ఇప్పుడు నోరెత్తే వాళ్ళేరీ?

ABN , First Publish Date - 2021-09-16T09:10:31+05:30 IST

స్వాతంత్ర్యోద్యమ వాతావరణంలో పెరిగిన నాకు ప్రజా ఉద్యమాలంటే ప్రాణం. సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరిస్తుండేదాన్ని..

ఇప్పుడు నోరెత్తే వాళ్ళేరీ?

ఆంధ్రా ప్రాంతంలో పుట్టి, తెలంగాణకు కోడలై...ఆ ప్రాంత రైతాంగ సాయుధ పోరాటంతో మమేకమైన యోధురాలు... 95 ఏళ్ళ దొడ్డా పద్మ.తెలుగు రాష్ట్రాల ఉమ్మడి పోరాట వారసత్వానికీ, ఇరు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సుహృద్భావనకూ ఆమె ప్రతీక. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని, మూడేళ్లు అజ్ఞాతంలో గడిపిన పద్మ... శుక్రవారం హైదరాబాద్‌ విలీన దినం సందర్భంగా నిజాం వ్యతిరేక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లో తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.


స్వాతంత్ర్యోద్యమ వాతావరణంలో పెరిగిన నాకు ప్రజా ఉద్యమాలంటే ప్రాణం. సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరిస్తుండేదాన్ని.. ఆంధ్రా ఆడపడుచునైన నేను ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలను కళ్లారా చూశాను. తెలంగాణ కోడలుగా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ఆ సమయంలో మూడేళ్లు నల్లమల అడవుల్లో అజ్ఞాతవాసం గడిపాను. నా భర్త దొడ్డా నర్సయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక దళ నాయకుడు. ఆయన బృందంలో ఆడపిల్లను నేనొక్కదాన్నే. అప్పుడప్పుడు కొరియర్‌గా శాంతమ్మ అనే అమ్మాయి వచ్చిపోతుండేది. నా అసలు పేరు సరస్వతి. రహస్య జీవితం గడుపుతున్నప్పుడు నర్సయ్య నా పేరును పద్మగా మార్చారు. దళ సభ్యురాలిగా రోజూ కరపత్రాలు, ఉత్తరాలు రాయడం నా బాధ్యత. పుచ్చలపల్లి సుందరయ్య వంటి పెద్ద నాయకులు మా నివాస స్థావరాల వద్దకు అప్పుడప్పుడు వస్తుండేవారు. దళ సభ్యుల దగ్గర గుండుసూది మొదలు ప్రతి నిత్యావసర వస్తువూ అందుబాటులో ఉండేది. అడవి పందులు, ఎలుగుబంట్లు లాంటివి నిత్యం మాకు తారసపడేవి. కానీ నేను ఎప్పుడూ వాటికి భయపడలేదు. నిజానికి నా అజ్ఞాతవాసం నిర్భయంగా సాగింది. బహుశా నా భర్త నర్సయ్య వెంట ఉన్నారనే ధైర్యమే అందుకు కారణం కావచ్చు. 


కుటుంబమంతా ఉద్యమంలోనే..!

మా సొంత ఊరు కృష్ణా జిల్లా బుద్ధవరం. ఐదవ తరగతి వరకు నా చదువు అక్కడే సాగింది. ఆ తర్వాత మా కుటుంబం అట్లప్రగడ గ్రామానికి వలస వెళ్లింది. మా నాన్న కాట్రగడ్డ రంగయ్యకు తొలి తరం కమ్యూనిస్టు నాయకులతో సత్సంబంధాలుండేవి. దాంతో తెలంగాణ సాయుధపోరాట సమయంలో తమ్మారెడ్డి సత్యనారాయణ, వెల్లంకి విశ్వనాఽథం, పేట రామారావు తదితర నాయకులు చాలామంది అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తుండేవారు. ఒకసారి పోలీసులు మా ఇంటిమీదకొచ్చి, కమ్యూనిస్టు నాయకుల జాడ చెప్పమని మా నాన్నను, పెద్దన్నను అరెస్టు చేశారు. మా అమ్మను, చెల్లెలిని గంపలగూడెం కాన్సంట్రేషన్‌ క్యాంపులో బంధించి, తీవ్రంగా హింసించారు.


నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని... పోలీసుల కళ్లు కప్పి... నర్సరావుపేటలోని దొడ్డా నర్సయ్య రహస్య స్థావరానికి చేరాను. అప్పటికే నర్సయ్య వ్యక్తిత్వం నాకు బాగా తెలిసివుండటంతో ఆయనతోనే నా జీవితం పంచుకోవాలనుకున్నాను. నా అభిప్రాయాన్ని నర్సయ్యతో పాటు పార్టీ పెద్దలూ సమ్మతించారు. సత్తెనపల్లి తాలూకా ‘తాళ్లూరు’లో మేమంతా అజ్ఞాత జీవితం గడుపుతున్న సమయంలో తుపాకీల మధ్య మా పెళ్లి జరిగింది. ఒక విధంగా మాదీ ఆదర్శ వివాహమే! అయితే, ఆ వివరాల్లోకి వెళ్లడం నాకిష్టంలేదు. కానీ నా జీవిత సహచరుడు నర్సయ్య మాత్రం తాను నమ్మిన సిద్ధాంతాన్ని తుది వరకూ ఆచరించిన మహనీయుడు అని మాత్రం చెప్పగలను. 


ఆంధ్ర, తెలంగాణ భేదాలు ఎప్పుడూ లేవు..

