చేసిందేమీ లేదు!

ABN , First Publish Date - 2021-10-07T05:51:46+05:30 IST

చెప్పేదే తప్ప.. చేసిందేం లేదు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న నయా పాలన. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఈ రెండున్నరేళ్లలో అభివృద్ధి దాఖలాలు లేవు.

చేసిందేమీ లేదు!
వెలిగొండ రెండో సొరంగం

అభివృద్ధి నిల్‌.. సంక్షేమం డల్‌

పథకాల్లో కోతలు 

వివాదంలో వెలిగొండ

సాగర్‌ ఆయకట్టులో గందరగోళం

ముందుకు సాగని పోర్టు

కదలిక లేని నిమ్జ్‌, కారిడార్‌

అధ్వానంగా రోడ్లు

వెంటాడుతున్న తాగునీటి సమస్య

వ్యవసాయ రంగంలో సంక్షోభం

కదలని గృహ నిర్మాణాలు

గాడిన పడని సచివాలయ వ్యవస్థ

పలు శాఖల్లో అవినీతి జోరు

నేడు ఒంగోలుకు సీఎం

ఆసరా పథకం ప్రారంభం

శాశ్వత అభివృద్ధి, ఉపాధి రంగాలపై 

స్పందిస్తేనే ప్రయోజనం

చెప్పేదే తప్ప.. చేసిందేం లేదు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న నయా పాలన.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఈ రెండున్నరేళ్లలో అభివృద్ధి దాఖలాలు లేవు. జిల్లా శాశ్వత అభివృద్ధి, ఉపాధి మార్గాల పెంపు, ప్రజల జీవన పరిస్థితుల మెరుగునకు ఉపకరించే అంశాలను ఇంతవరకూ పట్టించుకోలేదు.  అదేసమయంలో సంక్షేమ పథకాలతో ఎంతో కొంత ఊరట కలుగుతుందని భావిస్తున్నా వివిధ వర్గాల వారిని ప్రస్తుతం కోతలు భయపెడుతున్నాయి. నిబంధనల పేరుతో ఆయా పథకాల లబ్ధిదారుల తొలగింపులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు కరోనా, విషజ్వరాలు వెంటాడుతుండగా, మరోవైపు డీజిల్‌, పెట్రోలు, విద్యుత్‌ చార్జీలతోపాటు అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ పేదలే కాక, మధ్యతరగతిని సైతం అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర తర్వాత సీఎం జగన్‌ జిల్లా పర్యటనకు గురువారం వస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వివిధ వర్గాల ప్రజల తక్షణ, దీర్ఘకాలిక సమస్యలు, ప్రభుత్వ చర్యలు పరిశీలిస్తే అభివృద్ధి పనులు, అన్నిరకాల ప్రాజెక్టులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. కొన్ని సంక్షేమ పథకాల్లో కోతలు ఊపందుకోగా, మరికొన్ని ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా సీఎం సార్‌.. కాస్త జిల్లా వైపు చూడరూ...

(ఒంగోలు, ఆంధ్రజ్యోతి )

