తప్పుడు.. నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-04-17T06:00:29+05:30 IST

మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు 50 డివిజన్లతో కూడిన నగర చిత్రపటాన్ని హద్దులతో రూపొందించారు. మంగళగిరి- తాడేపల్లి నగరపాలకసంస్థ వార్డుల పునర్విభజన, ప్రాఽథమిక ప్రకటన పేరుతో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

తప్పుడు.. నోటిఫికేషన్‌
హద్దులతో కూడిన 50 డివిజన్ల మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌

9వ తేది పేరుతో 16న విడుదల

పాతతేదీతో వార్డుల పునర్విభజన ప్రకటన

అభ్యంతరాలు, సూచనలకు గంటల వ్యవధే

అధికారుల మంత్రాంగంపై ప్రతిపక్షాల ఆగ్రహం

ఇష్టానుసారంగా మంగళగిరి- తాడేపల్లి నగరపాలకసంస్థ అధికారుల తీరు   


మంగళగిరి, ఏప్రిల్‌ 16: మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు 50 డివిజన్లతో కూడిన నగర చిత్రపటాన్ని హద్దులతో రూపొందించారు. మంగళగిరి- తాడేపల్లి నగరపాలకసంస్థ వార్డుల పునర్విభజన, ప్రాఽథమిక ప్రకటన పేరుతో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మంగళగిరి పాత మునిసిపల్‌ పట్టణ పరిధిలో 15, తాడేపల్లి పాత మునిసిపల్‌ పట్టణ పరిధిలో 11, మిగిలిన విలీన గ్రామాలను కలిపి 24 వార్డులతో మొత్తం 50 డివిజన్లను ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించి ఆర్‌వోసీ నెం. 579/2021/జీ1 పేరుతో ప్రాథమిక ప్రకటనను విడుదల చేశారు. డివిజన్ల ఏర్పాటు, హద్దులకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే నోటిఫికేషన్‌ వెలువరించిన ఏడు రోజుల్లోగా నగరపాలకసంస్థ కమిషనర్‌కు రాతపూర్వకంగా దఖలు పరుచుకోవాలని ప్రకటించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ నోటిఫికేషన్‌ను 16వ తేది అంటే శుక్రవారం ఉదయం విడుదల చేశారు. అయితే నోటిఫికేషన్‌ పత్రంలో మాత్రం తేదీని 09-04-2021గా ముద్రించారు. నోటిఫికేషన్‌లో ముద్రించిన ఈ తేది ప్రకారం చూసుకుంటే అభ్యంతరాలు తెలపడానికి గడువు నోటిఫికేషన్‌ ప్రకటించిన రోజుతోనే ముగిసింది.  ఈ నోటిఫికేషన్‌ తీరు చూసిన ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అధికారపార్టీ సూచనల ప్రకారం ఇష్టానుసారం డివిజన్లను చేసి.. ఇదే ఫైనల్‌ అంటూ అభ్యంతరాలకు గడువు లేకుండా అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారని మండిపడ్డాయి. 16వ తేది ఉదయం ఏడు గంటలకు నోటిఫికేషన్‌ను స్థానిక వాట్సాప్‌ గ్రూపులకు పంపించి తొమ్మిదో తేదీనే విడుదల చేశామని చెప్పడమేమిటని ప్రతిపక్ష పార్టీల నేతలు నిలదీస్తున్నారు. దీనిని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు వేర్వేరుగా మంగళగిరి పాత మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లి మేనేజరు విజయలక్ష్మికి వినతిపత్రాలను అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామర్లరాజు, నాయకులు చావలి ఉల్లయ్య, తోట పార్థసారఽథి, గాదె పిచ్చిరెడ్డి, షేక్‌ రియాజ్‌, సీపీఐ తరపున చిన్ని పిచ్చియ్యతోపాటు ఆ పార్టీ నాయకులు జాలాది జాన్‌బాబు,  సీపీఎం తరపున చెంగయ్య, పిల్లలమర్రి బాలకృష్ణ తదితరులు ఉన్నారు.


నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి : టీడీపీ

నగరపాలకసంస్థ ఏర్పాటుపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌ను రద్దు చేసుకోవాలని టీడీపీ నాయకులు తెలిపారు. అలా కుదరని పక్షంలో 16వ తేదీ నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించేందుకు వారం రోజుల గడువును ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తీరు ప్రజలను మోసం చేసినట్లుగా ఉందన్నారు.


నిబంధనలు పాటించలేదు : సీపీఎం

నోటిఫికేషన్‌ విడుదలలో అధికారులు నిబంధనలను పాటించలేదని సీపీఎం పట్టణశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ చెంగయ్య తెలిపారు. నిబంధనల మేరకు అభ్యంతరాలు, సూచనలకు 16వ తేదీ నుంచి వారం రోజుల గడువు ఇవ్వాల్సిందేనన్నారు. ఇంతవరకు రాజకీయపార్టీలకు నోటిఫికేషన్‌ అందలేదని, ఒకరోజు గడువుతో ప్రజలు అభ్యంతరాలను ఎలా తెలియజేస్తారని ఆయన ప్రశ్నించారు.


అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి : సీపీఐ

నోటిఫికేషన్‌కు ముందు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి వార్డుల విభజనకు అన్ని రాజకీయపక్షాల సలహాలు, సూచనలను స్వీకరించాలని  సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య తెలిపారు. విలీన గ్రామాలలో వార్డులను గొలుసుకట్టు క్రమంలో ఏర్పాటు చేయాలని, ఒక్కో డివిజన్‌కు నిర్ధిష్టంగా ఐదేసి వేల జనాభా ఉండేలా చర్యలను చేపట్టాలన్నారు. నోటిఫికేషన్‌ వచ్చాక ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు పది రోజులైనా గడువు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.


Updated Date - 2021-04-17T06:00:29+05:30 IST