
వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలకూ కొరత
ముడి సరుకుల ధరల పెరుగుదలే కారణం
జూన్ నుంచి తల్లిదండ్రులపై మరింత భారం
విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు మరింత చిల్లు
రోజురోజుకు సగటు జీవి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. కొవిడ్ దెబ్బకు గడచిన రెండేళ్లుగా ఇంటి బడ్జెట్ భారీగా పెరగగా.. నెల రోజుల నుంచి సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమాని నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల ఉత్పత్తుల ధరలు మరింత పోటెత్తాయి. తాజాగా ఈ జాబితాలోకి పిల్లల చదువులూ చేరిపోయాయి. ఇప్పటికే స్కూల్ ఫీజులు తల్లిదండ్రుల జేబులను మోత మోగిస్తుండగా.. ఇక పుస్తకాలు, నోట్ బుక్స్ ధరలు చుక్కలు చూపించనున్నాయి.
ముడి పదార్థాల ధరలు పెరగటంతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వేస్ట్ కటింగ్స్ ఎగుమతులపై నిషేధం విధించటమే నోట్‌బుక్స్ ధరల పెరుగుదలకు కారణమని పేపర్ పరిశ్రమ వర్గాలంటున్నాయి. పేపర్ కొరత కారణంగా రానున్న రోజుల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ తగ్గిపోయి వచ్చే విద్యా సంవత్సరంలో వాటికి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
రూ.55 నుంచి రూ.100కి..
కొవిడ్ కంటే ముందు కేజీ పేపర్ ధర రూ.55 ఉండగా ప్రస్తుతం రూ.100కి చేరిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. పేపర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇప్పటికే తమ డీలర్లకు నోట్ పుస్తకాల ధరలను పెంచుతున్నట్లు సంకేతాలిచ్చాయి. మే నుంచి పెంచిన ధరలతో నోట్‌బుక్స్‌ను సరఫరా చేస్తామని డీలర్లకు సదరు కంపెనీలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
పేపర్ తయారీలో ఉపయోగించే అన్ని రకాలైన ముడి పదార్ధాల ధరలు పెరగటంతో తాము ధరలు పెంచక తప్పటం లేదని అఖిల భారత పేపర్ ట్రేడర్స్ సమాఖ్య ప్రెసిడెంట్ దీపక్ మిట్టల్ తెలిపారు. మరోవైపు ఇంధన ధరలతో పాటు బొగ్గు, కెమికల్స్ ధరలు పెరగటం కూడా పరిశ్రమను గణనీయంగా దెబ్బతీస్తోందని అన్నారు. కాగా గడిచిన రెండు నెలలుగా పేపర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవటంతో ధరలు 10-15 శాతం మేరకు పెరిగాయని మిట్టల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ సరఫరా చేయలేకపోతున్నారని తెలిపారు. పల్ప్ నుంచి పేపర్‌ను తయారు చేసే ‘ఏ’ గ్రేడ్ మిల్స్పైనా ఈ ప్రభావం ఉందన్నారు.
ఈయూ నిషేధమూ కారణమే..
యూరోపియన్ యూనియన్ దేశాలు.. పేపర్ వేస్ట్ కటింగ్స్‌పై నిషేధం విధించటం కూడా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అయితే నిషేధంపై చర్చించేందుకు ఈయూ సభ్య దేశాలు ఏప్రిల్ 14న భేటీ కానున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈయూ దీనిపై సానుకూల నిర్ణయం తీసుకున్నా ధరలు దిగిరావటానికి చాలా సమయం పట్టే వీలుందని పేర్కొన్నాయి.
400 డాలర్లకు టన్ను వేస్ట్ కట్టింగ్స్ ధర
వేస్ట్ కటింగ్స్కు కొరత ఏర్పడటంతో వీటి ధరలు టన్నుకు 100 డాలర్ల నుంచి 400 డాలర్లకు పెరిగాయని పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రవాణా వ్యయాలు కూడా 1,600 డాలర్ల నుంచి 3,200 డాలర్లకు చేరటం కూడా పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది.
రీసర్క్యులేషన్ తగ్గిపోయింది..
కొవిడ్ కారణంగా ప్రజలు.. వార్తాపత్రికలు, జర్నల్స్‌కు దూరంగా ఉండటంతో మార్కెట్లో పాత పేపర్ల రీసర్క్యులేషన్ కూడా దాదాపు 35 శాతం తగ్గిపోయిందని, ఇది కూడా పరిశ్రమపై ప్రభావం చూపిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. క్రాఫ్ట్ పేపర్ తయారీదారులతో పాటు ఎలకా్ట్రనిక్స్, ఎఫ్ఎంసీజీ సంస్థలు.. తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌కు ఉపయోగించే కరోగేటెడ్ బాక్సులు, బ్రౌన్ బాక్సుల కోసం వేస్ట్ కటింగ్స్, పాత వార్తా పత్రికలపైనే ఆధారపడతాయని వారు పేర్కొన్నారు. కొవిడ్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఈ రంగానికి రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రతరమైతే ఎలకా్ట్రనిక్స్, ఎఫ్ఎంసీజీ సంస్థలు కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.