జిల్లా శాశ్వత అభివృద్ధి, ఉపాధి మార్గాల పెంపునకు ఉపకరించే ఒక్క ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకురాకపోగా అప్పటికే మంజూరై, చేపట్టిన సైతం అడుగు మందుకు వేసిన దాఖలాలు లేవు. గతేడాది ఫిబ్రవరి 20న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్‌ అదే ఏడాది జూలై ఆఖరుకు నీరిస్తామని ప్రకటించారు. అయితే ఏడాదిన్నరకుపైగా గడిచినా ఇప్పటికీ నీరివ్వలేకపోగా, వచ్చే ఏడాది అంటూ మరో ముహూర్తం పెట్టారు. మొదటి టన్నెల్‌ పూర్తయినా నీరివ్వలేకపోయారు. నిర్వాసితుల పునరావాసం, పరిహారం చెల్లింపునకు ఎనిమిది నెలల క్రితం రూ.1300 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చినా నిధులు ఇవ్వక ముంపుగ్రామాల ప్రజలను ఖాళీ చేయించలేకపోయారు. దీంతో  కృష్ణానదికి భారీగా వరద వచ్చినా నీటిని తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా కేంద్రం ప్రకటించిన గెజిట్‌లో వెలిగొండ అనుమతి లేని ప్రాజెక్టుగా పేర్కొనడం, దానిని ఆసరా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం వివాదంలోకి లాగడం మొత్తం ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. దీనిపై ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు కనిపించలేదు. మరోవైపు  సాగర్‌ కుడికాలువలో అవసరానికి సరిపడా నీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. శ్రీశైలం, సాగర్‌ డ్యాంలు నిండి వందల టీఎంసీలు నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నా జిల్లాలో మాత్రం సాగర్‌ ఆయకట్టులో ఆరుతడులకు మాత్రమే నీటి సరఫరా అని అధికారులు ప్రకటించారు. దీనికితోడు పెట్టుబడి ఖర్చులు కూడా రాక అవస్థలు పడుతున్న రైతులు అధికారుల ప్రకటనతో నీటిపై భరోసా లేక వరిసాగుకు విరామం ప్రకటించారు. సామాజిక వనాలైన సుబాబుల్‌, జామాయిల్‌ కొనేవారు లేరు. శనగలు ధరలు లేక కోల్డ్‌స్టోరేజ్‌ల్లో మగ్గుతున్నాయి. పొగాకుకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఈ నేపఽథ్యంలో సాగు తగ్గిపోతోంది. ఈ పరిస్థితి రైతులకే కాక కూలీపైనా తీవ్ర ప్రభావం చూపి, వలసలు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


ఉపాధి మార్గాలు ఏవి?

జిల్లాలో ఉపాధి మార్గాలు పెంచే పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. కనిగిరి ప్రాంత నిమ్జ్‌ అడుగు ముందుకు పడటం లేదు. లక్షమందికి ప్రత్యక్షంగా మరో లక్షన్నర మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే రూ.43వేల కోట్ల ప్రాజెక్టును 2011లో కేంద్రం మంజూరుచేయగా, తొలిదశలో 12వేల ఎకరాల్లో దాదాపు రూ.10,800కోట్లతో పూర్తిచేయాల్సి ఉంది. అయితే కనిగిరి, పీసీపల్లి మండలాల్లో 1839 ఎకరాలు ప్రభుత్వ భూమిని బదలాయించడం తప్ప మరే ఇతర చర్యలు అక్కడ లేవు. ఈ ప్రభుత్వం రెండున్నరేళ్ళలో అసలు పట్టించుకోలేదు. దొనకొండ వద్ద గత టీడీపీ ప్రభుత్వం మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. దాదాపు రూ.10వేల కోట్లు వ్యయంతో లక్షమందికి ప్రత్యక్షంగా, 2 లక్షలమందికి పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఈ హబ్‌కు 9వేల ఎకరాలు అవసరంగా గుర్తించి 2,400ఎకరాలు బదలాయించారు. గత టీడీపీ ప్రభుత్వం కాలంలో కొన్ని మౌలిక సదుపాయాల కల్పన, వివిధ పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీల వారి రాకపోకలతో నిత్యం కళకళలాడిన దొనకొండ ప్రాంతం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు వెలవెలబోతోంది. మరో కీలకమైన రామాయపట్నం పోర్టు విషయంలో కొంత హడావుడి కనిపిస్తున్నా నిర్ధిష్ట కార్యాచరణతో ముందుకు సాగడం లేదు. కేంద్రం ప్రకటించిన మేజర్‌ పోర్టు ఇక్కడ నిర్మించాలన్నది ప్రజల కోరిక కాగా నాన్‌-మేజర్‌ పోర్టును చేసి అరబిందోకి ప్రభుత్వం అప్పజెప్పింది. పేపర్‌ పరిశ్రమ వెళ్లిపోయింది. ఇక గత ప్రభుత్వం మంజూరు చేసిన రాగమక్కపల్లి, మాలకొండపురంలలో ఎంఎ్‌సఎంఈ పార్కులతో పాటు ఇతర చిన్న, మధ్యతరహా పారిశ్రామికవాడల అభివృద్ధి ముందుకు సాగిన పరిస్థితి లేదు. 


