750 డాక్టర్‌ పోస్టుల భర్తీకి వారంలో నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-05-28T08:04:10+05:30 IST

వికారాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 750 డాక్టర్‌ పోస్టుల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య

750 డాక్టర్‌ పోస్టుల భర్తీకి వారంలో నోటిఫికేషన్‌

ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌  శ్రీనివాసరావు వెల్లడి

వికారాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 750 డాక్టర్‌ పోస్టుల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్‌ జారీచేయనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు.  వికారాబాద్‌ జిల్లా ధారూరు, రామయ్యగూడ పీహెచ్‌సీలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం అనంతగిరిలోని ప్రభుత్వ క్షయ, ఛాతీ వ్యాధుల ఆస్పత్రిని పరిశీలించారు. పీహెచ్‌సీలు, ఆస్పత్రి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం డీపీఆర్‌సీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు.  గ్రామీణప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పీహెచ్‌సీల్లోని డాక్టర్‌ పోస్టులను రెగ్యులర్‌ డాక్టర్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో, ప్రోగ్రాం అధికారుల వాహనాలకు త్వరలో గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎ్‌స)ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వారు రోజూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారో పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. రాబోయే ఒకటిన్నర ఏళ్లలో అన్ని జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్ల్లు పేర్కొన్నారు. జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నా, కొన్ని అంశాల్లో వెనకబడి ఉందని, పనితీరును ఇంకా మెరుగుపరుచుకోవాలన్నారు. పీహెచ్‌సీ సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలని చెప్పారు. జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లోని 53 రకాల వైద్యసేవలను పీహెచ్‌సీల్లో కూడా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కన్సల్టేషన్‌, వ్యాధినిర్ధారణ పరీక్షలు, మందులతో పాటు ఇతర సేవలన్నీ ఉచితమేనని తెలిపారు. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఎంబీబీఎస్‌ డాక్టర్లను నియమించనున్నట్లు చెప్పారు. అన్ని పీహెచ్‌సీల్లో మూడేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఔట్‌పేషెంట్‌, ల్యాబ్‌, ఫార్మసిస్ట్‌ గదుల వద్ద వీటిని అమర్చుతారని, ఈ వ్యవస్థను ఈసీఐఎల్‌ పర్యవేక్షిస్తుందని వివరించారు. శిథిలావస్థకు చేరిన పీహెచ్‌సీల స్థానంలో కొత్త భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. కాగా, డిసెంబరు నెలాఖరు వరకు కొన్ని దేశాలు, ప్రాంతాల్లో కొవిడ్‌ 4వ దశ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు బూస్టర్‌డోస్‌ తీసుకోవాలని సలహా ఇచ్చారు. పనితీరులో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా మొదట డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం అధికారులపైనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ తుకారాంభట్‌, డీఐవో జీవరాజ్‌, డీఎ్‌సవో అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T08:04:10+05:30 IST