Advertisement

ఇక సమరమే!

Jan 23 2021 @ 00:00AM
శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం

పంచాయతీ పోరుకు నోటిఫికేషన్‌ విడుదల

1,164 పంచాయతీలు, 10,926 వార్డుల్లో ఎన్నికలు

నాలుగు దశల్లో నిర్వహణకు ఏర్పాట్లు  

అధికారుల సహకారంపై అనుమానాలు...

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది. జిల్లాలో వచ్చే నెల 5 నుంచి నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. అయితే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో..  అధికారులు కూడా ఎన్నికల నిర్వహణకు సముఖంగా లేనట్టు తెలుస్తోంది.  ఇందులో భాగంగా ఎస్‌ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు శనివారం అధికారులంతా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకమవుతోంది. అసలు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారో? లేదోనన్నది చర్చనీయాంశమవుతోంది. 

--------------------

‘స్థానిక’ సంగ్రామం మొదలైంది.  పంచాయతీ పోరుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ) శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాలో నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 5న తొలిదశ, 9న రెండో దశ, 13న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్‌ ప్రకటించింది. జిల్లాలో మొత్తం 38  మండలాలు ఉన్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,,190 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,164 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 11,168 వార్డులకుగానూ 10,926 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 

- ఫిబ్రవరి 5న తొలి దశలో.. ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 

- 9న రెండో దశలో ఎల్‌.ఎన్‌.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.  

-  13న మూడో దశలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, రాజాం, సంతకవిటి, వంగర మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

- 17న నాలుగో దశగా ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, రేగిడి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు సముఖంగా లేదు. కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఎన్నికల నిర్వహించలేమని చెబుతోంది. ఇందులో భాగంగా ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తీర్పు వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు.. కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నందున ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని కలెక్టర్‌ నివాస్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఉద్యోగ వర్గాలు సహకరిస్తాయా? లేదా? అనేది ప్రశ్నార్థకమవుతోంది.


- ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారుల గైర్హాజరు


ఎన్నికల నగారా మోగిందంటే చాలు... అధికారుల్లో హడావుడి కనిపించేది. కానీ ఈసారి మాత్రం దీనికి భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘స్థానిక’ సమరానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శనివారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సాయంత్రం 3 గంటలకు అన్ని జిల్లాల అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి ఏ ఒక్క అధికారీ పాల్గొనలేదు. ఇతర జిల్లాల మాదిరిగానే ఇక్కడ కూడా గైర్హాజరయ్యారు. కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి సైతం హాజరుకాలేదు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే గది ఖాళీ గానే దర్శనమిచ్చింది. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడినా, జిల్లా పరంగా ఇంతవరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ఉద్యోగ సంఘాలు ఎన్నికలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రెండు డోసుల కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయేవరకు పంచాయతీ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏపీఎన్జీఓ జేఏసీ చైర్మన్‌ హనుమంతు సాయిరాం రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారో? లేదోనన్న చర్చ సాగుతోంది.  

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.