కడుపు నింపని కష్టం

ABN , First Publish Date - 2021-11-12T06:41:42+05:30 IST

వారి ఆకలి కేకలు ఎవరికీ పట్టవు.

కడుపు నింపని కష్టం

జీజీహెచ్‌లో సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బంది ఆకలి కేకలు 

మూడు నెలలుగా వేతనాలు చెల్లించని కాంట్రాక్టు సంస్థ

బిల్లులు విడుదల కావడం లేదంటున్న సంస్థ ప్రతినిధులు 

గట్టిగా అడిగితే ఉద్యోగం పోతుందేమోనని సిబ్బంది భయం


వారి ఆకలి కేకలు ఎవరికీ పట్టవు. రెక్కలు అరిగేలా పనులు చేసే విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని పారిశుధ్య సిబ్బంది ఆకలి వారి చేతిలోని చీపురుకు మాత్రమే తెలుసు. భద్రత లేని ఉద్యోగాలు వారివి.. వేతనం ఇవ్వాలని గట్టిగా అడిగితే ఉద్యోగమే పోతుందనే భయం. మూడు నెలలుగా వేతనాలు లేక, అర్ధాకలితో రోజులు నెట్టుకొస్తున్న ఆసుపత్రిలోని పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది గోడు వినే నాథుడే లేడు. జీతాలు ఇవ్వాలని అడిగితే బిల్లులు రాలేదంటారు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు. బిల్లులు ఎప్పుడొస్తాయని అడిగితే తెలియదని చెబుతారు అధికారులు. ఒప్పందం ప్రకారం బిల్లులతో నిమిత్తం లేకుండా నెలనెలా సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థదే అయినా, ఆ నిబంధనను పాటించరు. అధికారులు అదేమని ప్రశ్నించరు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఆకలి కేకలు ఆగడం లేదు. ఆసుపత్రిలోని సెక్యూరిటీ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా ఇంటి అద్దెల బకాయిలు పెరిగిపోతున్నాయని, అప్పులు ఇచ్చేవారు కూడా మానివేయడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిపోయిందని, రెండు పూటలా భోజనం చేయలేక, అర్ధాకలితో కాలం నెట్టుకొస్తున్నామంటూ సిబ్బంది వాపోతున్నారు. 


అడిగితే బెదిరింపులు 

 ఉద్యోగ భద్రతలేని కొలువులు కావడంతో జీతాలు చెల్లించాలంటూ గట్టిగా నిలదీద్దామంటే.. ఎక్కడ ఉద్యోగంలో నుంచి తీసేస్తారోనన్న భయం. దీంతో బాధను పంటి బిగువున ఆపుకుని, అర్ధాకలితోనే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నామని వాపోతున్నారు సిబ్బంది. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు, ఆసుపత్రి అధికారులకు తమ కష్టాలను మొర పెట్టుకుంటున్నా ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదనే ఒకే ఒక్క జవాబు వస్తోందని, జీతాలు లేకుండా ఎంత కాలం పనిచేయగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా అని గట్టిగా అడిగితే ‘బిల్లులు వస్తేగానీ చెల్లించలేం.. అప్పటి వరకూ ఉండగలిగితే ఉండండి.. ఉండలేమనుకుంటే వెళ్లిపోండి..’ అంటూ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ‘ఇచ్చే అరకొర జీతాలను కూడా నెలల తరబడి చెల్లించకపోతే మా కుటుంబాలు ఎలా బతకాలి?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌ కొత్త ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆయనకు కూడా తమ గోడును వినిపించామని, జీతాలు చెల్లించేలా కాంట్రాక్టు సంస్థతో చర్చిస్తానని హామీ ఇచ్చినా, ఇంత వరకు పని జరగలేదని పలువురు కార్మికులు చెప్పారు. 


