ఫేవరెట్లు జొకో, రఫా

ABN , First Publish Date - 2022-06-27T09:55:05+05:30 IST

ఆధునిక టెన్నిస్‌ను ఏలుతున్న నొవాక్‌ జొకోవిచ్‌, రఫెల్‌ నడాల్‌.. సోమవారం నుంచి జరగనున్న వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో హాట్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు.

ఫేవరెట్లు జొకో, రఫా

సెరెనా రీఎంట్రీ

నేటి నుంచే వింబుల్డన్‌ మ. 3.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

లండన్‌: ఆధునిక టెన్నిస్‌ను ఏలుతున్న నొవాక్‌ జొకోవిచ్‌, రఫెల్‌ నడాల్‌.. సోమవారం నుంచి జరగనున్న వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో హాట్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. కాగా, ఏడాది విరామం తర్వాత అమెరికా క్వీన్‌ సెరెనా విలియమ్స్‌ మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ బరిలో నిలవనుంది. వరుసగా నాలుగో గ్రాస్‌ కోర్ట్‌ టైటిల్‌తో పీట్‌ సంప్రాస్‌, రోజర్‌ ఫెడరర్‌ సరసన నిలవాలని డిఫెండింగ్‌ చాంప్‌ జొకో పట్టుదలతో ఉండగా.. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన స్పెయిన్‌ బుల్‌ నడాల్‌ క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌పై గురిపెట్టాడు.


ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా, బెలార్‌సపై బ్యాన్‌ విధించిన కారణంగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ డానిల్‌ మెద్వెదెవ్‌, గాయం కారణంగా జ్వెరెవ్‌ టోర్నీకి దూరమయ్యారు. దీంతో జొకోకు టాప్‌ సీడ్‌ దక్కగా.. నడాల్‌కు రెండో సీడ్‌ లభించింది. గతేడాది రన్నరప్‌ బెరెట్టిని కూడా ఈసారి టైటిల్‌ నెగ్గాలనే కసితో ఉన్నాడు. అయితే, 1998 తర్వాత తొలిసారి ఫెడెక్స్‌ గ్రాస్‌కోర్ట్‌ టోర్నీకి దూరమవుతున్నాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కొరియా ఆటగాడు క్వాన్‌ సూన్‌ వూతో నొవాక్‌, ఫ్రాన్సిస్కో (అర్జెంటీనా)తో రఫా తలపడనున్నారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌, సిట్సిపాస్‌, అల్కరజ్‌ను తక్కువగా అంచనా వేయలేం. ఇక మహిళల్లో ఏడుసార్లు చాంపియన్‌ సెరెనా రీఎంట్రీ ప్రత్యేక ఆకర్షణ కానుంది. డిఫెండింగ్‌ చాంప్‌ ఆష్లే బార్టీ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత ఇగా స్వియటెక్‌ మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.


వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభించిన సెరెనా తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌ ప్లేయర్‌ హార్మనీ టాన్‌తో ఆడనుంది. కొంటావెట్‌, ఆన్స్‌ జెబూర్‌, ఎమ్మా రదుకాను, సక్కారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. వరుసగా 35 మ్యాచ్‌లు నెగ్గిన టాప్‌ సీడ్‌ స్వియటెక్‌ జైత్రయాత్రను కొనసాగించాలనుకుంటోంది. మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఒసాక టోర్నీకి దూరమైంది. రష్యన్‌ ఆటగాళ్లపై నిషేధం విధించడంతో వింబుల్డన్‌ టోర్నీకి ఎలాంటి పాయింట్లూ ఉండవని టెన్నిస్‌ సమాఖ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-06-27T09:55:05+05:30 IST