అమ్మగానే కాదు... డాక్టర్‌గానూ జాగ్రత్తలు చెబుతా

May 9 2021 @ 01:20AM

అమ్మ చిన్నప్పుడు చూపించిన దోవ కలకాలం ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు.. ఎవరికి ఏ సబ్జెక్ట్‌ ఇష్టమో కనిపెట్టి వారిని ఆ దోవలో చేయిపట్టి నడిపించే తల్లులు ఎందరో. అలాంటి వారిలో ఒకరు డాక్టర్‌ జయంతి రెడ్డి. ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తల్లి. మదర్స్‌డే సందర్భంగా జయంతి, నాగ్‌ అశ్విన్‌ తమ అనుభవాలను చిత్రజ్యోతితో పంచుకున్నారు...


‘‘నాగి చిన్నప్పుడు చాలా హ్యాపీ చైల్డ్‌. పుస్తకాలంటే చాలా ఇష్టముండేది. ఇక మా అమ్మాయి నిఖిలకు డ్యాన్స్‌ ఇష్టం. దానికి అది నేర్పించా. ఒకవైపు డాక్టర్‌గా ఎప్పుడూ బిజీగా ఉంటూ - పిల్లలను, కుటుంబాన్ని చూసుకోగలిగానంటే మా అమ్మకి కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఆసుపత్రిలో బిజీగా ఉన్నప్పుడు కుటుంబాన్ని తను చూసుకొనేది. అయితే పిల్లలు చదువుకొనేటప్పుడు నేను ఉండాల్సిందే! నాగికి చిన్నప్పుడు కర్పూర వసంతరాయలు అనే నాన్‌డిటేయిల్‌ ఉండేది. మొత్తం నేను చదివి వినిపిస్తే వాడు విన్నాడు. పరీక్ష రాసేశాడు. మా అమ్మాయి నిఖిల ఎంబీబీఎస్‌ చదివేటప్పుడు కూడా నేను తనతో పాటు చదివేదాన్ని. నాకు ఇంకా జ్ఞాపకం. ఒకరోజు వచ్చి - ‘ఫిజియాలజీ’ చదవాలమ్మా! అంది. నేను తనతో కూర్చుని ఫిజియాలజీ చదివా. చాలా మంది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. కంబైన్డ్‌ స్టడీస్‌ చేసినప్పుడు పిల్లల మధ్య స్నేహం పెరుగుతుంది. అదే విధంగా పిల్లలు - తల్లిదండ్రులు కంబైన్డ్‌ స్టడీస్‌ చేస్తే వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. బంధం గట్టిపడుతుంది. అయితే ఇవన్నీ కలిపి చదవటం దాకా మాత్రమే. వాళ్లకు వచ్చే మార్కులు వారివే! నాగి ఎనిమిదో క్లాస్‌లో ఉన్నప్పుడనుకుంటా... ‘ఒరేయ్‌ ఇక నుంచి నీ మార్కులు నీవేరా. నాకు సంబంధం ఏమీ లేదు’ అని చెప్పేశా. దీనివల్ల వారికి తాము సొంతంగా చదువుకోవాలనే ఆలోచన కలుగుతుంది. అదే సమయంలో మనకు అవసరం వస్తే అమ్మ అందుబాటులో ఉందనే ధైర్యం కూడా ఉంటుంది. ఇప్పటికీ నాగి, నిఖిల రోజూ నాతో మాట్లాడుతూనే ఉంటారు. వారు ఎక్కడికైనా వెళ్తుంటే అమ్మగానే కాదు, డాక్టర్‌గా కూడా జాగ్రత్తలు చెబుతూనే ఉంటా. నిఖిల నాకు వీడియో కాల్‌ చేసినప్పుడు మాస్క్‌ లేదనుకోండి... వెంటనే పెట్టుకోమంటా! ‘పెట్టుకుంటామమ్మా! మేము చిన్నపిల్లలమా!’ అంటుంది. అయినా చెబుతాను. పిల్లలు ఏదైనా సాధించినప్పుడు - వారికన్నా వాళ్ల అమ్మలకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఈమధ్య నిఖిల కాల్‌ చేసి - ‘అమ్మా... నా పేషెంట్‌కు అమ్మాయి పుట్టింది. వాళ్లు నా పేరు పెట్టుకున్నారట. వచ్చి చెప్పారు’ అంది. అప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. చివరిగా ఓ డాక్టర్‌గా నేనొక మాట చెప్పాలి. ప్రస్తుతం కొవిడ్‌-19 చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఉదాహరణకు ఒక లక్ష మందికి కొవిడ్‌ వచ్చిందనుకుందాం. వీరి ద్వారా మరో మూడు లక్షల మందికి వస్తుంది. మొదట వచ్చిన లక్ష మందికి పూర్తిగా తగ్గటానికి 14 రోజులు పడుతుందనుకుందాం. ఆ తర్వాత వచ్చిన మూడు లక్షల మందికి తగ్గటానికి మరో 14 రోజులు పడుతుంది. వీరు మరో 9 లక్షల మందికి వ్యాపింపచేస్తారు. ఈ సైకిల్‌ను బ్రేక్‌ చేయకపోతే రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అందువల్ల అందరూ వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికీ చాలా మందికి కొవిడ్‌కు సంబంధించిన అవగాహన లేదు. ఆక్సిమీటర్‌ లాంటివి కూడా అందుబాటులో ఉంచుకోవటం లేదు. ముందు అందరూ కొవిడ్‌కు సంబంధించిన అవగాహన పెంచుకోవాలి. అవసరమైతే తప్ప బయటకు రాకండి. కొవిడ్‌ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మదర్స్‌ డే సందర్భంగా మీ తల్లులకు మీరు ఇచ్చే బహుమతి ఇదే... స్టే హోమ్‌ - స్టే సేఫ్‌.’’

