టీఆర్‌ఎస్‌ నాయకులే ఆరోపిస్తున్నా రు. అమాత్యుడి అండదండలతో ఓ ప్రజాప్రతినిధి తనకు కావలసిన నలుగురికీ ఇళ్లు కేటాయించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకులు ఇళ్లు ఇప్పించిన వారిలో ఎక్కువ మందికి ఇప్పటికే ఇళ్లు,  భూములు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల నుంచి పేదలను ఎంపిక చేసి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించక పోతే భవిష్యత్తులో ప్రజల దగ్గరికి వెళ్లి పార్టీకి ఓటు వేయాలని ఎలా అడుగుతామని స్థానిక నాయకులు అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లన్నీ కొందరు నాయకులు వారి అనుచరులకే ఇప్పించుకుంటే తాము ఏం ముఖం పెట్టుకొని జనంలో తిరగాలని వాపోతున్నారు. ఇకనైన అధికారులు స్పందిం చి కేటాయింపులన్నీ రద్దుచేసి ఘట్‌కేసర్‌ త హసీల్దార్‌ కార్యాలయం వద్దే అర్హుల సమక్షం లో డ్రా తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


  • సొంత ఇల్లు లేదు : తత్తరి శశికళ, ఎన్‌ఎ్‌ఫసీ నగర్‌

ఇంటిపెద్ద మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నా. నెలానెలా అద్దె చెల్లించలేక అవస్థలు పడుతున్నా. కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నా. కొన్నేళ్లుగా డబుల్‌బెడ్‌రూం ఇంటికోసం ఎదురు చూస్తున్నాను. నాకు సొంత ఇల్లు లేదు. అధికారులు విచారణ చేసి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయించాలి.


  • అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నాం : ఆవుల అలివేలు, కూలీ, గాంధీనగర్‌, ఘట్‌కేసర్‌

నాలుగు సంవత్సరాలుగా నాయకుల చుట్టూ తిరుగుతున్నా. గత 30ఏళ్లుగా మేం అద్దె ఇళ్లల్లోనే ఉంటూ కాలం గడుపుతున్నాం. నాయకులు ఎన్నికల ముందు ఇళ్లు ఇస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు.  దరఖాస్తు చేసుకున్నా ఇల్లు మాత్రం ఇప్పించడం లేదు.


  • అధికారులు వచ్చి విచారించారు : మంద సలోమి, కూలీ, బాలాజీనగర్‌, ఘట్‌కేసర్‌

డబుల్‌ బెడ్‌రూం ఇంటి కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా. అధికారులు వచ్చి విచారణ చేశారు. మీకు తప్పకుండా ఇల్లు వస్తుందని చెప్పారు. ఇప్పుడేమో ఇళ్లున్న వారికే మల్లా ఇల్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇల్లు కేటాయించి మాకు న్యాయం చేయాలి.


  • ఇళ్లులేని పేదలకు  ఇవ్వాలి : మీసాల సుధాకర్‌రావు, పంచాయతీ మాజీ సభ్యుడు 

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగుట్ట వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పేదలకే కేటాయించాలి. ఇటీవల తీసిన డ్రాలో అనర్హులకు ఇళ్ల కేటాయింపులు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై విచారణ జరిపి తహసీల్దార్‌ కార్యాలయం వద్దే డ్రా తీసి ఇల్లులేని అర్హులకు మాత్రమే కేటాయించాలి.  


  • అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలి : విజయలక్ష్మి, తహసీల్దార్‌ , ఘట్‌కేసర్‌ 

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులపై ఏమైనా అభ్యంతరాలుంటే ప్రజలు లిఖితపూర్వకంగా కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో  ఫిర్యాదు  చేయాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే డ్రా తీసి లబ్ధ్దిదారులను ఎంపిక చేశాం. ఇప్పటి వరకు ఒక కౌన్సిలర్‌ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

Updated Date - 2022-07-07T05:20:16+05:30 IST