ప్రైవేటు చేతిలో పారిశుధ్యం

 ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు అనుబంధంగా దాదాపు 1500 పడకలతో జిల్లా ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న విజయవాడ కొత్త, పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్‌ నిర్వహణ బాధ్యతలను టెండరు ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థకు ప్రతి నెలా రూ. కోట్లలో నిధులు చెల్లిస్తున్నారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన టెండర్‌ ప్రక్రియలో ఎజైల్‌ సంస్థ జీజీహెచ్‌లో శానిటేషన్‌, సెక్యూరిటీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ సంస్థ ప్రతినిధులు ఇంతకుముందు ఇదే కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలో పనిచేసిన సిబ్బందినే నియమించుకుని, పని చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక్కొక్కరికి నెలకు రూ.16 వేల చొప్పున వేతనాలు చెల్లించాలి. సిబ్బంది పీఎఫ్‌, ఈఎస్‌ఐలను కాంట్రాక్టు సంస్థే చెల్లించాలి. ఆసుపత్రిలోని పడకల సంఖ్యకు అనుగుణంగా నిబంధనల ప్రకారం మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. కానీ కాంట్రాక్టు సంస్థ ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. 


వేతనంలోనూ కోతే

 ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బందికి ఒక్కక్కరికి నెలకు రూ. 16 వేల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉండగా, రూ.10 వేలు కూడా చెల్లించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఎజైల్‌ సెక్యూరిటీస్‌ సంస్థ గత జూన్‌లో ఆసుపత్రిలో శానిటేషన్‌, సెక్యూరిటీ బాధ్యతలు చేపట్టింది. మొదటి నెల జీతాలు చెల్లించిన ఆ సంస్థ రెండో నెలలోనే జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది మూకుమ్మడిగా పనులు బహిష్కరించి ఆందోళనకు దిగడంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు వారితో చర్చలు జరిపి రెండో నెల జీతం చెల్లించారు. ఆ తర్వాత నుంచి సిబ్బందికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం వల్లే జీతాలు చెల్లించడం లేదని బిల్లులు వచ్చిన తర్వాత మొత్తం చెల్లిస్తామని, అప్పటివరకు పనిచేయగలిగేవారు చేయాలని, చేయలేకుంటే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోవాలంటూ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు దిగుతున్నారని, దీంతో జీతాలు లేకుండానే పని చేస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. తమ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ పని చేయిస్తున్నారని, పనిగంటలు కూడా పాటించకుండా డబుల్‌ డ్యూటీలు చేయిస్తున్నారంటూ వాపోతున్నారు. 


పట్టించుకోని ఆసుపత్రి అధికారులు

 కరోనా కష్టకాలంలో కూడా వేతనాలు ఇవ్వకపోయినా, ప్రాణాలకు తెగించి సేవలందించామని, అప్పుడు కూడా పాత కాంట్రాక్టరు మూడు నెలలు జీతాలు ఇవ్వకుండా వెళ్లిపోయారని తెలిపారు. కాంట్రాక్టు సంస్థ నిబంధనల మేరకు పనులు చేయిస్తుందా? లేదా? అనేది ఆసుపత్రి ఇంప్లిమెంటేషన్‌ కమిటీ పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. ఆ కమిటీ సభ్యులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా జోక్యం చేసుకుని తమకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 


ఒకపూట గంజి తాగి.. రెండో పూట పస్తులుంటున్నాం

ఇంతకాలం బయట అప్పులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ వచ్చాం. ఇక అప్పులిచ్చేవారు కూడా ఆపేసి.. ఇంతవరకు ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. అద్దె చెల్లించలేదని ఇంటి యజమానులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇంకెక్కడా అప్పులు పుట్టని పరిస్థితుల్లో పిల్లాపాపల సహా అందరం ఒకపూట గంజి తాగి.. రెండోపూట పస్తులుంటూ కాలం గడుపుతున్నాం. జీతాల కోసం గట్టిగా నిలదీస్తే కాంట్రాక్టర్లు ఉద్యోగాల్లోనుంచి తీసేస్తారన్న భయంతో మా బాధలను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. ఇలా ఎంతకాలం బతకగలం?’  - పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ పారిశుధ్య కార్మికురాలు 

Updated Date - 2021-11-12T06:41:42+05:30 IST