డాక్టర్‌ జయంతి రెడ్డి

ఇప్పుడు తల్లులకు ఇచ్చే బహుమతి అదే

‘‘చిన్నప్పటి నుంచి అమ్మ చాలా బిజీ డాక్టర్‌. అయినా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో శ్రద్ధ చూపించేది. అక్క నిఖిలకు, నాకు ఏం కావాలో అమ్మకు బాగా తెలుసు. అందుకే తనను ఎంబీబీఎస్‌లో చేర్చింది. నాకు చిన్నప్పటి నుంచి చారిత్రకమైన అంశాలు, జాగ్రఫి, ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన ఎన్‌సైక్లోపీడియా పుస్తకాలు వంటివి ఇచ్చేది. నేను పుస్తకాలు చదవటానికి కారణం మా అమ్మే! పరీక్షల సమయంలో నాతో పాటు రాత్రిళ్లు కూర్చునేది. చిన్నప్పుడు మాపై ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలా విషయాలు అమ్మ నేరుగా మాకు చెప్పేది కాదు. ఆమె ప్రవర్తన చూసి మేమే నేర్చుకొనేవాళ్లం. ఉదాహరణకు అమ్మకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. కథక్‌ నేర్చుకుంది. గాంధీజీ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ సమయంలో రవీంద్రభారతిలో ప్రోగ్రామ్‌ కూడా ఇచ్చింది. ఒక విషయం పట్ల ఎంతో అభిరుచి, అనురక్తి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఇది తప్పనిసరిగా అందరూ చూసి నేర్చుకోవాల్సిన విషయమే! ఇక అమ్మతో నాకున్న ఆనందకరమైన జ్ఞాపకాలంటే- మేము వెళ్లిన వెకేషన్లే! అమ్మ డాక్టర్‌ కాబట్టి కాన్ఫరెన్స్‌లకు వెళ్లాల్సి వచ్చేది. అమ్మతో పాటుగా మేము కూడా కాన్ఫరెన్స్‌లకు వెళ్లేవాళ్లం. అలా అనేక ప్రాంతాలు తిరిగేవాళ్లం. అక్కడ మేము చూసినవి... నేర్చుకున్నవీ ఎన్నో! ఇప్పటికీ నేను షూటింగ్‌కు వెళ్తుంటే ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది. ‘ఎంత మందితో వెళ్తున్నావు? డబుల్‌ మాస్క్‌ పెట్టుకున్నావా? లేదా?’ ఇలాంటి ప్రశ్నలెన్నో వేస్తుంది. కొవిడ్‌ మనల్ని కమ్మేస్తోంది. అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకండి. స్టే హోమ్‌ - స్టే సేఫ్‌! తల్లులందరికీ మనమిచ్చే మదర్స్‌ డే బహుమతి అదే!’’

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.