నోరూరించే పచ్చళ్లు!

ABN , First Publish Date - 2022-05-28T06:27:51+05:30 IST

వేడివేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి ఉంటే చాలు... నాలుగు ముద్దలు ఇష్టంగా తినేస్తాం.

నోరూరించే పచ్చళ్లు!

వేడివేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి ఉంటే చాలు... నాలుగు ముద్దలు ఇష్టంగా తినేస్తాం. ఇది మామిడికాయ పచ్చళ్లు పెట్టుకునే సమయం. మామిడికాయతో చేసే రకరకాల పచ్చళ్ల తయారీ విశేషాలు  ఈ వారం మీకోసం....


పచ్చ ఆవకాయ

కావలసినవి

పసుపు రంగులో ఉండే పచ్చ మిరపకాయ పొడి - రెండు కప్పులు, ఆవపిండి - రెండు కప్పులు, మామిడికాయ ముక్కలు - మూడు కప్పులు, మెత్తగా దంచిన రాళ్ల ఉప్పు - ఒక కప్పు, నూనె - అర లీటరు, మెంతులు - ఒక టీస్పూన్‌, ఇంగువ - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం

ముందుగా ఒక పాత్రలో మిరపకాయ పొడి, ఆవపిండి, ఉప్పు, మెంతులు, ఇంగువ వేసి, కొద్దిగా నూనె వేసి కలుపు కోవాలి.

తరువాత మామిడికాయ ముక్కలు వేసుకుంటూ మిశ్రమం ముక్కలకు పటే లా బాగా కలియబెట్టుకోవాలి.

ఈ పచ్చడిని  జాడీలో పెట్టి భద్రపరుచుకోవాలి. 


ఆవకాయ

కావలసినవి

చిన్నరసాల మామిడికాయలు - 12, జల్లించిన ఆవపిండి - ముప్పావు కప్పు, దంచిన రాళ్ల ఉప్పు - ఒక కప్పు, కారం - ఒక కప్పు, మెంతులు - ఒక టీస్పూన్‌, నువ్వుల నూనె - రెండు కప్పులు, ఇంగువ - కొద్దిగా, పసుపు - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం

ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. టెంక, తెల్లటి పొర తీసేయాలి. 

కొలత కోసం ఒక గ్లాసు తీసుకుని ఉప్పు, కారం, ఆవపిండిని ఒక పాత్రలో వేసి బాగా కలుపుకొని పసుపు, ఇంగువ, మెంతులు కూడా జోడించి కలిపి పెట్టుకోవాలి. 

మరొక పాత్రలో నూనె పోసి మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేస్తూ మరో పాత్రలోకి తీసుకోవాలి. తరువాత వాటిని కారం, ఆవపిండి కలిపి పెట్టుకున్న పాత్రలో వేసి కలుపుకోవాలి. 

రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

మూడో రోజు మూత తీసి మరికొద్దిగా నూనె కలిపి సీసాల్లో నింపుకోవాలి. అంతే... ఘుమఘుమలాగే ఆవకాయ రెడీ.


తొక్కుడు ఊరగాయ

కావలసినవి

మామిడికాయలు పుల్లనివి - నాలుగు, ఉప్పు - పావుకప్పు, కారం - అరకప్పు, పసుపు - పావు టీస్పూన్‌, మెంతిపొడి - రెండు టీస్పూన్లు, ఆవపొడి - రెండు టీస్పూన్లు, నూనె - ఒకటిన్నర కప్పు, ఎండుమిర్చి - రెండు, ఇంగువ - అర టీస్పూన్‌.


తయారీ విధానం

మామిడికాయలను ముక్కలుగా తరిగి ఎండలో పెట్టుకోవాలి. 

తడి లేకుండా ఆరిన తరువాత కొద్ది కొద్దిగా ముక్కలు, ఉప్పు గ్రైండ్‌ చేసుకుంటూ(మరీ మెత్తగా కాకుండా ముక్కలు కాస్తనలిగేలా) ముద్దలా చేసుకోవాలి. 

తరువాత మెంతిపొడి, ఆవపొడి, పసుపు కలుపుకోవాలి.

ఆ ముద్దపై కారం పోసి ఉంచుకోవాలి.

స్టవ్‌పై బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఇంగువ వేయాలి. ఈ పోపుని మామిడికాయ మిశ్రమంలో కలుపుకొంటే కమ్మటి తొక్కుడు పచ్చడి రెడీ.


మాగాయ

కావలసినవి

పల్లటి పచ్చిమామిడికాయ ముక్కలు - నాలుగు కప్పులు, ఉప్పు - అరకప్పు, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - అరకప్పు, మెంతిపొడి - మూడు టీస్పూన్లు, నూనె - ముప్పావుకప్పు, ఆవాలు - మూడు టీస్పూన్లు, ఎండుమిర్చి - నాలుగు, ఇంగువ - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం

ముందుగా మామిడికాయ ముక్కలను చిన్న ముక్కలుగా తరుగుకుని ఉప్పు, పసుపు వేసి రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 

మూడో రోజు ముక్కలు విడిగా, రసం విడిగా ఎండలో పెట్టాలి. ఆరేడు గంటలు ఎండిన తరువాత ముక్కలు రసం కలుపుకోవాలి. కారం వేయాలి.

స్టవ్‌ పై బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేయాలి. ఈ పోపును పచ్చడిలో కలుపుకోవాలి. 

వారం రోజుల తరువాత పచ్చడి ఊరి ముక్క మెత్తబడుతుంది. అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది. 


పంపినవారు : ఉత్పల జగన్మోహిని

హైదరాబాద్‌


మెంతికాయ

కావలసినవి

మామిడికాయ ముక్కలు - మూడు గ్లాసులు, ఉప్పు - ఒక గ్లాసు, కారం - ఒక గ్లాసు, ఆవాలు - ఒకటిన్నర గ్లాసు (వేయించి పొడి చేసుకోవాలి), మెంతులు - ఒక గ్లాసు (వేయించి పొడి చేసుకోవాలి), నువ్వుల నూనె - ఒక గ్లాసు, ఇంగువ - అర టీస్పూన్‌.


తయారీ విధానం

ముందుగా ఉప్పు, కారం, మెంతిపొడి, ఆవపొడి బాగా కలుపుకోవాలి. తరువాత పావుగ్లాసు నూనె వేసుకుంటూ కలపాలి. 

ఇప్పుడు దాంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుంటూ కలుపుకొని మూత పెట్టుకోవాలి.

రెండు రోజుల తరువాత స్టవ్‌పై బాణలి పెట్టి ముప్పావు గ్లాసు నూనె పెట్టి కొద్దిగా వేడి అయ్యాక ఇంగువ వేయాలి. ఈ బాణలిని స్టవ్‌ పై నుంచి దింపుకొని నూనె చల్లారిన తరువాత మామిడికాయ ముక్కల్లో పోసి కలుపుకొంటే పచ్చడి రెడీ 

Updated Date - 2022-05-28T06:27:51+05:30 IST