మిస్సింగ్‌ కాదు హత్యే!

ABN , First Publish Date - 2022-08-09T06:33:54+05:30 IST

నలబై నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ శవమై తేలింది. ఆమెను తెలిసిన వారే హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు.

మిస్సింగ్‌ కాదు హత్యే!
మృతదేహాన్ని వెలికితీయిస్తున్న పోలీసులు

మహిళ మృతదేహం వెలికితీత

అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 పరిశీలించిన తహసీల్దారు, పోలీసులు

త్రిపురాంతకం, ఆగస్టు 8: నలబై నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ శవమై తేలింది. ఆమెను తెలిసిన వారే హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు సోమవారం మండలంలోని డీవీఎన్‌ కాలనీకి సమీపంలోని ముడివేముల మేజరు పక్కన మహిళ మృతదేహాన్ని గుర్తించి వేలికితీశారు. గ్రామస్థుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పొన్న అంకమ్మ(55) నలబైనాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటుందని చుట్టుపక్కల వారు అనుకున్నారు. కొద్దిరోజులైనా ఇంటికి రాకపోవడంతో అనుమానంతో త్రిపురాంతకం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో గతనెల 11న మిస్సింగ్‌ కేసు నమోదైంది. పోలీసులు తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌కాల్స్‌ ఆధారంగా వారిపై అనుమానంతో విచారించారు. ఈ నేపథ్యంలో అనుమానితులే అంకమ్మను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో సోమవారం తహసీల్దారు సమక్షంలో మృతదేహాన్ని పూడ్చిన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, వెలికి తీయించారు. అప్పటికే చీకటిపడటంతో మంగళవారం పోసుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా మృతురాలి దగ్గర రూ.లక్ష విలువైన బంగారంతోపాటు రూ.లక్ష నగదు ఉందని సమాచారం. వాటి కోసమే చంపినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. పూర్తివివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామని సీఐ ఎం. రాంబాబు తెలిపారు.

Updated Date - 2022-08-09T06:33:54+05:30 IST