మరో కుర్రాడు.. పబ్‌జీ కోసం రూ. 2 లక్షలు ఖర్చు పెట్టేశాడు!

ABN , First Publish Date - 2020-07-07T02:38:11+05:30 IST

పాప్యులర్ గేమ్ పబ్‌జీ మాయలో పడి తండ్రి బ్యాంకు ఖాతా నుంచి ఓ టీనేజీ కుర్రాడు రూ.16 లక్షలు ఖర్చుచేసిన

మరో కుర్రాడు.. పబ్‌జీ కోసం రూ. 2 లక్షలు ఖర్చు పెట్టేశాడు!

చండీగఢ్: పాప్యులర్ గేమ్ పబ్‌జీ మాయలో పడి తండ్రి బ్యాంకు ఖాతా నుంచి ఓ టీనేజీ కుర్రాడు రూ.16 లక్షలు ఖర్చుచేసిన విషయం మర్చిపోకముందే.. అదే పంజాబ్‌లో అలాంటి ఘటనే మరోటి జరిగింది. అయితే, ఈ కుర్రాడు మరీ అంత ఖర్చు చేయలేదు కానీ, రూ. 2 లక్షలతో సరిపెట్టాడు. మొహాలీకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు గేమ్ ఆడుతూ ‘ఇన్ యాప్’ కొనుగోళ్ల కోసం తన తాతయ్య డబ్బులు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి గేమ్ ఆడడం మొదలుపెట్టిన కుర్రాడు క్రమంగా దానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తన తాత పేటీఎం నుంచి ఈ కొనుగోళ్లు జరిపాడు. గత రెండు నెలల్లో 30 లావాదేవీలు నిర్వహించాడు. వీటి విలువ రూ. 55 వేలు.  


తాజాగా, కుటుంబ సభ్యులు తాతయ్య పెన్షన్ ఖాతాను చూస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కుర్రాడిని ప్రశ్నించగా ఇన్ యాప్ కొనుగోళ్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు అంగీకరించాడు. గేమ్ కోసం అతడు ప్రత్యేకంగా సిమ్ కార్డు తీసుకున్నట్టు గుర్తించామని కుర్రాడి బాబాయి తెలిపారు. కుర్రాడి సీనియర్ ఒకరు తాతయ్య ఖాతా నుంచి ఇన్‌యాప్ కొనుగోళ్లు చేయాలని సూచించినట్టు తెలిసిందని, ఈ విషయమై మొహాలీ ఎస్సెస్పీ కుల్దీప్ సింగ్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-07T02:38:11+05:30 IST