రోడ్లు దారుణం, వైద్యం నిర్లక్ష్యం

మౌలిక సదుపాయాలైన తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం, రవాణారంగాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ రెండున్నరేళ్ళలో ఆ రంగాలు తీవ్ర నర్లక్ష్యానికి గురయ్యాయి. వాటర్‌గ్రిడ్‌ పేరుతో జిల్లాలోని 56 మండలాల్లో 2,301 హ్యాబిటేష్లనకు రూ.563 కోట్లతో ప్రాజెక్టు గత ప్రభుత్వ కాలంలోనే మంజూరు కాగా ఈ ప్రభుత్వం వచ్చాక మార్పులు చేసింది తప్ప పనులు ముందుకు సాగలేదు. దాదాపు రూ.5633 కోట్ల వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టులో వెలిగొండ రిజర్వాయర్‌ లోపల రూ.245కోట్లతో చేపట్టిన ఇన్‌టెక్‌ వెల్‌ కూడా ఇంతవరకు పూర్తికాలేదు. జిల్లాకు మంజూరైన ట్రిపుల్‌ఐటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీల నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టిన పరిస్థితి లేదు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒంగోలు ట్రిపుల్‌ఐటీ తరగతులు ప్రస్తుతం మూడుచోట్ల జరుగుతుండగా, యూనివర్సిటీకి నిధులు కేటాయించలేదు. జిల్లాలో రోడ్ల పరిస్థితి పట్టించుకున్న దాఖలాలు లేవు. బిల్లులు చెల్లింపులు లేక పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోను అలాగే ఉంది. జిల్లాలోని ఏ ప్రాంతంలో ప్రయాణిస్తున్న రోడ్లపై అడుగడుకో గుంత, గజానికో గోయ్యి అన్నచందంగా తయారైంది. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైనులో 50శాతం వాటా రాష్ట్రానిది కాగా భూసేకరణ, పరిహారం చెల్లింపు నిధులు సక్రమంగా ఇవ్వక ఆ పనులు సాగడం లేదు. గత ప్రభుత్వం చేపట్టిన అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుతో జిల్లాకు అధిక ప్రయోజనం కలిగేది. అలాంటి రోడ్డును ప్రస్తుతం మార్పు చేశారు. వైద్య రంగంలో నిర్లక్ష్యం వెంటాడుతోంది. కొవిడ్‌ నేపఽథ్యంలో ప్రభుత్వ వైద్యశాల అవసరం స్పష్టంగా కనిపించగా జిల్లాలోని అనేక వైద్యశాలల్లో కనీస చర్యలు కూడా లేవు. రిమ్స్‌లో పనిచేయాల్సిన వైద్యులు, సిబ్బంది నేతల సిఫార్సులతో త మ సొంత ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. విద్యుత్‌ సరఫరాలో కోత లు మొదలయ్యాయి. సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరగక పంటలకు విద్యుత్‌ అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నిర్మించ తలపెట్టిన రెండు సోలార్‌ ప్రాజెక్టులకు అడుగుమందుకు పడలేదు. పర్యాటకం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ సౌకర్యాలు పెంపు ఊసే కనిపించడం లేదు. 


