అడవి కాదు.. కాలువ

ABN , First Publish Date - 2022-06-25T06:44:49+05:30 IST

ఖరీఫ్‌ సీజన ప్రారంభమైంది. తుంగభద్ర జలాశయం నుంచి మరికొద్ది రోజుల్లో సాగు, తాగునీరు జిల్లాకు వస్తాయి

అడవి కాదు..  కాలువ
ముళ్లకంపలు, పూడికతో పేరుకుపోయిన ఎస్‌ బ్రాంచ కాలువ

డిసి్ట్రబ్యూటరీల్లో ముళ్ల పొదలు

హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరెలా..?

మూడేళ్లుగా నిర్వహణ గాలికి

చివరి ఆయకట్టుకు రైతు ఆవేదన

బొమ్మనహాళ్‌: ఖరీఫ్‌ సీజన ప్రారంభమైంది. తుంగభద్ర జలాశయం నుంచి మరికొద్ది రోజుల్లో సాగు, తాగునీరు జిల్లాకు వస్తాయి. బొమ్మనహాళ్‌ మండలంలో అధికశాతం రైతులు తుంగభద్ర జలాశయం నీటిపైనే ఆధారపడ్డారు. డిసి్ట్రబ్యూటరీ బ్రాంచ కాలువల నుంచి చివరి ఆయకట్టు వరకు నీరు సక్రమంగా అందాలి. కానీ హెచ్చెల్సీ డిసి్ట్రబ్యూటరీ బ్రాంచ కాలువలు మూడేళ్లుగా దయనీయ స్థితిలో వున్నాయి. కాలువల్లో తుప్పలు, ముళ్లపొదలు పెరిగిపోయాయి. ఏటా చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.  తక్షణం కాలువలకు మరమ్మతులు చేపట్టకపోతే ఈ ఖరీ్‌ఫలోనూ కష్టాలు తప్పేలా లేవని వాపోతున్నారు. 


నిర్వహణ గాలికి..

హెచ్చెల్సీ కణేకల్లు సబ్‌ డివిజన పరిధిలో బొమ్మనహాళ్‌ మండలంలో 1వ డిసి్ట్రబ్యూటరీ, హెచ బ్రాంచ కాలువ, 9, ఆర్‌ఏ, ఆర్‌బి, 1ఆర్‌, 2ఆర్‌ బ్రాంచ కాలువలు పూడిపోయాయి. వీటి నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. కాలువల్లో పూడికపెరిగి, తుప్పలు బలిసి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. మరోవైపు గేట్లు మొరాయిస్తున్నాయి. దీంతో నీరు వృథా అవుతోంది. కాలువల్లో పూడిక తీయించి, గేట్లను బాగు చేయాలని విజ్ఞప్తి చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరేసముద్రం, దేవగిరి, బండూరు, గోవిందవాడ, ఉద్దేహాళ్‌ గ్రామ శివార్లకు వెళ్లే కాలువలు అధ్వానంగా ఉన్నాయి. 


మేల్కొంటేనే సాగునీరు 

ఖరీఫ్‌ సీజనలో బొమ్మనహాళ్‌ మండల బ్రాంచ కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందాలంటే అధికారులు తక్షణం మేల్కోవాలి. కాలువలో పూడిక తీయించాలి. ముళ్ల పొదలను తొలగించి, కోతలకు గురైన చోట లైనింగ్‌ పనులు చేయాలి. లేకుంటే వేల ఎకరాలకు సాగునీటి సమస్య తప్పదు. హరేసముద్రం, గోవిందవాడ, దర్గాహోన్నూరు బ్రాంచ, దేవగిరి కాలువలు ఇటీవల పూర్తిగా దెబ్బతిన్నాయి. కాలువలో నీరు ప్రవహిస్తున్నా తమ పొలాలకు అందడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9వ, 1వ డిసి్ట్రబ్యూటరీ కింద ఒక్కో కాలువ పరిధిలో పదివేల ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉంది. కాలువ గట్టు సరిగా లేకపోవడం, ముళ్లకంపలు పెరిగిపోవడం, కోతలకు గురికావడం వల్ల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ఏడాది కొన్ని బ్రాంచ కాలువల్లో రైతులు శ్రమదానంతో నీటిని తరలించుకున్నారు. 



పేరుకే కాలువలు..

హెచ్చెల్సీకి ఎడమ వైపు డిసి్ట్రబ్యూటరీ కాలువలు పేరుకు మాత్రమే ఉన్నాయి. చివరి ఆయకట్టుకు నీరు అందడమేలేదు. ముళ్ల పొదలు, పూడికతో కాలువల్లో నీరు పారే పరిస్థితి లేదు. మూడేళ్లుగా మరమ్మతులు చేయలేదు. ఈ సారి కూడా సాగునీరు అందడం కష్టమే. అధికారులకు బాధ్యత లేదు. పాలకులకు చిత్తశుద్ధి లేదు. అందుకే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 

 - కొండాపురం కేశవరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు 

Updated Date - 2022-06-25T06:44:49+05:30 IST