రైతులు కాదు, నేతలే నకిలీ!

ABN , First Publish Date - 2022-10-01T07:23:01+05:30 IST

అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పరిపాలన చేతకాని వానికి ప్రజలు పట్టం కట్టారు.

రైతులు కాదు, నేతలే నకిలీ!

అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పరిపాలన చేతకాని వానికి ప్రజలు పట్టం కట్టారు. పిచ్చోడి చేతిలో రాయి అన్న చందాన తయారైపోయింది ప్రభుత్వ వైఖరి. ఒక్కో మంత్రి ఒక్కో స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు. నిజమైన రైతులు ఇలా ఉండరు అన్నారొక సంక్షేమ మంత్రి. రైతుల్లో కూడా నిజమైన వారు నకిలీ వాళ్లుంటారా? అసలు రాజకీయ నాయకుల కంటే నకిలీలు ఇంకెవరైనా ఉంటారా? అమరావతి రాజధాని కోసం భూములు సేకరించినపుడు మీ నోరు పెగల్లేదెందుకు? తల్లికి కూడు బెట్టలేని వాడు పిన్నికి సారె పెడతానన్నాడట. మొదలెట్టిన రాజధానిని అభివృద్ధి చేయలేనివాళ్లు మూడు రాజధానుల్ని అభివృద్ధి చేస్తారా? జిల్లాల పునర్విభజన పెద్ద మూర్ఖత్వపు చర్య. ఉభయగోదావరి జిల్లాలను పిచ్చిపిచ్చిగా విభజించారు. రాష్ట్రానికి రాజధాని లేదని మొత్తుకుంటుంటే ఈ జిల్లాల విభజనమేటి? ఒక్క మంత్రికి కూడా స్వయంప్రతిపత్తి లేదు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోంది. కొత్త పరిశ్రమలు తేవడం, ప్రజలకు ఉపాధి కల్పించడం గురించి ఆలోచించకుండా మూడు రాజధానులు, ముప్పై జిల్లాలు ఏమిటి? పోలవరాన్ని కూడా మూడు ముక్కలు చేస్తారా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోయారు. విశాఖను దోచుకుందామని రాజధాని అక్కడ పెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నారన్న విషయం ప్రజలు గ్రహించారు. భేషజాలు మాని, అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తే బాగుంటుంది.

– బి.ఎ.ఎస్‌. ప్రసాద్‌, చాగల్లు

Updated Date - 2022-10-01T07:23:01+05:30 IST