నిబంధనల పేరుతో కోతలు

రాష్ట్రప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదల సంక్షేమం కోసం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. నెల వ్యవధిలోనే 28వేలకుపైగా రేషన్‌ కార్డులు తొలగించారు. వివిధ వర్గాల వారికి ఇస్తున్న పింఛన్లలోను దాదాపు 50వేల వరకు కోతలు పడ్డాయి. అమ్మఒడి, రైతుభరోసా, వాహనమిత్ర, ఇతరత్రా పథకాలను రకరకాల కొర్రీలతో తగ్గించి వేస్తున్నారు. కీలకమైన గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. కోర్టు వివాదాలతో నిలిచిపోయినవి పోగా, గ్రామీణ ప్రాంతాల్లో 754 లేఅవుట్లలో 79,072 గృహాలు మంజూరుచేశారు. అందులో నిర్మాణాలు పూర్తయింది కేవలం 40 మాత్రమే. కాగా 31,826 ఇళ్లు అసలు ప్రారంభమే కాలేదు. ఇక వాటిలో రోడ్లు, తాగునీరు, విద్యుత్‌, డ్రైన్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన లేదు. పట్టణ ప్రాంతాల్లో 27,749 గృహాలను గత ప్రభుత్వం మంజూరుచేయగా, వాటిని మూడొంతులు ప్రస్తుత ప్రభుత్వం తగ్గించి వేసింది. 


గాడిలో పడని పాలన వ్యవస్థ

జిల్లాలో పాలనా వ్యవస్థ అధ్వానంగా ఉంది. సచివాలయ వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు. జవాబుదారీతనం, సత్వర సేవలు, వాటిలో ప్రజలకు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే భవన నిర్మాణాల, పురోగతి లేదు. అదే సమయంలో మండలస్థాయిలో కీలకమైన రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్‌ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు, రాజకీయ పైరవీకారులకు అడ్డాలుగా మారిపోయాయి. అవినీతి రహితం అంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నా, ఆచరణలో జిల్లాలో అధికారపార్టీ నేతలు, అధికారులు కలిసిపోయి అక్రమ, వ్యవహారాలు జోరుగా సాగిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా భూఆక్రమణలు, ఇసుక, గ్రావెల్‌, రేషన్‌బియ్యం, గ్రానైట్‌, మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక జిల్లా అంతా ఒక ఎత్తు, జిల్లా కేంద్రం ఒక ఎత్తు కాగా, కార్పొరేషన్‌ స్థాయికి పెరిగిన ఒంగోలులో సౌకర్యాలు నేటికి పల్లెటూరికి ఎక్కువ, పట్టణాలకు తక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉంది. చినుకుపడితే రోడ్లన్నీ కాలువలను తలపిస్తుండగా, ఎక్కడా రోడ్లు, డ్రెయిన్లు సరిలేవు. నేటికీ మూడురోజులకొకసారి నీటిసరఫరా జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అమృత్‌ పథకం కింద చేపట్టిన తాగునీటి పథకం అలాగే నిలిచిపోగా, పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు ముందుకు సాగడం లేదు. భూగర్భ విద్యుత్‌లైన్‌ అసంపూర్తిగా నిలిచిపోయింది. నగర స్థాయిలో ఉండాల్సిన ఇతర హంగులు ఏ ఒక్కటి లేకపోగా కలెక్టరేట్‌తోపాటు పలు  ప్రభుత్వ కార్యాలయాలు శిఽథిలావస్థకు చేరి వాటిలో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. ఈ నేపఽథ్యంలో సీఎం గురువారం ఇక్కడి పీవీఆర్‌ బాలుర పాఠశాలలో జరిగే సభలో పాల్గొననున్నారు. కేవలం ఆ పథకం ప్రారంభానికే పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధి, ఉపాధి మార్గాల పెంపు, ప్రజల ఇతి బాధలపై కూడా స్పందించాలని జిల్లా ప్రజానీకం కోరుతుంది. 








Updated Date - 2021-10-07T05:51:46+05:30 IST