మా మెట్టినింటివారిది ఉమ్మడి నల్గొండ జిల్లా చిలుకూరు. వారి కుటుంబానిదీ త్యాగాల చరిత్రే. 1941లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన మా ఊర్లో ఆంధ్ర మహాసభ జరిగింది. ఆ కార్యక్రమంలో వాలంటీర్‌గా పనిచేసిన నా భర్త నర్సయ్య సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితుడై కమ్యూనిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో వాళ్ల కుటుంబమంతా నిజాం వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, యావదాస్తినీ కోల్పోయారు. ఒకానొక దశలో రజాకార్ల దౌర్జన్యం వల్ల నిలువనీడకు కూడా దూరమయ్యారు. జైలు నిర్బంధాలను ఎదుర్కొన్నారు. భూస్వామ్య వ్యతిరేకంగా పోరాడిన నా భర్త, మా చిన్నమరిది నారాయణరావు జైలు శిక్ష అనుభవించారు. మా పెద్ద బావ గోపయ్య కోదాడ కాన్సంట్రేషన్‌ క్యాంపులోనే కన్నుమూశారు. అంతటి సామాజిక చైతన్యం కలిగిన ఇంటికి కోడలినయ్యానని గర్వపడుతుంటాను. మా కుటుంబాల్లో ఆంధ్రా, తెలంగాణ బేధాలు ఎన్నడూ తలెత్తలేదు. అంతా కలిసి మెలిసి ఉండేవాళ్లం. మా వాళ్లవన్నీ దండలమార్పిడి పెళ్లిళ్లే.! 


అవి చూస్తుంటే బాధేస్తోంది...

ఇప్పుడు నా వయసు 95 ఏళ్లు. పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ లేవు. ఎందుకంటే చిన్నతనంలో మేం తిన్న ఆహారం ఎంతో బలవర్థకమైనది, శ్రేష్టమైనది! ఇప్పుడంటే అంతా అన్నమే కానీ ఆ రోజుల్లో జొన్నలు, సజ్జలు, కొర్రలు ఎక్కువగా తినేవాళ్లం. అందుకు తగ్గ శ్రమ చేసేవాళ్లం. ప్రతిరోజూ పేపర్‌ తప్పనిసరిగా చదువుతాను. అదీ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక మాత్రమే చదువుతాను. ఆర్కే ‘కొత్తపలుకు’ అంటే నాకు చాలా ఇష్టం. సమకాలీన రాజకీయాలపై ఆయన చేసే విశ్లేషణ బావుంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు చూస్తుంటే ఆంధ్రా ఆడపడుచుగా బాఽధ కలుగుతోంది. తెలంగాణలో కేసీఆర్‌ పాలన కొంత ఫర్వాలేదనిపిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సంగతి సరేసరి.! ఒక్కొక్కటిగా ప్రజల సొత్తును ప్రైవేటు పరం చేస్తున్నారు. అయినా, ఇప్పుడు నోరెత్తే వాళ్లేరీ?. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసి కట్టుగా పోరాడాలి. ఒకప్పుడు ఎర్రజెండా అంటే ప్రజల్లో వల్లమాలిన ప్రేమాభిమానాలుండేవి. ఇప్పుడు కమ్యూనిస్టులు ప్రజలకు దూరమవుతున్నందుకు ఆవేదనగా ఉంది. అయినా, నా ఊపిరి ఉన్నంత వరకూ కమ్యూనిస్టు పార్టీ అభిమానిగానే ఉంటాను.’’

కె. వెంకటేష్‌, ఫొటోలు: ముచ్చర్ల విజయ్‌


రహస్య జీవితం అనంతరం అఖిల భారత మహిళా సమాఖ్య నాయకురాలిగా కొంతకాలం పనిచేశాను. మహిళల సమస్యలకు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తూ, రకరకాల కార్యక్రమాలు నిర్వహించాను. 1952లో... తొలి ఎన్నికలప్పుడు భుజానికి డక్కలి తగిలించుకొని నల్గొండ జిల్లాలో ఊరూరా తిరుగుతూ ‘బండెనక బండి కట్టి..’ లాంటి గీతాలు పాడుతూ ప్రజలను చైతన్యపరిచేవాళ్లం. అప్పటి కన్నా ఇప్పుడు మహిళా సంఘాల బాధ్యత మరింత పెరిగింది. నిన్నగాక మొన్న హైదరాబాద్‌లో ఆరేళ్ల పాపపై అఘాయిత్యం వార్త విన్నప్పుడు గుండె తరుక్కుపోయింది.


ఒక్క రూపాయి పంచలేదు...

‘‘డబ్బులు తీసుకొని ఓటు వేసే సంస్కృతి మొదలైనప్పుడే దేశ రాజకీయం భ్రష్టుపట్టింది. నా భర్త దొడ్డా నర్సయ్య 1957లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదీ ఒక్క రూపాయి పంచకుండా! తర్వాత ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడూ ఒక్క పైసా ఖర్చుపెట్టలేదు. ఒక ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చి, పార్టీ ఇచ్చే 250 రూపాయల గౌరవ వేతనాన్ని తీసుకునేవారు. నియోజకవర్గ పర్యటనకైనా, అసెంబ్లీకైనా బస్సులోనే ప్రయాణించేవారు. సెక్యూరిటీ గార్డులు, గన్‌మెన్ల లాంటి హంగు, ఆర్భాటాలేవీ ఉండేవి కావు. ఆనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా అలానే అతి నిరాడంబరంగా జీవించారు. కనుకే ప్రజా నాయకులుగా వారంతా జనం గుండెల్లో నిలిచారు. నా భర్త చనిపోయి ఇరవై ఏళ్లు దాటినా, ఇప్పటికీ మా నియోజకవర్గ ప్రజలు ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారు.’’

Updated Date - 2021-09-16T09:10:31+05:30 IST